Published On: Wed, Mar 6th, 2019

దక్షిణ కొరియాకు ఏపీ రొయ్యలు, మామిడి

* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ‌

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠాను దక్షిణ కొరియా ప్రతినిధులు బుధవారం సచివాలయంలోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఏపీ ఎకనామిక్ డవలప్‌మెంట్ బోర్డు సీఈవో జె.కృష్ణకిషోర్ ద‌క్షిణకొరియా ప్రతినిధులను సీఎస్‌కు పరిచయం చేశారు. తమ దేశానికి రొయ్యలు, మిరప, మామిడి ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతి చేయాలని భారతదేశంలోని దక్షిణ కొరియా జనరల్ కౌన్సిల్ జియోంగ్ డాక్‌మిన్ కోరారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో తమ దేశంలో యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని, దీనికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. దీనిపై సీఎస్ అనిల్‌చంద్ర పునేఠ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అవుతున్న మామిడి, ఆక్వాకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు. విదేశీ అవసరాలకు తగ్గట్లుగా ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామన్నారు. రొయ్యలు, మిరప, మామిడి ఉత్పత్తులను దక్షిణ కొరియాకు ఎగుమతి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఏపీ ఎకనామిక్ డవలప్ మెంట్ బోర్డు సీఈవో జె.కృష్ణకిషోర్, రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ రామ్‌శంకర్ నాయక్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో కొరియా ప్రతినిధులు, ఈడీబీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Just In...