Published On: Wed, May 9th, 2018

దుమ్ము తుఫాను బీభత్సం..

* ఐదు రాష్ట్రాల్లో 124 మంది మృతి

సెల్ఐటి న్యూస్‌, జ‌న‌ర‌ల్ డెస్క్‌: ఉత్తరాదిలో దుమ్ము తుఫాను బీభత్సం కొనసాగుతోంది. ఐదు రాష్ట్రాల్లో 124 మంది చనిపోయారని… మూడు వందలమందికి పైగా గాయాలయ్యాయని అధికారులు చెప్పారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనే ఎక్కువ ప్రాణ నష్టం కనిపిస్తోంది. హర్యానాలో రెండురోజుల పాటు స్కూళ్లను బంద్ చేశారు. మరోవైపు.. మంగళవారం పదమూడు ఉత్తరాది రాష్ట్రాల్లో గాలివాన ప్రభావం ఉంటుందని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఉరుములతో కూడిన గాలివాన ఉత్తరాదిన 124 మందిని బలితీసుకుంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. మంగళవారం మరో భారీ దుమ్ము తుఫాను ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో.. ఐదు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. 13రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు భారీవర్ష సూచన చేసింది ఐఎండీ. పశ్చిమ యూపీ, తూర్పు రాజస్థాన్ లోనే ఇసుక తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లోనే వందమందికిపైగా చనిపోయినట్టు సమాచారం. యూపీలో 73 మంది… రాజస్థాన్ లో 35 మంది చనిపోయారు. రాజస్థాన్ ..బికనీర్ లోని ఖుజువాలా ప్రాంతాన్ని భారీ ఇసుక తుఫాను ముంచెత్తింది. ఇక్కడ రాబోయే మూడురోజులు హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. భారీ గాలివాన తుఫాను రానుందన్న వెదర్ అలర్ట్ తో… అప్రమత్తమైన ఢిల్లీప్రభుత్వం జిల్లాల అధికారులకు సూచనలు చేసింది. ఢిల్లీలో రేపు ఉదయం నుంచే వర్షం మొదలవుతుందని సమాచారం. పంజాబ్ లో వర్షాలు పడుతున్నాయి. వర్షంలో చండీగఢ్ తడిసి ముద్దయింది. అటు హర్యనాలోనూ గాలివాన, వర్షాలకు జనజీవనం ఇబ్బందులు పడుతోంది. సోమ, మంగళవారాలు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, బిహార్, అస్సోం, మేఘాలయ, వెస్ట్ బెంగాల్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో ఈదురుగాలులలో కూడిన వర్షం పడుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది.

Just In...