Published On: Thu, Nov 8th, 2018

దుర్గగుడి మొమెంటో కుంభకోణం..

* తయారీదారుకు నోటీసులు జారీచేసిన పోలీసులు!

* మొమెంటోల సంఖ్యను తప్పుగా చూపిన ఉద్యోగులు

* నలుగురిపై వేటు వేసిన ఈవో కోటేశ్వరమ్మ

* కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: బెజ‌వాడ కనకదుర్గమ్మ గుడిలో ఇటీవల వెలుగుచూసిన మొమెంటోల కుంభకోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఇందులోభాగంగా మొమెంటోలను తయారుచేసిన సంస్థ యజమాని రమేష్‌కు అధికారులు నోటీసులు జారీచేశారు. ఇందులో భాగంగా శుక్ర‌వారం విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని అందులో సూచించారు. మొమెంటోల తయారీకి వచ్చిన ఆర్డర్ వివరాలు, చెల్లించిన నగదు ఇతర కీలక ఆధారాలతో విచారణకు హాజరుకావాలన్నారు. దుర్గగుడిలో అమ్మవారి చీరల మాయం వ్యవహారం మర్చిపోకముందే తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ జరిపిన ఈవో కోటేశ్వరమ్మ.. ఏఈవో అచ్యుతరామయ్యతో పాటు మరో ముగ్గురు ఉద్యోగులు ఈ కుట్రలో పాలుపంచుకున్నారని తేల్చారు. కేవలం 1,200 మొమెంటోలను కొనుగోలు చేసి వాటి సంఖ్యను మాత్రం 2 వేలుగా చూపారని ఆమె గుర్తించారు. ఈ నేపథ్యంలో నలుగురిని విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే అచ్యుతరామయ్య తనను బెదిరిస్తున్నారని కోటేశ్వరమ్మ ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ మొమెంటోల వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేస్తున్నారు. అయితే వ‌రుస వివాదాల నేప‌ధ్యంలో దుర్గ‌గుడికి వ‌స్తున్న చెడ్డ పేరు భ‌క్తుల్లో తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం అవుతుంది. ఆధ్యాత్మికంతో ఫ‌రిఢ‌విల్లాల్సిన అమ్మ‌వారి ఆల‌యం రోజురోజుకు ప్ర‌తిష్ట దిగ‌జారిపోతుండటం ప‌ట్ల భ‌క్తులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Just In...