Published On: Fri, Jan 4th, 2019

నిర్మాణ రంగానికి సంపూర్ణ స‌హ‌కారం అందిస్తాం

* క్రెడాయ్ ప్రాప‌ర్టీ షో ప్రారంభోత్స‌వంలో ఏపి శాస‌న‌సభాప‌తి కోడెల శివ‌ప్ర‌సాద‌రావు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: విభ‌జ‌న స‌మ‌యంలో రాష్ట్రం విడిపోకూడ‌ద‌ని ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశామ‌ని అయిన‌ప్ప‌టికీ రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం రాజ‌ధాని లేకపోయినా, ఆర్థిక‌లోటుతో అల్లాడుతున్నా కేవ‌లం చంద్ర‌బాబు నాయుడు లాంటి దార్శ‌నీక‌త క‌ల్గిన ప‌రిపాల‌న‌ద‌క్ష‌త ఉన్న నాయ‌కుడు ముఖ్య‌మంత్రిగా ఉండ‌టం వ‌ల్లే న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ చిర‌కాలంలోనే శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతుంద‌ని ఏపీ శాస‌న‌స‌భాప‌తి డాక్ట‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు అన్నారు. కాన్ఫ‌డ‌రేష‌న్ ఆఫ్ రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప‌ర్స్ అసోసియేష‌న్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) విజ‌య‌వాడ చాప్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో పేద‌ల సొంతింటి క‌ల‌ను సాకారం చేస్తూ ల‌బ్బీపేట బృందావ‌న్ కాల‌నీలోని ఎ-1 క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో ఏర్పాటు చేసిన 6వ ప్రాప‌ర్టీ షోను శుక్ర‌వారం ఉద‌యం ఏపి శాస‌న‌స‌భాప‌తి కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా భ‌వ‌న నిర్మాణ రంగంలో వినియోగించే వివిధ ఉప‌క‌ర‌ణాలు, అంత‌ర్గ‌త అలంక‌ర‌ణ సామాగ్రి, రుణ సౌక‌ర్యం పొందేందుకు అర్హ‌త‌ల‌తో పాటు విధివిధానాలు తెలియ‌జేసేందుకు వివిధ ప్రైవేటు, జాతీయ బ్యాంకులు ప్రాప‌ర్టీ షోలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిల‌కించి నిర్వాహ‌కుల‌ను అభినందించారు. అనంత‌రం స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్ర‌ముఖ న‌గ‌రాల‌తో వాణిజ్య సంబంధాలు క‌ల్గిన ఏకైక న‌గ‌రంగా న‌వ్యాంధ్ర రాజ‌ధానిగా విజ‌య‌వాడ ఎంతో ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుంద‌ని తెలిపారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అభివృద్ధి ప‌నుల‌కు అనేక ఆటంకాలు క‌లిగేవ‌ని, విభ‌జ‌న అనంత‌రం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాలు, నదుల అనుసంధానం, ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు కోసం ఆయ‌న తీసుకున్న ప్ర‌త్యేక చొర‌వ‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ పారిశ్రామిక రాష్ట్రంగా ఎదుగుతోంద‌న్నారు. నిర్మాణ రంగంలో నిర్వాహ‌కులు వినియోగ‌దారుల హ‌క్కుల‌ను గౌర‌వించాల‌ని సూచించారు. ముఖ్యంగా క్రెడాయ్ నిర్వాహ‌కులు ఇటువంటి ప్రాప‌ర్టీ షోల‌ను రాష్ట్రంలోని అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో నిర్వ‌హించాల‌ని కోరారు. వారికి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున సంపూర్ణ స‌హ‌కారం ఉటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మ‌ధ్య నియోజ‌క‌వ‌ర్గం శాస‌న‌స‌భ్యులు బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌కు అమరావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించాక హైద‌రాబాద్ త‌ర‌హాలో పూర్తిస్థాయిలో అభివృద్ధి జ‌రుగుతుంద‌న్నారు. క్రెడాయ్ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎ.శివారెడ్డి, విజ‌య‌వాడ చాప్ట‌ర్ అధ్య‌క్షుడు వై.వి.ర‌మ‌ణ‌రావులు మాట్లాడుతూ క్రెడాయ్ సంస్థకు సంబంధించి ఏపీలో 20 చాప్ట‌ర్‌లు ఉన్నాయ‌ని, వెయ్యి మంది స‌భ్యుల‌తో వేగంగా అభివృద్ధి చెందుతోంద‌న్నారు. వాటిలో విజ‌య‌వాడ విభాగం ముఖ్య భూమిక పోషిస్తుంద‌న్నారు. అత్యాధునిక నాణ్య‌తాప్ర‌మాణాలు పాటిస్తూ మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌డంతో పాటు భ‌ద్ర‌త‌తో కూడిన విధంగా నిర్మాణ రంగంలో క్రెడాయ్ సంస్థ ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాలు చూర‌గొంటుంద‌ని పేర్కొన్నారు. సామాజిక బాధ్య‌త‌గా అద‌నంగా వ‌చ్చిన ఆదాయాన్ని విద్య‌, వైద్యం త‌దిత‌ర సామాజిక సేవా రంగాల‌కు వెచ్చిస్తున్న‌ట్లు చెప్పారు. చుక్క‌ల భూముల‌కు సంబంధించి నెల‌కొన్న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డంతో పాటు స్టాంప్‌డ్యూటీ త‌గ్గించ‌డం, రెరా చ‌ట్టాన్ని స‌ర‌ళీకృతంగా మార్పులు చేయ‌డం వంటి అంశాల‌పై ప్ర‌భుత్వం దృష్టి సారిస్తే భ‌వ‌న నిర్మాణ రంగం మ‌రింత వేగంగా అభివృద్ధి చెందుతుంద‌ని పేర్కొంటూ ఈ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం చొర‌వ చూపాల‌ని స్పీక‌ర్‌కు విజ్ఞ‌ప్తి చేశారు. దీనిపై కోడెల శివ‌ప్ర‌సాద‌రావు స్పందిస్తూ క్రెడాయ్ నిర్వాహ‌కుల సూచ‌న‌ల‌ను ప‌రిశీలించి స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. కార్య‌క్ర‌మంలో తూర్పు నియోజ‌క‌వ‌ర్గం శాస‌న‌స‌భ్యులు గ‌ద్దె రామ్మోహ‌న్‌, క్రెడాయ్ సంస్థ ప్ర‌తినిధులు సీహెచ్ సుధాక‌ర్‌, కె.రాజేంద్ర‌, సి.స‌తీష్‌బాబు, జి.ఎస్‌.ఆర్‌.మోహ‌న్‌రావు, కె.వి.వి.ర‌వికుమార్‌, జె.కిర‌ణ్‌కుమార్‌, డి.రాంబాబు, ఎగ్జిక్యూటీవ్ క‌మిటీ స‌భ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ ప్రాప‌ర్టీ షో ఆదివారం వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని నిర్వాహ‌కులు తెలిపారు.

Just In...