Published On: Mon, Nov 5th, 2018

దీపావళికి ముందే తుపాన్ బాధితులకు చెక్కులు పంపిణీ

* ‘నీరు-ప్రగతి’ పురోగతిపై టెలికాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు
సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ‘‘విపత్తు బాధితులకు సకాలంలో సాయం సరైన ఊరట లభిస్తుంది. తిత్లి తుపాన్ బాధితులకు సాయం అందించడంపై కేంద్రం నిర్లక్ష్యం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సొంత వనరులతోనే బాధితులకు సాయానికి నడుం కట్టాం. దీపావళికి ముందే బాధితులకు సహాయం అందించాలని ఆదేశించాం. అన్న మాట ప్రకారం ఈ రోజే చెక్కులు పంపిణీ చేస్తున్నాం. రెండు జిల్లాలలో రూ.530కోట్లు సహాయంగా అందజేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం తన నివాసం నుంచి నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 15 రోజుల్లోనే సాధారణ పరిస్థితులు తీసుకువచ్చామని, 25 రోజుల్లోనే పరిహారం అందజేస్తున్నామని, వేలాది మంది సిబ్బంది, కార్మికులు చెమటోడ్చారు, బాధిత ప్రజానీకానికి అండగా నిలబడ్డారంటూ, ఈ యజ్ఞంలో పాల్గొన్న అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
బాధ్యతాయుతమైన పాలనకు చిరునామా ఆంధ్రప్రదేశ్..
‘‘బాధ్యతాయుతమైన పాలనకు చిరునామా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆర్టీజి, 1100 పరిష్కార వేదిక ఒక నమూనా అయ్యాయి. అవినీతి రహిత రాష్ట్రాలలో 3వ స్థానంలో ఉన్నాం. ఇందులో నెంబర్ వన్ స్థానం చేరుకోవాలి. మన జల సంరక్షణ, కన్వర్జెన్స్, ఉబరైజేషన్ తో వినూత్న ఫలితాలు సాధిస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి తెలిపారు. లోటు వర్షపాతంలో కూడా నెల్లూరుకు 40టిఎంసిలు తీసుకెళ్లామంటూ, వానలు పడకపోయినా రైతుల్లో భరోసా ఇచ్చామని అన్నారు. బాపట్లలో రైతుల పట్ల వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తనాల పాకెట్లను తారుమారు చేసి సరఫరా చేయడంపై మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించారు. విత్తన పాకెట్లు తారుమారు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.దీనివల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. ‘‘రబీలో 100% కంటె అధికంగా సాగుచేసిన జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. రబీలో నాట్లు త్వరితగతిన వేసేలా చూడాలి. ఎగువనుంచి వరద ప్రవాహాలు లేవు. వర్షపాతంలో తీవ్ర లోటు ఉంది. కాబట్టి ప్రతి నీటిచుక్కను సద్వినియోగం చేయాలి.వ్యవసాయ దిగుబడులు తగ్గకుండా చూడాలి. అధిక ఉత్పాదన వచ్చే మేలైన పద్ధతులు చేపట్టాలి. కరవు బాధిత రైతులకు ఇన్ పుట్ సబ్సిడి అందించాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
‘ఆదరణ’లో రూపాయి అవినీతి జరిగినా సహించను.. 
ఆదరణ-2 లబ్దిదారుల ఎంపిక వేగవంతం చేయాలన్నారు. యూనిట్ల మంజూరు శరవేగంగా పూర్తిచేయాలని సూచించారు. 2 నెలల్లో 8 లక్షల యూనిట్లు పంపిణీ చేయాలంటూ, ఒక్క పైసా అవినీతి జరిగినా సహించేదిలేదని హెచ్చరించారు.
‘‘అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. స్వైన్ ఫ్లూ,డెంగీ పై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.ఎక్కడా మందుల కొరత లేకుండా శ్రద్ధ వహించాలి’’ అని ఆదేశించారు. ‘‘ఉపాధి హామీ పనులు ముమ్మరం చేయాలి. మెటీరియల్ కాంపోనెంట్ నిధులు పెంచుకోవాలి. గ్రామాల్లో సిమెంట్ రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలి. గ్రామీణ  పర్యాటకాన్ని ప్రోత్సహించాలి’’ అని సూచించారు. ఆవిష్కరణలు నిరంతరం కొనసాగాలని, సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని దిశా నిర్దేశం చేశారు. టెలికాన్ఫరెన్స్ లో వ్యవసాయం, జలవనరులు, గ్రామీణాభివృద్ధి,రియల్ టైమ్ గవర్నెన్స్, సంక్షేమం, సమాచార శాఖాధికారులు రాజశేఖర్, శశిభూషణ్, జవహర్ రెడ్డి, అహ్మద్ బాబు, ఉదయలక్ష్మి, రామాంజనేయులు తదితరులు, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

Just In...