Published On: Tue, Sep 17th, 2019

నవంబరు 23నుండి 25 వరకు తిరుపతిలో…

17వ జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిఫ్‌ పోటీలు

* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: వచ్చే నవంబరు 23 నుండి 25వ తేదీ వరకు మూడు రోజులపాటు తిరుపతిలో 17వ జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్పు(NIDJAM) పోటీలను నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. మంగళవారం అమరావతి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(సాప్) అధికారులతో ఈ పోటీల నిర్వహణపై నిర్వహించిన సమావేశానికి సిఎస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి పెద్దఎత్తున క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సాప్ ఎండి కె.భాస్కర్ ను ఆయన ఆదేశించారు. తిరుపతిలో ఈ పోటీలు నిర్వహణకు సంబంధించి క్రీడాకారులు, కోచ్ లు, ఇతర సిబ్బందికి అవసరమైన వసతి, రవాణా తదితర ఏర్పాట్లు కల్పించేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో చర్చించాలని సూచించారు. అలాగే జిల్లా స్థాయిలో వెంటనే ఒక సమావేశం నిర్వహించేలా చిత్తూరు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి చర్యలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. గత ఏడాది 16వ జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్పు పోటీలను కూడా తిరుపతిలోనే నిర్వహించినందున గత ఏడాది ఏమైనా సమస్యలు ఎదుర్కుంటే ఈసారి అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సాప్ ఎండిని సిఎస్ ఆదేశించారు.అక్టోబరు నెలాఖరు నాటికి తిరుపతిలోని ఎస్వి విశ్వవిద్యాలయం తారకరామ స్టేడియంను పూర్తిగా సన్నద్దం చేసి ఉంచాలని అన్నారు.గత ఏడాది నిర్వహించిన జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్పు పోటీల్లో మన రాష్ట్రం నుండి గెలుపొందిన రికార్డులను హెలెట్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెద్దఎత్తున క్రీడాకారులను మరింత ప్రోత్సహించి ఈపోటీల్లో పాల్గొనే చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.


ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(సాప్)ఎండి కె.భాస్కర్ మాట్లాడుతూ సాప్ ఆధ్వర్యంలో జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్పు పోటీలను 2015 నుండి 2018 వరకూ వరసగా నాలుగు సార్లు రాష్ట్రంలో నిర్వహించగా 5వసారి కూడా రాష్ట్రంలోనే నిర్వహించాలని ముందుగా విశాఖపట్నంలో నిర్వహించాలని భావించనప్పటికీ తిరిగి వరసగా రెండవసారి కూడా తిరుపతిలోనే నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. మన దేశంలో 2004లో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాచే జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్పు(నిడ్జమ్) పోటీలను ప్రారంభించడం జరిగిందని అన్నారు.నిడ్జమ్ ఆధ్వర్యంలో అండర్-14,అండర్-16 బాలుర,బాలికలకు ఈథ్లెటిక్స్ పోటీలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఈక్రీల్లో ప్రతిభ కనపర్చిన క్రీడాకారులను జాతీయ స్టార్స్ గా గుర్తించడం వారికి యూత్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని బాస్కర్ పేర్కొన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్లుచే జిల్లా స్థాయిలో అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించి ప్రతి జిల్లాలో 13 మంది టాప్ క్రీడాకారులను ఎంపికచేసి ఈ జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్పు పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి జిల్లా నుండి ఇద్దరు క్రీడాశాఖ అధికారులు ఈపోటీలకు ఆహ్వానించడం జరుగుతుందని చెప్పారు.ఈపోటీల్లో పాల్గొనే క్రీడాకారులందరికీ ఉచిత భోజన వసతి కల్పించడంతో పాటు పార్టిసిపేషన్ సర్టిఫికెట్, విజేతలకు పతకాలు, మెరిట్ సర్టిఫికెట్లు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్పు పోటీల్లో అండర్-14 బాలుర,బాలికలకు 100మీటర్లు, 600మీ, ఈవెంట్, హై జంప్, లాంగ్ జంప్, షాట్ పుట్ 4కిలోలు, అండర్-16 బాలుర, బాలికలకు 100మీటర్లు, 200మీ, 400మీ, 1000 మీటర్లు ఈవెంట్, 100మీ. హర్డిల్స్, హైజంప్, లాంగ్ జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో 1.50కిలోలు, జావలిన్ త్రో 700 గ్రాములు, 100మీ, 400మీ.రిలే పోటీలుంటాయని సాప్ ఎండి భాస్కర్ పేర్కొన్నారు. కాగా గత ఏడాది తిరుపతిలో నిర్వహించిన 16వ జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్పు పోటీల్లో దేశవ్యాప్తంగా 414 జిల్లాల 2వేల 588 మంది బాలురు, 1528 మంది బాలికలు, 768 క్రీడలకు సంబంధించిన అధికారులు మొత్తం కలిపి 4వేల 884 మంది పాల్గొన్నారని ఈసారి 5వేల మందికిపైగా పాల్గొంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. అనంతరం ట్రైయథ్లాన్ పోటీలకు సంబంధించిన వివరాలను సమావేశంలో వివరించారు. సమావేశంలో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ప్రతినిధులు నాగరాజు, సికె వల్సన్, దివేశ్ భాల్, సాప్ సెక్రటరీ హేమ, ఇతర శాప్ అధికారులు పాల్గొన్నారు.

Just In...