నడిరోడ్డుపై యువకుడి దారుణహత్య
న్యూస్, విశాఖపట్నం (చోడవరం): విశాఖ జిల్లా చోడవరంలో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ఓ యువకుడిని దుండగుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. పట్టణంలోని బీఎన్ రోడ్డు ప్రాంతంలోని ఓ మద్యం దుకాణం వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. హత్యకు గురైన యువకుడిని చోడవరంలోని ఎడ్లవీధికి చెందిన కోన రాజేష్ (21)గా పోలీసులు గుర్తించారు. హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో రాజేష్‌ని దారుణంగా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. తొలుత కత్తితో దారుణంగా నరకడంతో రాజేష్ కిందపడిపోయాడు. ఆ తర్వాత కొద్దిదూరం వెళ్లిన దుండగుడు మళ్లీ వెనక్కి వచ్చి రక్తపు మడుగులో ఉన్న రాజేష్‌పై మరోసారి తన కర్కశత్వాన్ని ప్రదర్శించాడు. చనిపోయాడో లేదో అన్న అనుమానంతో మరోసారి కత్తితో వేటు వేసి అక్కడి నుంచి పరారయ్యాడు. సంఘటనా స్థలాన్ని ఎస్సై లక్ష్మీనారాయణ పరిశీలించారు. రాజేశ్‌పై దాడి చేసిన వ్యక్తి ఎవరు? దీనికి గల కారణాలేంటి? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా.. ఈ ఘటనతో స్థానికంగా ఉన్నవారితో పాటు పాదచారులు, వాహనచోదకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.