Published On: Tue, Aug 3rd, 2021

నిస్సహాయుల‌కు నవజీవన్ ఆపన్న హస్తం…

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి నవజీవన్ ఆపన్న హస్తం అని న‌గ‌ర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ కొనియాడారు. మంగళవారం బావాజీపేట, నవజీవన్ యువభవన్, నవజీవన్ బాలభవన్ వారి ఆధ్వర్యంలో నగరంలో నివసిస్తున్న పేద కుటుంబాల‌కు నిత్యావసర వస్తువులను, పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి కార్యక్రమంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లోని 150 మందికి పైగా పేద కుటుంబాల‌కు పౌష్టికాహార, నిత్యావసర వస్తువులను అందజేశారు. అనంత‌రం మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నవజీవన్ బాలభవన్ వారు 1989 సంవత్సరం నుండి పేద పిల్లలకూ, పేద కుటుంబాలు, వివిధ సమస్యల వలన ఇబ్బంది పడుతున్న పిల్లలకు సేవలు అందించడం సంతోషకరమైన విషయమన్నారు. 150 మంది పేద కుటుంబాలకు పౌష్టికాహారం, నిత్యావసర వస్తువులు అందించడం అభినంద‌నీయం అన్నారు. నవజీవన్ వారు కోవిడ్ సమయంలో చాలా మంది పేదవారికి భోజనం, పౌష్టికాహారం, కోవిడ్ వలన ఇబ్బందిపడుతున్న వారిని గుర్తించి హాస్పటల్స్ కి తీసుకువెళ్ళి వారికి సేవలు చేయడం, వారికి కౌన్సిలింగ్ అందించినందుకు నవజీవన్ వారికి కృతజ్ఞతలు తెలియ జేశారు. అంతేకాకుండా నవజీవన్ వారు 1 వ తరగతి నుండి పిజి వరకు పిల్లలను చదివించడం చాలా గర్వించదగ్గ విషయమన్నారు. అంతేకాకుండా మనమందరం పిల్లల పట్ల బాధ్యతగా ఉండాలని, ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతను కల్గి ఉండి, ముఖ్యంగా మనమందరం పిల్లల రక్షణ విషయాలు బాధ్యతను గుర్తెరిగి ఉండాలన్నారు. పిల్లల విషయంలో నవజీవన్ వారికి ఎటువంటి సహాయసహకారాలను అందించడంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు ముందంజలో ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తనని భాగస్వామిని చేసినందుకు నవజీవన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తొలుత నవజీవన్ బాలభవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ఆర్ఎన్ రత్నకుమార్ మాట్లాడుతూ నవజీవన్ కార్యక్రమాల గురించి పూర్తిగా వివరించడం జరిగిందని, 1989-2020 వరకు నవజీవన్ 50992 మందిని రక్షించడం జరిగిందని తెలిపారు. 47,538 మంది బాలురను, 3454 బాలికలను రక్షించడం జరిగిందని, అంతేకాకుండా 8635 బాల కార్మికులను రక్షించడం జరిగిందన్నారు. నవజీవన్ బాలభవన్ వారు వీధిబాలలు, బాల కార్మికులు, మత్తు పదార్థాల వినియోగిస్తున్న పిల్లలు, వలస కూలీలు, ట్రాకింగ్ కు గురవుతున్న కుటుంబాలకు అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. విజయవాడ, కృష్ణాజిల్లాల తల్లిదండ్రులు వీధి పిల్లలను నవజీవన్ ఆదుకోవడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బాలిగోవింద్, బలసాని మణిమల్లి, నవజీవన్ బాలభవన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఎఆర్ అంతయ్య, నవజీవన్ బాలభవన్ సీనియర్ ప్రోగ్రాం మేనేజర్ జోసఫ్ డోనాల్డ్, ప్రోగ్రాం కో – ఆర్డినేటర్, సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

Just In...