Published On: Sat, May 18th, 2019

నిబంధనల ప్రకారం కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయండి

* చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో సీఈఓ ద్వివేది
సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఈ నెల 19న రీపోలింగ్ జరిగే  5 పోలింగ్ బూత్‌ల వద్ద ఎన్నికల నిబంధనల ప్రకారం కట్టుదిట్టంగా  ఏర్పాట్లు చేయాలని  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది ఎన్నికల అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన మాట్లాడారు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల నియమావళిని వివరించడంతో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి తగిన శిక్షణ ఇవ్వమని చెప్పారు. పోలింగ్ కేంద్రాల లోపల, బయట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు వీడియో కూడా తీయించమన్నారు. అదనపు ఈవీఎంలను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. సరిపడ రక్షణ సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. రీపోలింగ్ లో ఓటు వేసిన ఓటర్ ఎడమ చేయి మధ్య వేలికి గుర్తు వేయమని చెప్పారు. పోలింగ్ అధికారుల మొబైల్ నెంబర్లు పంపమన్నారు. పోలింగ్ బూత్ ల వద్ద షామియానా, బెంచీలు, కుర్చీలు, త్రాగునీరు వంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఓటర్లు అందరికీ ఓటర్ స్లిప్ లు పంపిణీ చేయాలని సీఈఓ ద్వివేది చెప్పారు.
              రీపోలింగ్ జరిగే కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న చెప్పారు. సౌకర్యాలకు కూడా కల్పించినట్లు తెలిపారు.  పోలింగ్ కేంద్రాల లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, బయట కూడా ఏర్పాటు చేస్తామన్నారు.  ప్రతి కేంద్రం వద్ద సీనియర్ రెవెన్యూ అధికారులను నియమించినట్లు చెప్పారు. బయట నుంచి ఇతరులు ఎవరూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రూ.25వేలు, రూ.50వేలు నగదు కట్టలను సీజ్ చేసినట్లు కలెక్టర్  చెప్పారు. పోలీస్ అధికారులు మాట్లాడుతూ పోలింగ్ ఏజంట్ల గురించిన సమాచారాన్ని సేకరించినట్లు తెలిపారు. మద్యం షాపులు మూయిస్తామని తెలిపారు. మూడు దశలలో రక్షణ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కేంద్ర పోలీస్ పరిశీలకులు కెకె శర్మ మాట్లాడుతూ బందోబస్తు బాగుందన్నారు. వీసీలో అదనపు సీఈఓ సుజాత శర్మ, అడిషనల్ డీజీ రవి శంకర్, డీఐజీ క్రాంతిరాణా టాటా, ఎస్పీ అంబురాజన్, రిటన్నింగ్ అధికారి మహేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Just In...