Published On: Thu, Jul 23rd, 2020

దాదాపు రూ.4వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్‌ బలోపేతం

* ప్రతి ఆర్‌బీకే పరిధిలో గోదాములు, గ్రేడింగ్, సార్టింగ్‌ యంత్రాలు

* ప్రతి మండలంలో కోల్డ్‌ స్టోరేజీ లేదా కోల్డ్‌ రూమ్‌ల ఏర్పాటు

* రాష్ట్రంలో గోదాములు, శీతల గిడ్డంగుల ఏర్పాటుపై సీఎం సమీక్ష

* రైతుల ఉత్పత్తుల మార్కెటింగ్‌లో ఆర్‌బీకేలది కీలకపాత్ర

* రైతుల తమ పంటలపై ఆర్‌బీకేలకు సమాచారం ఇస్తారు

* ఆ సమాచారం సెంట్రల్‌ సర్వర్‌కు చేరాలి

* రైతులు తమ పంటలు అమ్ముకోవడంలో మార్కెటింగ్‌ శాఖ తోడ్పడాలి

* అవసరమైతే ధరల స్థిరీకరణ నిధితో ఆ శాఖ రైతులను ఆదుకోవాలి

* మొత్తం ఈ ప్రక్రియపై వెంటనే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలి

* ఖరీఫ్‌ పంట చేతికొచ్చే సెప్టెంబరు నాటికి ఆ సాఫ్ట్‌వేర్‌ రూపొందాలి

* సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్రంలో గోదాములు, శీతల గిడ్డంగుల ఏర్పాటుపై సీఎం వైయస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష జరిపారు. మంత్రి కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యతో పాటు, మార్కెటింగ్, ఆర్థిక శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

పంటల అమ్మకాలు–సాఫ్ట్‌వేర్‌…
రాష్ట్రంలో దాదాపు రూ.4వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్‌ను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రకటించారు. ప్రతి రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే) పరిధిలో గోదాములు, గ్రేడింగ్, సార్టింగ్‌ యంత్రాల పరికరాలు అందుబాటులోకి తెస్తామని ఆయన వెల్లడించారు. రైతులకు ఉపయోగపడే విధంగా ప్రతి మండలంలో కోల్డ్‌ స్టోరేజీ లేదా కోల్డ్‌ రూమ్‌ల ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. రైతులు తమ పంటలకు సంబంధించిన సమాచారాన్ని ఆర్‌బీకేలకు ఇస్తారని, అక్కణ్నుంచి ఆ సమాచారం సెంట్రల్‌ సర్వర్‌కు చేరుతుందని సీఎం తెలిపారు. ఈ సమాచారాన్ని అందుకోగానే రైతుల పంట కొనుగోలు జరిగేలా చూడాలన్నారు. కనీస గిట్టుబాటు ధరకన్నా.. తక్కువకు అమ్ముకునే పరిస్థితులు ఉంటే ధరల స్థిరీకరణద్వారా ఆదుకోవాలని సీఎం స్పష్టంచేశారు. ఈ మొత్తం ప్రక్రియ సాఫీగా సాగడానికి ఒక సాఫ్ట్‌వేర్‌ను సెప్టెంబర్‌కల్లా తయారుచేయాలని సీఎం ఆదేశించారు. ఖరీఫ్‌ పంట చేతికి వచ్చేనాటికి పూర్తిగా అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

అన్ని చోట్లా గోదాములు..
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయదలచిన గోదాములు తదితర అంశాలపై అధికారులు సీఎంకు వివరాలు అందించారు. గత సమావేశాల్లో సీఎం ఇచ్చిన ఆదేశాల ప్రకారం గోదాముల మ్యాపింగ్‌ను వివరించారు. దశలవారీగా కాకుండా ఒకేసారి గోదాముల నిర్మాణం చేపట్టాలని సీఎం స్పష్టంచేశారు. ప్రతి వైయస్సార్‌ రైతు భరోసా కేంద్రంలోనూ గోదాములు నిర్మించాలని స్పష్టంచేశారు.

ఆర్‌బీకేలు–గోదాములు–సదుపాయాలు..
ఆర్‌బీకేలకు అనుబంధంగా నిర్మించే గోదాముల్లో సార్టింగ్, గ్రేడింగ్‌ యూనిట్లు కూడా ఏర్పాటు చేయాలని సీఎం నిర్దేశించారు. వీటికోసం సుమారుగా సుమారు రూ.350 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆయా ఆర్బీకేల పరిధిలో పండే పంటలను దృష్టిలో ఉంచుకుని ఈ పరికరాలను కొనుగోలు చేయాలని ఆదేశించారు. అలాగే ప్రతి ఆర్బీకేలో తేమను కొలిచే యంత్రం, వేయింగ్‌ బాలెన్స్, కాలిపెర్స్, లాబ్‌వేర్‌లు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం దాదాపు రూ.92.2 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెప్పారు.

కోల్డ్‌ స్టోరేజీలు..
రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించే ప్రక్రియలో వాటిని నిల్వ చేయడం కోసం ప్రతి మండలంలో కోల్డ్‌ స్టోరేజీ లేదా కోల్డ్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ముఖ్యంగా టమోటా, చీనీ, అరటి వంటి పంటలను నిల్వ చేసుకునే విధంగా సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని ఆయన నిర్దేశించారు. ఈ మేరకు రైతుల అవసరాలకు అనుగుణంగా, పంటలకు తగిన విధంగా కూడా కోల్డ్‌ స్టోరేజీలు, కోల్డ్‌ రూంల ఏర్పాటుపై మ్యాపింగ్‌ చేయాలని సీఎం కోరారు. అదే విధంగా అక్కడే ఫుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్లను కూడా ప్రోత్సహించాలని సూచించారు. కాగా, గోదాములకు, కోల్డ్‌ స్టోరేజీలు, కోల్డ్‌ రూమ్‌లు, ఆర్‌బీకేలలో  గ్రేడింగ్, సార్టింగ్‌ల పరికరాలు, యంత్రాల కోసం దాదాపు రూ.4 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేయగా, ఆ మేరకు వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌..
రైతుల ఉత్పత్తులలో స్థానిక మార్కెట్లు, జనతా బజార్ల ద్వారా కనీసం 30 శాతం విక్రయాలు జరగాలన్న సీఎం వైయస్‌ జగన్, మిగిలిన 70 శాతం పంటలను విక్రయించేందుకు మార్కెటింగ్‌ శాఖ కృషి చేయాలని నిర్దేశించారు. రైతుల ఉత్పత్తులకు డిమాండ్‌ తీసుకు రావడం, వాటి కొనుగోలు జరిగేలా చేయడం ఆ శాఖ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ఏయే పంటలకు ఎక్కడెక్కడ డిమాండ్‌ ఉంది అన్న వివరాలతో పాటు, అన్ని చోట్ల వ్యాపారులకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించాలని, ఆ మేరకు డేటా బేస్‌ రూపొందించాలని సీఎం సూచించారు. కాగా, రైతులు తమ ఉత్పత్తుల వివరాలను ఆర్‌బీకేలలో అందివ్వగానే, అది మెయిన్‌ సర్వర్‌కు చేరుతుందని మార్కెటింగ్‌ అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఆ పంటలకు ఎక్కడెక్కడ డిమాండ్‌ ఉందన్న సమాచారంతో పాటు, వ్యాపారుల వివరాలు కూడా రైతులకు వెంటనే తెలుగు భాషలో తెలియజేసేలా సదుపాయం, ఆర్‌బీకేలలో ఉంటుందని అధికారులు చెప్పారు. వీటన్నింటి వల్ల రైతుల ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధర వస్తుందని వివరించారు.

 

Just In...