Published On: Sat, Sep 9th, 2017

దేశాభివృద్ధిలో బాల‌లు భాగ‌స్వాములు కావాలి

* కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరమైనంత మేరకు మాత్రమే సద్వినియోగం చేసుకోవాలని, జ్ఞానం ధృడమైనది అనే విషయంలో సందేహం లేదని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, ఎర్త్ సైన్స్ శాఖా మంత్రి వై.సుజ‌నాచౌదరి పేర్కొన్నారు. సెప్టెంబ‌రు 9న (శనివారం) విజయవాడ బందరురోడ్డులోని అమరావతి కన్వెక్షన్ సెంటర్లో “నవభారత నిర్మాణం-మన సంకల్పం” ఛాయాచిత్ర ప్రదర్శనను ఆయన ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజ‌నా చౌద‌రి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యాన్ని సముపార్జించిన వ్యక్తుల సంకల్పానికి అనుగుణంగా దేశాభివృద్ధిలో బాలబాలికలు భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. దేశ స్వేఛ్ఛా స్వాతంత్ర్యాల కోసం మహాత్మాగాంధీ మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ 1930 లో ఉప్ప సత్యాగ్రహం ద్వారా ఉద్యమ స్పూర్తికి నాంది పలికారన్నారు. భారతదేశం మొత్తం పర్యటించి స్వేఛ్చా స్వాతంత్రాల ప్రాముఖ్యాన్ని ప్రజలల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లగలిగారన్నారు. 1942 నుంచి 1947 వరకు వివిధ ఉద్యమాలను, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఎన్నో కార్యక్రమాలను బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా చేపట్టడం ద్వారా భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ఎందరో మహానుభావులు వారి ప్రాణాలను, తమ ఆస్తులను తృణప్రాయంగా త్యజించారన్నారు. అటువంటి గొప్ప వ్యక్తుల నుంచి స్పూర్తి పొంది నవభారత నిర్మాణంలో మనం భాగస్వామ్యం అవ్వాలని సంకల్పం ప్రతి ఒక్కరిలో రావాలని, అనాటి ఘటనలను స్పూరణకు తీసుకువచ్చేలాగా ఛాయాచిత్ర ప్రదర్శనను దేశవ్యాప్తంగా చేపట్టడం జరుగుతోందన్నారు.

navabharat_nirman_sankalp_1 navabharat_nirman_sankalp_3 navabharat_nirman_sankalp_2
స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు పూర్తవ‌గా, క్విట్ ఇండియా ఉద్యమానికి 75 సంవత్సరాలు  పూర్తయ్యాయ‌ని తెలిపారు. ఆ స్పూర్తితోనే 2017 నుంచి 2022 వరకు దేశాన్ని అవినీతి రహితంగా స్వచ్ఛభారత్ దిశగా నవనిర్మాణ కార్యక్రమాన్ని ప్రజలల్లోకి తీసుకువెళుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్ధిని, విద్యారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనదన్నారు. దేశం కోసం, స్వేచ్చా స్వాతంత్రాల కోసం వారు చూపిన సంకల్పాలను నవనిర్మాణ భారత్ కోసం కూడా ప్రతి ఒక్కరం చూపాలని కేంద్ర మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. భారతదేశానికి గొప్ప దార్శినికుడు ప్రధానమంత్రిగా ఉన్నారని, నవ్యాంద్రకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అదే స్థాయిలో రాష్ట్ర అబివృద్ధికి పనిచేస్తున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి రాబోయే 5 సంవత్సరాలలో అవినీతిరహిత భారతదేశాన్ని ఉగ్రవాద వ్యతిరేక విధానాలలోను, స్వచ్ఛభారత్, సాధికారిత రంగాలలో చర్యలు చేపడుతున్నారన్నారు. ఆ దిశలో చేపట్టే వివిధ కార్యక్రమాలను రాష్ట్రంలో రెండు సంవత్సరాలలోనే సాధించడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు న్యాయకత్వంలో సాకారమవుతుందన్న విషయంలో సందేహం లేదన్నారు. నోట్ల రద్దు, ఒకదేశం ఒక పన్ను వంటి చరిత్రాత్మకమైన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించి అమలు చేయడంలో సహకరించిందన్నారు. దేశ వృద్ధిరేటు 5.5 శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధిరేటు 11 శాతానికి పైగా ఉండటం ఇందుకు తార్కాణం అన్నారు.
తొలుత నవభారత నిర్మాణం-మన సంకల్పం ఛాయాచిత్ర ప్రదర్శనను కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రారంభించారు. సభకు హెచ్.పి.సి.యల్ రిజినల్ హెడ్ ఎం.వేణుగోపాల్ ఆధ్యక్షత వహించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ , హెచ్.పి.సి.యల్ సంయుక్త ఆధ్వర్యంలో ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్ర‌ద‌ర్శ‌న‌లో అనాటి స్వాతంత్ర్య పోరాట విధానంలో, దేశంలో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ కార్యక్రమాలపై రూపొందించిన ఛాయాచిత్ర ప్రదర్శన, వీడియో ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల ఆధికారి బి.బెపారి, మినిస్టీ ఆఫ్ ఐ.అండ్.బి డాక్ట‌ర్ ఆర్ రవీంద్ర, హెచ్.పి.సి.యల్ స్టేట్ కోఆర్డినేటర్ ఉమాశంకర్, చీఫ్ మేనేజర్ యు.ఎస్.శర్మ విద్యారులు పాల్గొన్నారు.

Just In...