Published On: Wed, Jan 13th, 2021

దేశాన్ని అగ్రగామిగా ఉంచడంలో యువతదే కీలకపాత్ర..

* స్వామి వివేకానందకు నివాళులు అర్పించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ

విజ‌య‌వాడ‌, సెల్‌ఐటి న్యూస్‌: భారతదేశం కోసం స్వామి వివేకానంద తన జీవితాన్ని త్యాగం చేశారని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. స్వామి వివేకానంద 158 జయంతి సందర్భంగా విజ‌య‌వాడ మ‌హాత్మాగాంధీ రోడ్డు‌లోని రాఘవయ్యపార్క్ వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి బండారు దత్తాత్రేయ మంగ‌ళ‌వారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటు భారతీయులను జాగృతం చేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. వివేకానంద జీవితం యువతకు స్పూర్తిదాయకం అన్నారు. ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా ఉంచాలంటే యువత యొక్క పాత్ర ముఖ్యమైనదన్నారు. మాదకద్రవ్యాలకు బానిసవుతున్న యువతలో దేశభక్తి పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి సామాజిక రుగ్మతలను పారద్రోలేందుకు కృషి చేయాలన్నారు. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా నిరుద్యోగ సమస్య నిర్మూలన సాధ్యం అవుతుందన్నారు. తద్వారా స్వామివివేకానందకు నిజమైన నివాళి అర్పించిన వారమవుతామన్నారు. దేశంలోని యువతీ యువకులు స్వామి వివేకానందను స్పూర్తిగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

 

Just In...