Published On: Tue, Apr 17th, 2018

ధర్మ‌పోరాట దీక్ష‌ను విజ‌య‌వంతం చేయాలి

* రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మంత్రి కాల‌వ శ్రీనివాసులు విజ్ఞ‌ప్తి

* జ‌న్మ‌దినం రోజునే ముఖ్య‌మంత్రి దీక్ష చేయ‌డం సాహ‌సోపేత నిర్ణ‌యమ‌ని కితాబు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయానికి, మోసానికి నిర‌స‌న‌గా ఐదు కోట్ల ఆంధ్రుల ప‌క్షాన రాష్ట్ర ముఖ్య‌మంత్రి  చంద్ర‌బాబు నాయుడు త‌న జ‌న్మ‌దినాన చేస్తున్న ధ‌ర్మ‌పోరాట దీక్ష‌కు రాజ‌కీయాల‌కు అతీతంగా రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల వారు స్వ‌చ్ఛందంగా మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని రాష్ట్ర స‌మాచార‌, గృహ‌నిర్మాణ శాఖ మంత్రి కాల‌వ శ్రీ‌నివాసులు విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్ర ప్ర‌జ‌లంతా ముక్త‌కంఠంగా ఒకే మాట‌, ఒకే బాట‌గా నిలిచి ముఖ్య‌మంత్రి దీక్ష‌కు త‌మ సంఘీభావం తెల‌పాల‌ని కోరారు. వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యంలో మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మంత్రి కాల‌వ మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి చేస్తున్న ఈ దీక్ష దేశ చ‌రిత్ర‌లోనే ప్ర‌ప్ర‌థ‌మం, రాష్ట్ర చ‌రిత్ర‌లో ఒక అరుదైన ఘ‌ట‌న అని పేర్కొన్నారు. ప్ర‌త్యేక‌హోదా, విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల అమ‌లు విష‌యంలో కేంద్రం వైఖ‌రికి నిర‌స‌న‌గా విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మునిసిప‌ల్ స్టేడియంలో ఏప్రిల్ 20న ఉద‌యం 7 గంట‌ల నుండి సాయంత్రం 7 గంట‌ల వ‌ర‌కు 12 గంట‌ల‌పాటు ముఖ్య‌మంత్రి నిర‌స‌న‌దీక్ష చేప‌డ‌తార‌ని మంత్రి తెలిపారు. న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడి ప్ర‌భుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిర‌సిస్తూ ముఖ్య‌మంత్రి  చంద్ర‌బాబు నాయుడు త‌న‌ జ‌న్మ‌దినాన్నిధ‌ర్మ‌పోరాట దీక్ష‌గా  చేసేందుకు సంక‌ల్పించ‌డం ఒక సాహ‌సోపేత నిర్ణ‌యంగా మంత్రి అభివ‌ర్ణించారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన 2015 బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు జ‌ర‌ప‌క‌పోవ‌డంపై గ‌తంలోనే నిర‌స‌న వ్య‌క్తం చేసిన విష‌యాన్ని గుర్తుచేశారు.
          వివిధ వ‌ర్గాల ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై, రైతుల ప‌క్షాన పోరాటాలు, ఆందోళ‌న‌లు విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన ఘ‌న‌త చంద్ర‌బాబు నాయుడుకు వుంద‌న్నారు. 1984 ఆగ‌స్టు సంక్షోభం నుండి మొదలుకొని 2010 డిశంబ‌రులో రైతుల‌ స‌మ‌స్య‌ల‌పై ఎనిమిది రోజుల పాటు ఆమ‌ర‌ణ‌ నిరాహార‌దీక్ష‌, రైతులు పండించిన‌ పంట‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించ‌డంకోసం రైతుపోరుబాట పేరుతో ఉద్య‌మాలు నిర్వ‌హించ‌డం, రాష్ట్ర విభ‌జ‌న‌కు సంబంధించి నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకున్న ఏక‌ప‌క్ష నిర్ణ‌యాన్ని నిర‌సిస్తూ 2013 అక్టోబ‌రులో ఢిల్లీ ఏపి భ‌వ‌న్‌లో వారంరోజుల పాటు నిర‌వ‌ధిక దీక్ష చేప‌ట్టార‌ని తెలిపారు. తెలుగు ప్ర‌జ‌ల‌కు ఎక్క‌డ అన్యాయం జ‌రిగినా వారికి అండ‌గా నిలుస్తూ వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషిచేస్తున్నార‌ని మంత్రి పేర్కొన్నారు. ప్రాణాల‌కు తెగించి ఆయ‌న సాగించిన‌న్ని పోరాటాలు దేశ చ‌రిత్ర‌లో ఏ రాజ‌కీయ నాయ‌కుడు చేయ‌లేద‌న్నారు. ప్ర‌జాప్ర‌యోజ‌నాలే ప‌రమావ‌ధిగా భావించి ముఖ్య‌మంత్రి చేప‌డుతున్న ఈ ధర్మ‌పోరాట దీక్ష‌ను విజ‌య‌వంతం చేయాల్సిన బాధ్య‌త రాష్ట్రంలోని ప్ర‌తి పౌరుడిపై వుంద‌న్నారు. ఈ ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లో రాజకీయ పార్టీలు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు, ఉద్యోగ‌, ఉపాధ్యాయ‌, కార్మిక‌, విద్యార్ధి సంఘాలు, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు పాల్గొని ఐదుకోట్ల ఆంధ్రులంతా ఒకే మాట‌గా నిల‌బ‌డ్డార‌న్ని సందేశాన్ని కేంద్రానికి తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మంత్రి పేర్కొన్నారు.

Just In...