Published On: Sat, May 19th, 2018

నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడపిన ఘ‌ట‌న‌లో నిండు ప్రాణం బలి

* రోడ్డు ప్ర‌మాదంలో వ్య‌క్తి దుర్మ‌ర‌ణం 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైంది. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలోని సున్నంపాడులో శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మైనారిటీ కూడా తీరకుండానే, లైసెన్సులు లేకుండా, డ్రైవింగ్‌పై ఎటువంటి అవగాహన లేని వాళ్ళు ట్రాక్టర్లు నడపటం వల్ల ప్రమాదాలు జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. సున్నంపాడులో జరిగిన ప్రమాదంలో ఒక మైనర్ బాలుడు ట్రాక్టర్ నడపటం వల్ల అదే గ్రామానికి చెందిన గొర్రె రమేష్ (38) దుర్మరణం చెందాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడు గొర్రె రమేష్ రోడ్డు పక్కన ఉన్న పంచాయతీ బల్లపై కూర్చుని ఉండగా, ట్రాక్టర్ అకస్మాత్తుగా రమేష్‌పైకి దూసుకువచ్చింది. రోడ్డు మార్జిన్ దాటి ట్రాక్టర్ నాలుగు గజాల దూరంలో ఉన్న వ్యక్తిని ఢీ కొట్టింది. మునగపాడులో పెద చెరువులో నీరు ప్రగతి కింద పనులు జరుగుతున్నాయి. అక్కడ పూడిక తీసిన మట్టిని ట్రాక్టర్లో గంగినేని వైపు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రవాణా శాఖ అధికారులు నిబంధనలు పాటించని గ్రామాల్లో తిరుగుతున్న ట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదంలో మృతి చెందిన గొర్రె రమేష్‌కు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాద స్థలంలో మృతుని భార్య, పిల్లల ఆర్తనాదాలు మిన్నంటాయి. జి.కొండూరు పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.రాజేష్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచాస్తున్నట్లు తెలిపారు. అతను మైనరా.. కాదా అనేది నిర్దారించనున్నట్లు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Just In...