Published On: Fri, May 18th, 2018

దోపిడీలకు పాల్పడే ఆరుగురు నిందితుల అరెస్టు

* ద్విచక్రవాహనాలు దొంగ పట్టివేత 

* భారీగా చోరీ సొత్తు స్వాధీనం 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో దోపిడీలకు పాల్పడిన ఆరుగురు నిందితులు, ఒక మోటారుసైకిల్‌ దొంగను సీసీఎస్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 3 ఆటోలు, 4 ద్విచక్రవాహనాలు, 3 చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు బుధవారం విజ‌య‌వాడ‌లోని గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో క్రైం ఏడీసీపీ షరీన్‌ బేగం వెల్లడించారు.
* జక్కంపూడి వై.ఎస్‌.ఆర్‌.కాలనీకి చెందిన ఆటోడ్రైవర్‌ కొర్రాయి సాయికృష్ణ, భవానీపురం శివాలయం వీధికి చెందిన బి.టెక్‌ విద్యార్థి ఎం.డి.ఆరిఫ్‌ స్నేహితులు. చెడు వ్యసనాలకు లోనై సులభంగా డబ్బు సంపాదించేందుకు దోపిడీలను మార్గంగా ఎంచుకున్నారు. రాత్రి వేళ ఒంటరిగా నడిచి వెళ్ల వారిని అడ్డగించి, కొట్టి నగదు, చరవాణులను దొంగిలించేవారు. వీరినీ అరెస్టు చేసి రూ.500 నగదు, ఒక సెల్‌ఫోన్‌, నేరాలకు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
* రామరాజ్యనగర్‌కు చెందిన గాదె రాజేష్‌, తిరుమలకొండ రామకృష్ణ, ఇర్ల నాగరాజులు స్నేహితులు, రాత్రి వేళ నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో కాపుకాసి ఒంటరిగా వెళ్లే వారిని కొట్టి వారి నుంచి నగదు, సెల్‌ఫోన్లు అపహరించేవారు. వీరు ముగ్గురుని అరెస్టు చేసి వారి నుంచి సెల్‌ఫోను, రూ.600 నగదు, నేరానికి ఉపయోగించిన ఆటో స్వాధీనం చేసుకున్నారు.
* వై.ఎస్‌.ఆర్‌. కాలనీకి చెందిన కంచిపాటి సంతోష్‌కుమార్‌ (19) నిర్మానుష్య ప్రాంతాల్లో కాపు కాసి ఒంటరిగా వెళ్లేవారిని దోచుకునేవాడు. ఇతనిని అరెస్టు చేసి ఒక సెల్‌ఫోన్‌, రూ.400 నగదు, ఆటో స్వాధీనం చేసుకున్నారు.
* కంకిపాడుకు చెందిన అంకుళ్లు శ్రీనివాసరావు పాత నేరస్థుడు. మోటారు సైకిళ్ల చోరీ కేసులో సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. తన పాత ప్రవృత్తి మార్చుకోకుండా తిరిగి మోటారుసైకిళ్ల చోరీలు ప్రారంభించారు. ఇతను వన్‌టౌన్‌, నున్న, పమిడిముక్కల, తాడేపల్లిగూడెం పోలీస్‌స్టేషన్ల పరిధిలో నాలుగు ద్విచక్రవాహనాలు చోరీ చేశాడు. ఇతనిని అరెస్టు చేసి 4 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
 

Just In...