Published On: Wed, Jul 10th, 2019

నవరత్నాలే అభివృద్ధి సూత్రాలు

* రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమ శాఖ) పాముల పుష్ప శ్రీవాణి

* పారదర్శక, అవినీతి రహిత, గిరిజన సంక్షేమ పాలనే లక్ష్యం: ఎంకె మీనా

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: నవరత్నాలే అభివృద్ధి సూత్రాలుగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమ శాఖ) పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. గత ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని, వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం గిరిజన సమగ్ర అభివృద్ధికి విస్పష్టమైన ప్రణాళికలు రచిస్తోందన్నారు. విజయవాడ గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుల వారి కార్యాలయంలో బుధవారం  రాష్ట్రస్థాయి ఐటిడిఎ పిఓల సమావేశం జరిగింది.  ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి శ్రీవాణి మాట్లాడుతూ గిరిజన అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉన్నారని, గత ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల పాటు కనీసం గిరిజన మంత్రిని కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఎస్టీ రైతులకు భూమి కేటాయింపు మొదలు వారికి ఉచితంగా బోర్లు వేయించి ఇస్తామన్నారు ఆర్ఓఎస్ఆర్ సమస్యలను సైతం త్వరితగతిన పరిష్కరించి,  గిరిజనులను రైతులుగా మార్చుతామని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.  వైయస్సార్ పెళ్లి కానుక కింద ఎస్టీ వధువులకు అతి త్వరలోనే లక్ష రూపాయలు అందించనున్నామని,  గత ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి సంబంధించిన పలు పథకాలను అరకొరగా అమలు చేసి చేతులు దులుపుకుందని మంత్రి విమర్శించారు. తండాలలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని,  అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా 4.2 లక్షలమంది గిరిజన విద్యార్థులకు ఏడాదికి రూ. 15000 లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు. ఏజెన్సీ ఏరియాలలో గిరిజనులే వాలంటీర్లుగా నియమితులు కానున్నారని, గ్రామ సచివాలయాలలో సైతం ఉద్యోగులుగా రాబోతున్నారని స్పష్టం చేశారు.
ప్రతి ఐటీడీఏ పరిధిలో గిరిజనుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సంస్థలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.  రానున్న రాష్ట్ర బడ్జెట్ లో గిరిజన సంక్షేమానికి తగిన ప్రాధాన్యం లభించనుందని,  ముఖ్యమంత్రి  ఈ  విషయంలో స్పష్టంగా ఉన్నారని వివరించారు. అవినీతికి తావులేని గిరిజన సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అన్న శ్రీవాణి,  గిరిజనులను పూర్తిస్థాయిలో అక్షరాస్యులను చేయటం ద్వారా సమాజంలోని ఇతర వర్గాల నుండి వారు దోపిడీకి గురికాకుండా చైతన్యవంతులను చేస్తామన్నారు. ప్రస్తుత సమావేశంలో రానున్న ఐదు సంవత్సరాలలో గిరిజనాభివృద్ధికి అనుసరించవలసిన వ్యూహంపై స్పష్టత తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.  స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా గిరిజనుల జీవితాలలో ఎటువంటి మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీడీఏ పివోలు బాగా పని చేస్తే గిరిజనులు అభివృద్ధి చెందగలుగుతారని, గత ప్రభుత్వ కాలంలో ఐటీడీఏలలో అవినీతి పేరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అవినీతి రహిత గిరిజన అభివృద్ధి కోసం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  నవరత్నాల  అమలుతో సహా, మిగిలిన  విషయాలలో గిరిజన సంక్షేమ శాఖ ఇతర శాఖలకు మార్గదర్శిగా ఉండాలన్న ఆకాంక్షను మంత్రి వ్యక్తం చేశారు.
గిరిజన సంక్షేమం విషయంలో ఎటువంటి నిధుల కొరత లేదని,  అవసరమైతే కేంద్ర నిధులను సమకూర్చుకునేలా విస్పష్ట ప్రణాళిక రూపొందించాలని శ్రీవాణి సూచించారు. ఐటీడీఏలలో అమలవుతున్న ప్రతి కార్యక్రమంపైన నిఘా ఉంచాలని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఆధారాలు ఉంటే, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  ప్రత్యేకించి బాలికల వసతి గృహాలకు రక్షణ కరువయిందని ప్రహరీ గోడ,  కాపలాదారు వంటి సౌకర్యాలు కూడా అక్కడ లేవని ఆవేదన వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి,  అవసరమైతే ప్రతి ప్రాంగణం చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని,  గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఈ నిధులు దారిమళ్ళాయని విమర్శించారు. గిరిజన ఉత్పత్తులకు మంచి ధర లభించేలా ఐటీడీఏ పీవోలు చర్యలు తీసుకోవాలని గిరిజనులను ఆ విషయంలో అవగాహన పరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.  సమర్థవంతమైన పీవోలు ఉన్న ప్రాంతంలో గిరిజన అభివృద్ధి సుసాధ్యమేనని మంత్రి అభిప్రాయ పడ్డారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం ప్రజా ప్రతినిధులను అధికారులు తగిన రీతిన గౌరవించాలని సూచించారు.  సమావేశంలో  కీలకోపన్యసం చేసిన గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా,  అవినీతి రహిత పారదర్శక గిరిజన సంక్షేమ పాలన అందించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు.  రానున్న రెండు సంవత్సరాలలో మౌలిక వసతుల కొరతను అధిగమిస్తామని,  పర్యవేక్షణ లోపం వంటి సమస్యలు ఇకపై ఉండబోవని మీనా తెలిపారు.
గిరిజన  ఆరోగ్యం విషయంలో డాక్టర్ల సేవా లోపం,  మందుల కొరత వంటివి ఇకపై కనిపించ రాదన్నారు. గిరిజన సబ్ ప్లాన్ విషయంలో 45 విభాగాల నుండి గిరిజన సంక్షేమ శాఖ సమాచారం తెప్పించుకోవాలని,  ఆ నిధులు ఆయా శాఖలు ఎలా వ్యయం చేశాయన్నది పరిశీలించాలని సూచించారు.  ఈ క్రమంలో ఆయా విభాగాలతో రానున్న రోజుల్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నామన్నారు. గిరిజనుల కోసం నిర్దేశించిన నిధులు వారికే చేరుతున్నాయా లేదా అన్నది పరిశీలించాలని ఈ విషయంలో ఐటీడీఏ పీవోలు సమర్థవంతంగా వ్యవహరించాలని కార్యదర్శి వివరించారు.  అధికార గణం,  ప్రజా ప్రతినిధులు వేరు కాదని అందరూ ప్రజల కోసమే పని చేస్తున్నారని ఈ క్రమంలో శాసనసభ్యులు,  ఇతర ప్రజాప్రతినిధుల పట్ల అధికారులు గౌరవపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ, గిరిజన సంక్షేమ శాఖ  సంయుక్త సహకారంతోనే కొండ ప్రాంతాలలో మెరుగైన వైద్యం అందించగలుగుతామని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్తికేయ మిశ్రా అన్నారు ఐటీడీఏ పీవోల సదస్సుకు ఆయన ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మిశ్రా మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ లో మరింత అప్రమత్తంగా ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కొద్ది పాటి నిర్లక్ష్యం పెద్ద సమస్యలకు దారితీస్తుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.  ఆరోగ్య శాఖ పరంగా తమ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని స్పష్టం చేశారు.సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు రవీంద్ర బాబు, గిరిజన గురుకులాల కార్యదర్శి భాను ప్రసాద్, ఇంజనీర్ ఇన్ చీఫ్ శేషు బాబు, ఐటీడీఏ పీవో లు సిఎం సాయి శ్రీకాంత్ వర్మ (సీతంపేట), డాక్టర్ వి వినోద్ కుమార్ ( పార్వతీపురం), డీకే బాలాజీ (పాడేరు), ఎం అభిషేక్ కిషోర్ (చింతూరు),  ఎంఎన్ హరేంద్రియ ప్రసాద్ (కోట రామచంద్రాపురం),  వై రోసి రెడ్డి (నెల్లూరు), ఎంకెవి శ్రీనివాసులు (శ్రీశైలం),  నిషాంత్ కుమార్ (రంపచోడవరం) తదితరులు పాల్గొన్నారు.  

Just In...