Published On: Fri, Jul 3rd, 2020

ద.మ రైల్వేలో వ్యాపారాభివృద్ధికి ప్రత్యేక విభాగం

* సరుకు రవాణా అభివృద్ధి కోసం డివిజనల్ స్థాయి విభాగాల ఏర్పాటు

* ర‌వాణాలో ప్ర‌గతి సాధించేలా కృషి చేయాలి

* బిజినెస్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులకు రైల్వే జీఎం గజానన్ మాల్య దిశానిర్దేశం

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: సరుకు రవాణాపై దృష్టి కేంద్రీకరిస్తూ, మరింత అభివృద్ధిపరచే దిశలో భాగంగా రైల్వే బోర్డు సూచనలకు అనుగుణంగా జోనల్ మరియు డివిజనల్ స్థాయిల్లో వ్యాపార అభివృద్ధి విభాగాలను (బిజినెస్ డెవలప్‌మెంట్ యూనిట్స్ – బిడియు) దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేస్తున్నది. 2024 కల్లా సరుకు రవాణాను రెట్టింపు పెంపు చేయడంతోపాటు, నాన్-బల్క్ సరుకు రవాణా బలోపేతం చేయడం ముఖ్య ఉద్దేశ్యంగా – ఈ వ్యాపార అభివృద్ధి విభాగాల ఏర్పాటు చేయడం జరుగుతోంది. దీనిలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ జోనల్ స్థాయిలో సంబంధిత అన్ని విభాగాల నుండి సీనియర్ అడ్మిస్ట్రేటివ్ గ్రేడ్ అధికారులతో మల్టీ డిసిప్లినరీ బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగాన్ని నెలకొల్పారు. ఈ బిడియు కన్వీనర్‌గా చీఫ్ ఫైట్ ట్రాన్స్పోర్టేషన్ మేనేజర్ బి.నాగ్య (మొబైల్ నం. 9701370901) మరియు చీఫ్ కమర్షియల్ మేనేజర్ (ఫైట్ మార్కెటింగ్) డాక్ట‌ర్  బి.యస్.క్రిస్టోఫర్, ఎఫ్స్ & సిఏఓ/టి కొర్రం కిషోర్ మరియు చీఫ్ రోలింగ్ స్టాక్ ఇంజనీర్ (సిఆర్ఎస్ఏ) ప్రసూన్ చక్రవర్తి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రస్తుత సరుకు రవాణా విధానాలను అధ్యయనం చేయడంతో పాటు అదనంగా సర‌కు రవాణా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వ్యాపారులు మరియు పరిశ్రమ వర్గాలతో తరుచుగా సంప్రదింపులు కొనసాగుతుంది. వేగవంతమైన రవాణా నిర్వహణ కోసం రవాణాలో కొత్త ప్రతిపాదనలకు ఇది నోడల్ కేంద్రంగా సేవలందిస్తుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనీ 6 డివిజన్లలోను సీనియర్ డివిజనల్ ఆపరేటింగ్ మేనేజర్లను డివిజనల్ బిడియులకు కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నారు. కోవిడ్-19 వ్యాప్తి, లాక్‌డౌన్ విధింపు తర్వాత దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణాలో మళ్ళీ మెరుగైనస్థితిలోకి రావడంతో పాటు ఏప్రిల్‌లో 4.81 మిలియన్ టన్నులు (ఎంటిలు), మే నెల‌లో 6.71 ఎంటిలు మరియు జూన్ 2020లో 6.86 ఎంటిల లోడింగ్ స్థాయికి క్రమంగా అభివృద్ధి చెందింది. కొన్ని సరుకుల రవాణాలో ప్రగతి, మరికొన్ని సరుకుల రవాణాలో గత సంవత్సరం నమోదును దాటిన అభివృద్ధి కనబడుతున్నది. ఉదాహరణకు – సిమెంట్ గత సంవత్సరం ఏప్రిల్ 2020 నాటికి 0.21 ఎంటిల లోడింగ్ ఉండగా ఇది ప్రస్తుత సంవత్సరం జూన్ 2020 నాటికి 2.27 ఎంటిల లోడింగ్ స్థాయికి చేరుకుంది. అలాగే ఆహారధాన్యాల లోడింగ్ గత సంవత్సరం (0.9 ఎంటి) కంటే ఏప్రిల్ – జూన్ 2020 లో 174% ఎక్కువగా 2.71 ఎంటిలుగా అభివృద్ధి చెందింది. ప్రస్తుత మరియు కొత్త రవాణా వినియోగదారులతో తరుచుగా సంప్రదింపులు జరపాలని, సరుకు రవాణా ప్రగతికి కృషి చేయాలని నూతనంగా ఏర్పాటైన బిజినెస్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులకు జనరల్ మేనేజర్ గజానన్ మాల్య మార్గం నిర్దేశించారు. రవాణా వినియోగదారుల ప్రయోజనార్థం రైల్వే అనేక విధానాలను అమలుచేస్తున్నదని, ఈ వివరాలన్నీ వ్యాపార మరియు పరిశ్రమల వర్గాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

 

Just In...