Published On: Wed, Jun 19th, 2019

త్వరలో 2,766 అటవీ పోస్టుల భర్తీ

* రాష్ట్ర అటవీ, పర్యావరణ, విద్యుత్, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

* ఇప్పటికే 504 పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ

* మిగిలిన పోస్టులు దశలవారీగా భర్తీ

* రాష్ట్రంలో 6 బొటానిక్ గార్డెన్ల ఏర్పాటు

* 5 నగర వనాలు, 5 పర్యాటక పర్యావరణ కేంద్రాలు కూడా…

* ఎర్ర చందనం పరిరక్షణకు రెడ్ సాండర్స్ టాస్క్ ఫోర్స్

* ఏడాదిలో 25 కోట్ల మొక్కల నాటే కార్యక్రమం

* ‘ఉపాధి’లో రూ.175 కోట్లతో ప్లాంటేషన్

* ఏనుగుల దాడిలో మృతి చెందితే రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా,

* ఎక‌రా పంటకు రూ.6 వేల నష్ట పరిహారం చెల్లింపు

* అటవీ విస్తీర్ణం పెంపుదలలో దేశంలో మనమే ఫస్ట్: మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 2,766 పోస్టులను దశల వారీగా భర్తీ చేయనున్నామని, ఇప్పటికే 504 పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీచేశామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, విద్యుత్, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్రంలో 6 బొటానికల్ గార్డెన్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐ.ఎఫ్.ఎస్.ఆర్. 2017 నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2,141 చదరపు కిలో మీటర్ల అటవీ విస్తీర్ణం పెరిగి దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనానికి పెద్దపీట వేస్తోందని, దీనిలో భాగంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నామని వెల్లడించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సీఎఎంపీఏ పథకాల ద్వారా రూ.175 కోట్ల విలువ చేసే చెట్లు నాటనున్నామన్నారు.

రూ.54.30 కోట్లతో పర్యావరణ పర్యాటక కేంద్రాలు, నగర వనాలు …
రూ.54.30 కోట్ల వ్యయంతో 5 పర్యావరణ పర్యాటక కేంద్రాలు, మరో 5 నగర వనాలు నిర్మించనున్నామని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో 12 నగర వనాలు ఉన్నాయని, కొత్తగా రూ.30 కోట్లతో 5 నగర వనాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో 22 పర్యాటక పర్యావరణ కేంద్రాలను గతంలో ఏర్పాటు చేశారన్నారు. ఈ ఏడాది రూ.22.30 కోట్లతో మరో 5 పర్యాటక పర్యావరణ కేంద్రాలు ఏర్పాటుచేయనున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 బొటానికల్ గార్డెన్లను కూడా కొత్తగా ఏర్పాటు చేయబోతున్నామని మంత్రె వెల్లడించారు.

287 మందితో రెడ్ సాండర్స్ టాస్క్‌ఫోర్స్ …
అటవీశాఖ వద్ద ప్రస్తుతం 5 వేల మెట్రిక్ టన్నుల ఎర్ర చందనం నిల్వలు ఉన్నాయని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిల్వ ఉన్న ఎర్ర చందనాన్ని విక్రయించనున్నామన్నారు. ఎర్ర చందనం వృక్షజాతి పరిరక్షణకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఎర్ర చందనం పరిరక్షణకు 287 మందితో రెడ్ సాండర్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని, వారికి తుపాకులు అందజేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే 125 రివార్వర్లను కొనుగోలు చేశామని, మరో 250 పంపు యాక్షన్ తుపాకులు అందజేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని మంత్రి వెల్లడించారు. రెడ్ సాండర్స్ టాస్క్ ఫోర్స్ కు ఐ.జి. స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారన్నారు.

రూ.25.20 కోట్ల వైఎస్ఆర్ స్మృతి వనం అభివృద్ధి…
రాష్ట్ర అటవీ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నిర్ణయించినట్లు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రస్తుతం అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 2,766 పోస్టులను దశలవారీగా భర్తీ చేయాలని నిర్ణయించామని, ఇప్పటికే 504 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీచేశామని వెల్లడించారు. పావురాళ్ల గుట్టలో ఉన్న వైఎస్ఆర్ స్మృతి వనాన్ని అభివృద్ధి చేయనున్నామని, ఇందుకోసం రాబోయే 5 ఏళ్లలో రూ.25.20 కోట్లను వెచ్చించనున్నామని మంత్రి తెలిపారు.

ఏనుగుల దాడి బాధితులకు నష్టపరిహారం…
ఇటీవల కాలంలో ఒడిశా రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల గ్రామాలపై ఏనుగుల దాడులు పెరిగిపోయాయని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏనుగుల గుంపు దాడుల్లో పంట నష్టంతో పాటు కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారన్నారు. బాధితులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఎకరాకు రూ.6 వేలు చొప్పున పరిహారం, ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నామని మంత్రి తెలిపారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఏనుగు దాడిలో ఇద్దరు మహిళలు మృతిచెందారని, వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం త్వరలో అందజేయనున్నామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర అటవీ ప్రధాన సంరక్షణ అధికారి డాక్టర్ మహ్మద్ ఇలియాస్ రిజ్వి, పీసీసీఎఫ్(ఎఫ్.ఆర్.) డాక్టర్ భాస్కర్ రమణమూర్తి, వన్యప్రాణుల ముఖ్య సంవరక్షణ అధికారి నళిని మోహన్‌తో పాటు పలువురు అటవీ శాఖాధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పాల్గొన్నారు.

Just In...