Published On: Sat, Nov 10th, 2018

నాక్ క‌మిటీ నుంచి ఎ++ ర్యాంక్ పొంద‌డం గర్వకారణం

* విద్యార్థుల్లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పెంపొందిస్తూ మెరుగైన ఫలితాలను, రికార్డులను సాధిస్తున్నాం

* కేఎల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ట్రస్ట్ కార్యదర్శి కోనేరు శివకాంచనలత

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ ఎడ్యుకేష‌న్‌: విద్యా సంస్థల నాణ్యత ప్రమాణాలకు కొలమానంగా భావించే నాక్ కమిటీ నుంచి ఎ++ ర్యాంక్‌ను పొందటం గర్వకారణంగా ఉందని కేఎల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ట్రస్ట్ కార్యదర్శి కోనేరు శివకాంచనలత అన్నారు. యూనివర్సిటీ సాధించిన నాక్ ర్యాంక్‌ను పురస్కరించుకుని మ్యూజియం రోడ్డులోని యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూనివర్సిటీలోని మొత్తం సిబ్బంది బాధ్యతాయుతంగా చేయటంతోనే ఇంతటి ఘనత సాధించినట్లు చెప్పారు. కేవలం ర్యాంకులు, మార్కులు వంటి అంశాలపై కాకుండా విద్యార్థులను అన్ని రంగాలలో నిష్ణాతులను చేయటం, నాయకత్వ లక్షణాలను పెంపొందించి  ఆత్మ విశ్వాసాన్ని నింపటం వంటి విద్యా విధానం ద్వారా తమ విద్యాసంస్థ ఇతర సంస్థల కన్నా మెరుగైన ఫలితాలను, రికార్డులను సాధిస్తున్నట్లు స్పష్టం చేశారు. యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు కోనేరు రాజా హరీన్ మాట్లాడుతూ 2020 సంవత్సరానికి తమ విద్యా సంస్థను పూర్తి స్థాయి పరిశోధన విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దటమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యా విధానంలోనూ, మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు ఉద్యోగాల కల్పన, వినూత్న ప్రణాళికలు అమలు చేయటం వంటి విధానాల కారణంగా తమ విద్యా సంస్థ జాతీయ స్థాయి విద్యా సంస్థగా గుర్తింపు తెచ్చుకుందని, అంతర్జాతీయ స్థాయిలోనూ వివిధ విద్యా సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు  వివరించారు. యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ ఎల్.ఎస్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ నాక్ గ్రేడింగ్ కోసం 4 పాయింట్లకు  గాను 3.57 గ్రేడ్ పాయింట్లు సాధించి అత్యధిక మార్కులతో ఎ++ సాధించినట్లు చెప్పారు. ఇదే సంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జాతీయ స్థాయిలో వివిధ సంస్థలు ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో కలిపి తమ విద్యాసంస్థ నెంబర్-1 ర్యాంకును సొంతం చేసుకుందని చెప్పారు. స‌మావేశంలో యూనివర్సిటీ ప్రొఫెస‌ర్, వైస్ ఛాన్సలర్ రామ్‌కుమార్, రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

Just In...