Published On: Tue, May 21st, 2019

నూటికి వెయ్యి శాతం మేమే గెలుస్తాం!

* అభివృద్ధి, సంక్షేమం వల్లే మా విజయం

* మీడియా స‌మావేశంలో ముఖ్య‌మంత్రి చంద్రబాబు ధీమా

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: సర్వేలు చేసుకోవడం అందరికీ అలవాటుగా మారిందని తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తెదేపా 35 ఏళ్లుగా సర్వేలు చేస్తోందని.. నూటికి వెయ్యి శాతం ఏపీలో తామే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోమ‌వారం ఉండ‌వ‌ల్లిలోని ప్ర‌జావేదిక‌లో ముఖ్య‌మంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తెదేపా గెలుపుపై ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అభివృద్ధి, సంక్షేమం వల్లే తెదేపా విజయం సాధిస్తుంది. నేను ఒక్క పిలుపు ఇస్తే అందరూ వచ్చి అర్ధరాత్రి దాటే వరకూ ఓటు వేశారు. అనేక ఇబ్బందులు పడి తెలంగాణ నుంచి వచ్చి ఓటు వేశారు. సాంకేతికతను దుర్వినియోగం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే వీవీప్యాట్‌ స్లిప్పులపై నా డిమాండ్‌ను అందరూ ఒప్పుకొంటున్నారు. మాజీ సీఈసీ ఖురేషి కూడా నా అభిప్రాయాలను సమర్థించారు. వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని 23 పార్టీలు ఈసీకి విజ్ఞప్తి చేశాయి. వీవీప్యాట్‌ స్లిప్పులను బాక్సులో వేసి లెక్కించేందుకు ఇబ్బంది ఏమిటి?. వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించేందుకు ఎక్కువ సమయం అవసరం లేదని ఖురేషి చెప్పారు. పారదర్శక విధానంతో ఓటర్లలో విశ్వాసం కల్పించాలి.’

తేడా వస్తే మొత్తం స్లిప్పులు లెక్కించాలి…
‘వీవీప్యాట్‌ స్లిప్‌ను ఓటరు చేతికి ఇవ్వాలి. ఓటరు సంతృప్తి చెందాక పక్కనున్న బాక్స్‌లో వేయాలి. ఈవీఎంలలోని ఓట్లు, వీవీప్యాట్‌ స్లిప్పుల బాధ్యతలను వేర్వేరు అధికారులు చూస్తున్నారు. 5 వీవీప్యాట్ల లెక్కింపులో తేడా వస్తే మొత్తం స్లిప్పులు లెక్కించాలి. కౌంటింగ్‌ ప్రక్రియలో ఇంకా చిన్నచిన్న సమస్యలు ఉన్నాయి. వాటిని ఈసీ పరిష్కరించాలి. ఈవీఎంలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రోగ్రామింగ్‌ చిప్‌ నియంత్రణ ద్వారా ఏదైనా చేయొచ్చు అన్నారు. ఎన్నికలు ఇలా జరుగుతాయని నేను ఊహించలేదు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు ముందు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో మాట్లాడి ఆ తర్వాత దిల్లీ వెళ్తాను. అందరం చర్చించిన తర్వాతే రాష్ట్రపతిని కలిసే విషయంపై నిర్ణయం తీసుకుంటాం అని చంద్రబాబు అన్నారు.

Just In...