Published On: Fri, May 29th, 2020

దీపావ‌ళి నాటికి ఆరోగ్య‌శ్రీని విస్త‌రిస్తాం…

* మూడేళ్ల‌లో స‌మూల మార్పులు

* వైద్య ఆరోగ్య శాఖ‌పై మేథోమ‌ధ‌న స‌ద‌స్సులో సీఎం జ‌గ‌న్‌

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: *ఆంధ్ర‌ప్ర‌‌దేశ్‌‌లో వైద్య రంగాన్ని బ‌లోపేతం చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెలిపారు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో స‌దుపాయాలు క‌ల్పించ‌డం స‌హా కార్పోరేట్ స్థాయి వైద్య‌సేవ‌లు అందిస్తామ‌ని పేర్కొన్నారు.* ఏడాది పాల‌న పూర్తి చేసుకోబోతున్న నేప‌ధ్యంలో వైద్య ఆరోగ్య శాఖ‌పై సీఎం జ‌గ‌న్ మేథోమ‌ధ‌న స‌ద‌స్సు నిర్వ‌హించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో శుక్ర‌వారం జ‌రిగిన మ‌న పాల‌న మీ సూచ‌న కార్య‌క్ర‌మంలో మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, ఇత‌ర ఉన్న‌‌తాధికారుల‌తో జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఏడాది కాలంలో ‌వైద్య ఆరోగ్య శాఖ‌లో ప్ర‌భుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై సీఎం జ‌గ‌న్ ప్ర‌ధానంగా చ‌ర్చించారు. సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ ఏడాది కాలంలో వివిధ పథకాలు అమలు చేస్తూనే ఆరోగ్య రంగంలో రెండు అడుగులు ముందుకు వేశాం. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు ఆలోచన చేశాం. అత్యున్నత స్థానంతో అడుగులు ముందుకు వేయగలిగాం. గత ప్రభుత్వం బకాయిలు పెట్టినా కూడా ముందుకు వెళ్లాం. ఆరోగ్య రంగం అనగానే మనకు గతంలో 108, 104 సర్వీసులు, కుయ్‌ కుయ్‌ అన్న శబ్ధం వినిపించేది. పేదలు అప్పుల పాలయ్యే పరిíస్థితి రెండు సందర్భాలలో వస్తుంది, ఒకటి అనారోగ్యం. రెండోది పిల్లల ఫీజులు. అందుకే వైయస్సార్‌ ఈ రెండింటికీ ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఆయన తర్వాత ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి ఏమిటో చూశాం. ఆస్పత్రుల్లో పిల్లలను ఎలుకలు కొరికాయి, సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులో ఆపరేషన్లు చేశారు. అంత దారుణ స్థితిలో ఆస్పత్రులు పని చేశాయి. గత ప్రభుత్వ హయాంలో ఆస్పత్రుల్లో కాంట్రాక్టు రూపంలో డబ్బులు ఇచ్చినా, సేవలు మాత్రం అందలేదు. ఆ పరిస్థితి మార్చాలని నిర్ణయం తీసుకున్నాం. అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది మేనిఫెస్టోలో పెట్టాం. అది కేవలం రెండు పేజీలు మాత్రమే. ఇవాళ అందరి దగ్గర ఆ మేనిఫెస్టో ఉంది. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల వార్షికాదాయం ఉన్న వారికి కూడా పెంచాం. జీఓ కూడా ఇచ్చాం. ఇవాళ ఆరోగ్యశ్రీ పరిధిలో 1.42 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తింప చేశాం. ఆరోగ్యశ్రీ పరిధిని 2 వేల వ్యాధులకు విస్తరిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు అమలు చేశాం. ఈ జూలై 8 నాటికి మరో 6 జిల్లాలలో ఆ ప్రాజెక్టు విస్తరణ. మిగిలిన 6 జిల్లాలలో నవంబరులో దీపావళి నుంచి అమలు. అంటే 2 వేల వ్యాధులకు పథకం వర్తిస్తుంది. ఇప్పటికే 1200 జబ్బులకు పథకం వర్తింపచేస్తున్నాం. క్యాన్సర్‌ ఉన్న వారికి కూడా ఆరోగ్యశ్రీ పథకం వర్తింప చేస్తున్నాం. గతంలో వినికిడి లోపం ఉంటే, (మూగ చెవుడు ఉంటే) కాక్లెయిర్‌ ఆపరేషన్‌ (సింగిల్‌) చేయించాలంటే కూడా చాలా కష్టంగా ఉండేది. పాదయాత్రలో నన్ను చాలా మంది అడిగితే నేను స్వయంగా ఆపరేషన్లు చేయించాను. ఇవాళ డబుల్‌ కాక్లెయిర్‌ ఆపరేషన్లు, బ్యాటరీ, స్పీచ్‌ థెరపీ కూడా పథకంలోకి తీసుకువచ్చాం. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు దాదాపు 132 ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో నగరాల్లో వారికి ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. పథకాన్ని ఇంకా బలోపేతం చేస్తున్నాం. పేదలు అప్పులపాలు కాకూడదు. అదే లక్ష్యం. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు గత ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడంతో అవి చికిత్సకు నిరాకరించాయి. రూ.682 కోట్ల బకాయిలు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించి, ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా చేశాం. దీంతో వారు చక్కగా సేవలందిస్తున్నారు. వాటికి గ్రేడింగ్‌ మొదలు పెట్టాం. బి–గ్రేడ్‌ ఆస్పత్రులన్నీ 6 నెలల్లో ఏ–కేటగిరీలోకి రావాలని నిర్దేశించాము. దీంతో అవి కూడా సౌకర్యాలు మెరుగుపర్చుకుంటున్నాయ‌ని తెలిపారు.

వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా…
ఆరోగ్యశ్రీలో రోగి వైద్యం చేయించుకుంటే, ఆ తర్వాత వైద్యులు సూచించినంత కాలం రోగికి ఆర్థిక సహాయం. రోజుకు రూ.225 చొప్పున లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలు సహాయం. ఇది విప్లవాత్మక మార్పు. గతంలో చేయి విరిగితే భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం లేదు. ఇంకా 9 రకాల దీర్ఘకాల వ్యాధులతో బాధ పడే వారికి నెలకు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు ఇస్తున్నాం. పాదయాత్రలో చాలా మందిని చూశాను. మంచానికి పరిమితమైన వారిని కూడా. కుష్టు వ్యాధిగ్రస్తులకు రూ.3 వేలు.
బోధకాలు, పక్షవాతం, గుండె ఆపరేషన్, కిడ్నీ మార్పిడి, తలసేమియా, డయాలసిస్‌ రోగులు, హీమోఫీలియా, సికిల్‌సెల్‌ బాధితులకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల పింఛను వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నాం. ఇళ్లకే వెళ్లి ఇస్తున్నాం.
ఆరోగ్యశ్రీ కార్డులు. ప్రతి కుటుంబానికి ఇవ్వడానికి చర్యలు. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్న వారికి కార్డులు. వాటికి క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. అందులో ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని రిపోర్టులు ఉంటాయి. కాబట్టి ఆస్పత్రులకు రిపోర్టులు కూడా తీసుకుపోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో మొత్తం 1.42 కోట్ల మందికి ఈ కార్డులు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికే 1.33 కోట్ల మందికి. మిగిలిన వారికి మరో 2 వారాల్లో అందజేస్తాం. ఇది కూడా కోవిడ్‌ వల్ల జాప్యం అయింది. ఇక ఆస్పత్రుల్లో ఔషధాలు. (మందులు) గతంలో వాటిని తీసుకోవాలంటే భయంగా ఉండేది. అవి కల్తీ అన్న మాట ప్రతి నోటా వినిపించేది.గతంలో మందులు 230 రకాలు ఉంటే, వాటిని 500 రకాలకు పెంచాం. గుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్రాక్టీసెస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా వాటిని అందుబాటులో ఉంచాం. నాకే కాదు, ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తికి బాగా లేకున్నా మన ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే మంచి మందులు దొరుకుతాయని గర్వంగా చెబుతున్నాను. ఇప్పుడున్న ఎన్‌ఈబీఎల్‌ ల్యాబ్‌లు 4 నుంచి 6కు పెంచాం. మూడు ప్రాంతీయ డ్రగ్‌ స్టోర్ల ఏర్పాటుకు నిధులు మంజూరు. నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఏడాది కాలంలో ఆరోగ్యశ్రీకి మెరుగు కార్యక్రమాల్లో నా మనసుకు నచ్చింది కంటివెలుగు. రాష్ట్రంలో ఉన్న వారికి కంటి వైద్య పరీక్షల కోసం రూ.560 కోట్లతో కార్యక్రమానికి శ్రీకారం. తొలుత దాదాపు 70 లక్షల మంది పిల్లలకు కంటి పరీక్షలు చేశాం. వారిలో 4.36 లక్షల మంది పిల్లలకు దృష్టిలోపం ఉందని, 1.58 లక్షల మంది పిల్లలకు కళ్లజోళ్లు అవసరమని తేల్చగా, వారిలో 1.29 లక్షల మంది పిల్లలకు ఇప్పటికే కళ్లద్దాల పంపిణీ. స్కూళ్లు తెరవగానే వాటిని పంపిణీ చేస్తాం. దాదాపు 46 వేల మంది పిల్లలకు ఆపరేషన్లు చేయాలని తేల్చారు. వారికి కూడా రాబోయే రోజుల్లో ఆపరేషన్లు చేయిస్తాము. దసరా సెలవుల్లో దగ్గరుండి ఆపరేషన్లు చేయిస్తామని హామీ.
కంటి వెలుగు రెండో దశలో అవ్వా తాతలు. వారికి పరీక్షలు. కళ్లద్దాల పంపిణీ ఆపరేషన్లు చేయిస్తాం. కోవిడ్‌ వల్ల ఆగిపోయాయి.
గతంలో సదరమ్‌ క్యాంప్‌ల్లో (వికలాంగుల కోసం) గతంలో సర్టిఫికెట్‌ కోసం 4 నెలలు వేచి చూడాల్సి వచ్చేది. అప్పుడు కూడా అవి ఇచ్చే వారు కాదు. గతంలో 57 చోట్ల సదరమ్‌ క్యాంప్‌లు జరగ్గా, వాటిని 167కు పెంచాం. ప్రతి సీహెచ్‌సీలో సదరమ్‌ క్యాంప్‌ల నిర్వహణ. దీంతో కేవలం రెండు, మూడు వారాల్లోనే సర్టిఫికెట్లు జారీ చేయగలుగుతున్నాం.

నాడు–నేడు…
ఆస్పత్రుల రూపురేఖల మార్పు. ప్రస్తుతం ఆస్పత్రుల పరిస్థితిపై ఫోటో. ఆ తర్వాత మూడేళ్లలో మార్పులు చేసి ఫోటోలు చూపుతాం.సబ్‌ సెంటర్లు, పీహెచ్‌సీలు, çసీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తాం.మొత్తంగా 27 టీచింగ్‌ ఆస్పత్రులు ఉండేలా చూస్తున్నాం.
ఇప్పుడు 11 టీచింగ్‌ ఆస్పత్రులు ఉంటే మరో 16 ఏర్పాటు చేస్తున్నాం. దీంతో 27 టీచింగ్‌ ఆస్పత్రులు అవుతాయి.
ఐటీడీఏ పరిధిలో కొత్తగా 7 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు. వీటన్నింటి కోసం దాదాపు రూ.16 వేల కోట్లు ఖర్చు చేసి ఆస్పత్రుల రూపు రేఖలు మార్చబోతున్నాం. కార్పొరేట్‌ ఆస్పత్రుల స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రులను మారుస్తాం. ప్రతి ఊరి రూపురేఖలు మార్చబోతున్నాం. 2 వేల జనాభా ఉన్న గ్రామంలో సచివాలయం, వలంటీర్ల సేవలు, ఇంగ్లిష్‌ మీడియమ్‌ స్కూల్, ఒక విలేజ్‌ క్లినిక్‌. ఆ క్లినిక్‌లో ఆశా వర్కర్లు రిపోర్టు చేస్తారు. ఏఎన్‌ఎం నర్సు ఉంటారు. అక్కడ 54 రకాల మందులు కూడా ఉంటాయి. ఆ క్లినిక్‌లు ఆరోగ్యశ్రీకి రెఫరల్‌ పాయింట్‌గా పని చేస్తాయి. 108, 104 సర్వీసులు 20 నిమిషాల్లో చేరుకుంటాయి.
దాదాపు 13 వేలకు పైగా విలేజ్‌ క్లినిక్‌లు, వార్డు క్లినిక్‌ల నిర్మాణానికి శ్రీకారం. రూ.2600 కోట్ల వ్యయంతో వచ్చే మార్చి 31 నాటికి పూర్తి. ఆస్పత్రుల రూపురేఖలు మార్పు – పీహెచ్‌సీలు. నాడు–నేడు కొత్తగా 149 పీహెచ్‌సీలు. దాదాపు 1138 పీహెచ్‌సీల మార్పులు. రూ.671 కోట్లు. ఇప్పటికే పనులు మొదలు పెట్టారు. వాటిని కూడా మార్చి నాటికి పూర్తి చేస్తాం. 52 ఏరియా ఆస్పత్రుల రూపురేఖలు మార్పు. రూ.695 కోట్లతో టెండర్లు. 169 సీహెచ్‌సీల రూపురేఖలు మార్పు. రూ.541 కోట్లతో టెండర్లకు సిద్ధం. 15 రోజుల్లో టెండర్లు పిలుస్తాం. ఇప్పుడున్న టీచింగ్‌ ఆస్పత్రుల రూపురేఖలు మార్చడం, కొత్తగా 16 టీచింగ్‌ ఆస్పత్రులు, గిరిజన ప్రాంతాల్లో 7 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల పనులకు ఆగస్టులో టెండర్లు. రూ.12,270 కోట్లు ఖర్చు. మూడేళ్లలో పనులు పూర్తి. 108, 104 సర్వీసులు గతంలో దారుణంగా ఉండేవి, అందువల్ల జూలై 1న విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ఒకేసారి 1060 వాహనాలు ప్రవేశపెడుతున్నాం. ఆరోజు నుంచి 108, 104 కొత్త సర్వీసులు సేవలందిస్తాయి. కోవిడ్‌ సమయంలో ఆరోగ్య రంగంపై ప్రత్యేక శ్రద్ధ. ఎవరికి ఏ వైద్యం అవసరం ఉన్నా, తోడుగా ఎలా ఉండాలన్న ఆలోచనతో వైయస్సార్‌ టెలి మెడిసిన్‌కు శ్రీకారం. 14410 నెంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు. ఈ సేవల కోసం దాదాపు 300 మంది వైద్యులు పని చేస్తున్నారు. మిస్డ్‌ కాల్‌ రాగానే, సెంటర్‌ నుంచి తిరిగి ఫోన్‌ చేస్తారు. రోగి వివరాలు తెలుసుకుని వెద్యులు మందులు ప్రిస్క్రైబ్‌ చేస్తారు. ఆ మందులను మర్నాడే రోగి ఇంటికి డోర్‌ డెలివరీ చేస్తారు. దీనికి ఇంకా మెరుగులు దిద్దడం కోసం జూలై 1 నుంచి ప్రతి పీహెచ్‌సీకి ఒక బైక్‌ కూడా సమకూరుస్తున్నాం. రోగి ఇంటికే వెళ్లి మందులు ఇస్తారు.
మన ఆస్పత్రుల్లో మెరుగైన సేవల కోసం మౌలిక సదుపాయాల కోసం అవసరమైన సిబ్బంది నియామకం. వైద్యులు, నర్సులు ఎందరు కావాలన్న దానిపై జాతీయ ప్రమాణాల (ఐపీహెచ్‌ఎస్‌) ప్రకారం చూస్తే, 9712 మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని నియమించాల్సి ఉంది. ఆ మేరకు వారం రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ. నెలన్నర వ్యవధిలో నియామకాలు పూర్తి చేస్తారు. ఆరోగ్యశ్రీలో ఇలాంటి అనేక కార్యక్రమాలు, మార్పులు చేస్తూనే, మరోవైపు కరోనా నియంత్రణ, నివారణ కోసం యుద్ధప్రాతిపదికన అడుగులు ముందుకు వేశాం. ఆ విధంగా సిబ్బంది సేవలందించారు. అందుకు అభినందించాలి. ఒక ల్యాబ్‌తో మొదలు కాగా, ఇప్పుడు జిల్లాకు ఒకటి చొప్పున 13 ల్యాబ్‌లు ఏర్పాటయ్యాయి.అదే విధంగా మరో 337 ట్రునాట్‌ యంత్రాలు సీహెచ్‌సీల్లో అందుబాటులోకి రానున్నాయి. కోవిడ్‌ రాకముందు రోజుకు కనీసం 2 పరీక్షలు చేసే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు రోజుకు 10 వేల నుంచి 11 వేల టెస్టులు చేసే సామర్థ్యానికి ఎదిగాం. ఇప్పటి వరకు దాదాపు 3.42 లక్షల పరీక్షలు చేసిన పరిస్థితి. 10 లక్షల జనాభాకు రాష్ట్రంలో 6627 పరీక్షలు చేశాం. ఇది దేశంలో అత్యధికం. దేశం మొత్తం మీద పాజిటివ్‌ కేసు రేటు 4.71 శాతం కాగా, మన రాష్ట్రంలో అది 0.95 «శాతం మాత్రమే. రికవరీ రేటు దేశంలో 42.75 ఉంటే మన రాష్ట్రంలో అది కేవలం 65.49 మాత్రమే. అదే విధంగా మరణాల రేటు దేశ సగటు 2.86 శాతం ఉంటే, మన దగ్గర 1.82 మాత్రమే అని చెప్పగలుగుతాం. కరోనా మీద యుద్ధంలో మనం దేశంలో అగ్ర స్థానంలో ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఈ అత్యవసర పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవడంలో సమాజాన్ని సిద్ధం చేశాం. కోవిడ్‌ అన్నది పోదు. దాంతో సహజీవనం చేయక తప్పదు. కోవిడ్‌ సోకితే వారిని దూరం చేయకండి. ఎందుకంటే రేపు ఎవరికైనా రావొచ్చు. 98 శాతం రికవర్‌ అవుతున్నారు. కేవలం 2 శాతం మాత్రమే చనిపోతున్నారంటే, అంత ప్రమాదం లేదు. 85 శాతం మంది కేవలం ఇంట్లోనే వైద్యంతో బయట పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎవరికైనా రావొచ్చు. వస్తుంది. పోతుంది. కాబట్టి సహజీవనం తప్పదు. మన ఇంట్లో పెద్దవారిని బాగా చూసుకోవాలి. ఈ స్టిగ్మా పోవాలి. వ్యాక్సీన్‌ ఎప్పుడు కనుగొంటారో తెలియదు. కాబట్టి అందరం అలవాటు చేసుకోవాలి. కోవిడ్‌ విషయంలో పూర్తి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో 5 ఆస్పత్రులు ఏర్పాటు. ప్రతి జిల్లాలో ఆస్పత్రులు ఉండే విధంగా మొత్తం 65 జిల్లా స్థాయి ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో 38 వేల ఐసొలేషన్‌ బెడ్లు రెడీగా ఉండగా, వాటిలో 15 వేల బెడ్లకు ఆక్సీజన్‌ సరఫరా సౌకర్యం ఉండగా, వాటిలో 5400 బెడ్లు ఐసీయూలో ఉన్నాయి. వాటిలోనూ 1350 బెడ్లకు వెంటిలేటర్లు రెడీగా ఉన్నాయి.
24 వేల మంది డాక్టర్లు, 22,500 మంది పారా మెడికల్‌ సిబ్బంది రెడీగా ఉన్నారు. ఆరోగ్యశ్రీని మెరుగు పర్చేందుకు సూచనలు సలహాలు ఇవ్వాల‌ని కోరారు.

      

Just In...