Published On: Tue, Jun 25th, 2019

నాలుగేళ్లలో ఇంటింటికీ కుళాయి నీరు..

* రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ తాగునీటి సరఫరా కార్పొరేషన్ ద్వారా రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని ఇళ్లకూ కుళాయిల ద్వారా తాగునీటి సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.  గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు గత ప్రభుత్వం పిలిచిన టెండర్లు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. సచివాలయంలోని మూడో బ్లాక్‌లో ఉన్న తన కార్యాలయంలో సోమవారం విలేకరులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఎన్నికల  నోటిఫికేషన్ విడుదలకు నాలుగు రోజుల ముందు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు హడావుడిగా టెండర్లు పిలిచి, ఒప్పందాలు కుదుర్చుకుందని విమర్శించారు. తాగునీటి ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి 9 కన్సల్టెన్సీలకు అప్పగించారన్నారు. ఇందుకుగానూ ఆ కన్సల్టెన్సీలకు మొదటి విడతగా రూ.38.38 కోట్లు ఇచ్చారని, ఇంకా రూ.50 కోట్ల ఫీజు బకాయి చెల్లించాల్సి ఉందని అన్నారు. ఈ తాగునీటి ప్రాజెక్టు రూపకల్పన లోపాభూయిష్టంగా ఉందన్నారు. తక్కువ వ్యయంతో గ్రావిటీ ద్వారా నీళ్లిచ్చే అవకాశం ఉన్నా, ఈ విధానాన్ని పక్కనబెట్టి, ప్రతి నెలా కరెంట్ బిల్లు కట్టే బోర్ వెల్స్ కనెక్ట్ విధానాన్ని డీపీఆర్ లో పేర్కొన్నారన్నారు. బోర్ వెల్స్ విధానం ఇప్పటికే రాష్ట్రంలో విఫలమైందన్నారు. ఈ విధానంలో పట్టణ ప్రాంతాల మీదుగా పైపు లైన్లు వేయాలని డీపీఆర్ లో ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. పట్టణ ప్రాంతాల్లో పైపులైన్లు వేసి, కుళాయి కనెక్షన్లు ఇవ్వకపోవడం ఈ ప్రాజెక్టులో ప్రధాన లోపమన్నారు. అందుకే తమ ప్రభుత్వం ఈ డీపీఆర్ ను పక్కనబెట్టాలని నిర్ణయించిందని, త్వరలో కొత్త డీపీఆర్ రూపొందించి, పట్టణ ప్రాంతాలకూ తాగునీటి సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు. ఈ కొత్త డీపీఆర్ అనంతరం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతకు కాంట్రాక్టర్లకు అప్పగించనున్నమని, దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భాగం తగ్గుతుందని అన్నారు. మధ్యప్రదేశ్, తెలంగాణాలో ఈ విధానమే అమల్లో ఉందన్నారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న రాయలసీమ, ప్రకాశం జిల్లాకు ఈ ప్రాజెక్టు అమల్లో మొదటి ప్రాధాన్యమిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ తాగునీటి సరఫరా కార్పొరేషన్ ద్వారా ఈ తాగునీటి ప్రాజెక్టు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.2,500 కోట్ల నిధుల్లో రూ.980 కోట్లను పసుపు-కుంకుమ పథకానికి మళ్లించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి కార్పొరేషన్ పై ఏడాదికి రూ.48 కోట్ల వడ్డీ పడుతోందన్నారు.

Just In...