తరగతి గదులు ఇలాగేనా ఉండేది…
* స్టోర్ రూములను తలపించిన తరగతి గదులు
* ఆగ్రహం వ్యక్తం చేసిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ హైమావతి
* మున్సిపల్ హైస్కూల్స్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన వైనం
విజయవాడ, సెల్ఐటి న్యూస్: విద్యార్థులు విద్యనభ్యసించే తరగతి గదులు స్టోర్ రూములను తలపిస్తున్నాయని, తరగతి గదులు ఇలాగేనా ఉండేదంటూ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ హైమావతి సంబంధిత నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విజయవాడలోని సూర్యారావుపేటలో ఉన్న ఎస్.కె.ఆర్ మున్సిపల్ హైస్కూల్ ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల్లో నెలకొని ఉన్న అపరిశుభ్ర వాతావరణం విద్యార్థులు కూర్చునే తరగతి గదులలో వివిధ రకాలైన పనికిరాని సామాగ్రిని ఉంచడమే కాకుండా తరగతి గదులను స్టోర్ రూమ్లలాగా మార్చారని మండిపడ్డారు. క్లాస్ రూముల్లో ఉంచిన ఐరన్, బెంచీలు, ఇన్వెర్టర్లు వలన చాలామంది గాయపడ్డామని విద్యార్థులు బోరుమంటూ వారి గాయాలు హైమావతికి చూపించారు. విద్యార్థులు కూర్చునే ప్రాంతం శుభ్రమైన వాతావరణంలో ఉండాల్సిన దానికి బదులుగా అపరిశుభ్ర వాతావరణంలో పిల్లలను కూర్చోబెట్టి విద్యాబోధన చేస్తున్నారని, తరగతి గదులు భూత్ బంగ్లాలను తలపిస్తున్నాయన్నారు. ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు అందుతున్న రాయితీలు గురించి ప్రస్తావించగా ఇప్పటివరకు యూనిఫార్మ్ ఒక జత అందిందని, మధ్యాహ్న భోజనంలో రాళ్ళూ వస్తున్నాయని అందువలన చాలమంది ఇంటి నుండి క్యారేజ్ తెచ్చకుంటున్నారని అన్నారు. భోజనం విషయమై చాలాసార్లు ప్రధానోపాధ్యాయులకు పిర్యాదు చేసిన ఎటువంటి మార్పు రాలేదన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ విద్య యొక్క ప్రాధాన్యత గురించి వివరిస్తూ ఎవరైనా పిల్లలు మధ్యలో బడి మానేసిన, బడికి వెళ్లకుండా ఇంటివద్దే ఉన్న లేదా బడికి రాకుండా పనులకు వెళ్తున్న ఆ పిల్లల యొక్క వివరాలని ఉపాధ్యాయులకు గాని లేదా సంబంధిత అధికారులకు తెలియజేస్తే వారిని బడిలో చేర్పించవచ్చని అన్నారు. అలాగే వారు ఉండే ప్రాంతాలలో జరుగుతున్న బాల్యవివాహాలు, బాల బాలికలపై ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వ్యక్తులెవరైనా తెలిసి, తెలియక పోయిన వారి పద్ధతి ఇబ్బంది పెట్టె విధంగా ఉంటె వెంటనే అక్కడి నుండి దూరంగా వెళ్లడం, అలాగే ఆ విషయాన్నీ దాటకుండా తల్లిదండ్రులకు గాని లేదా నమ్మకమైన వ్యక్తులకు గాని చెప్పి సహాయం పొందడమే కాకుండా సమస్యను పరిష్కరించవచ్చని సూచించారు. విద్యార్థులందరూ చక్కని ప్రణాళికలను ఏర్పాటు చేసుకుని వాటిని చేరుకునే దిశలో మార్గాన్ని ఎంచుకోవాలని అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న బాలల కేంద్రీకృత అభివృద్ధి పథకాలు అమ్మఒడి, నాడు-నేడు, నో బాగ్ డే మొదలైనవి వినియోగించుకుని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి కి చేరుకునే లక్ష్యంగా ప్రయత్నించాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ పాఠశాలలో గుర్తించిన సమస్యలన్నింటిని త్వరితగతిన పూర్తి చేయాలని, పిల్లలకు ప్రమాదంగా అనిపించేవి అన్ని తరగతి గదులలో నుండి వెంటనే తీసివేయాలని సూచించారు.