Published On: Sat, Jan 18th, 2020

నేటి నుండి 31వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు

* డిటీసీ ఎస్.వెంకటేశ్వరరావు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు ఈ నెల 18 నుండి 24 వ‌ర‌కు నిర్వహించాలని రవాణాశాఖ నిర్ణయించడం జరిగిందని డిటిసి ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. విజ‌య‌వాడ‌లోని మ‌హాత్మాగాంధీ రోడ్డులోని డిటీసీ కార్యాలయం నుండి శుక్ర‌వారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా డిటీసీ వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ ఈ ఏడాది యువతతోనే మార్పు సాధ్యం అనే నినాదంతో వారం రోజులపాటు రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారణ, రోడ్డు భద్రత నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులను చైతన్యపరచనున్నామని, ప్రైవేటు ప్రభుత్వ వాహన డ్రైవర్లకు ప్రమాదాల నివారణపై సాంకేతిక పరిజ్ఞానంతో అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులను నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన నగరాలలో పట్టణాలలో ప్రచార రథాలు, ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, కరపత్రాల పంపిణీ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత నిబంధనలను సంబంధించిన విస్తృత ప్రచారం కల్పించి ప్రజలను మరింత చైతన్యపరిచేలా కార్యక్రమాలు చేపడ‌తామ‌ని తెలిపారు. ఇందులో భాగంగా ఉచిత వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తెరిగి భద్రత వారోత్సవాలు భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా 20 సంవత్సరముల వయస్సులోపు ఉన్నవారే రోడ్డు ప్రమాదాల బారిన పడుతూ ప్రమాదాలలో చనిపోతున్నారని ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనములు నడిపుతునట్లు గమనిస్తే రవాణాశాఖ వాట్సాప్ నెంబర్ 9548200800 ఫోటో తీసి పంపించాలని డిటీసీ కోరారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం గాని, ద్విచక్రవాహనంపై ముగ్గురు ప్రయాణించడం గాని, హెల్మెట్, సెల్ట్ బెల్ట్ ధరించకుండా వాహనం నడపడం గాని, వాహనం నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడటం, గానీ వ్యతిరేకదిశలో వాహనాన్ని నడపడంగాని నిబంధనలు పాటించకపోవడమేనని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామ‌ని తెలిపారు. ప్రమాదాలు తగ్గించే దిశగా బాధ్యతగా వాహనాలు నడపాలని డి టి సి ఎస్ వెంకటేశ్వరరావు కోరారు.

 

Just In...