Published On: Mon, Nov 5th, 2018

నిర్దేశించిన లక్ష్యంలోగా కేంద్ర పథకాలు పూర్తి చేయండి..

* రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను నిర్దేశించిన లక్ష్యంలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్ర హోం, వైద్య, ఆరోగ్య శాఖ, ట్రాన్స్‌కో శాఖ ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షా సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 23న ఢిల్లీలోని ప్రగతి భవన్ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోడి రాష్ట్ర హోం, వైద్య, ఆరోగ్య శాఖ, ట్రాన్స్‌కో శాఖలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తారన్నారు. ఈ మూడు శాఖల్లో అమలవుతున్న కేంద్ర పథకాల పురోగతిని పీఎంకు వివరించనున్నట్లు తెలిపారు. ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో చేపట్టిన విద్యుత్ సబ్ స్టేషన్ల ఆధునీకరణ, నిర్మాణల గురించి సీఎస్ ఆరా తీశారు. వైద్య ఆరోగ్య శాఖలో అమలవుతున్న ఆయూష్మాన్‌భవ పథకం అమలుపై ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యను, హోం శాఖలో అమలు చేస్తున్న కేంద్ర పథకాల గురించి ఆ శాఖ కార్యదర్శి అనురాధను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను నిర్దేశించిన లక్ష్యంలోగా పూర్తి చేయాలన్నారు. పై మూడు శాఖల్లో అమలవుతున్న పథకాల పురోగతిపై పాయింట్ల వారీగా నివేదిక తయారుచేసి ఈ నెల 20 నాటికి అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ ఆదేశించారు. 23న జరిగే ప్రగతి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడికి ఆ వివరాలు వివరించనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో జీపీఎం, ఏఆర్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌కుమార్,  హోం, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.

Just In...