Published On: Wed, Oct 9th, 2019

నేత్ర‌ప‌ర్వంగా దుర్గామ‌ల్లేశ్వ‌రుల న‌దీ విహారం…

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవం కృష్ణానదిలో మంగళవారం రాత్రి కన్నులపండువ‌గా జరిగింది. ద‌స‌రానాడు సాయంత్రం ఆలయం నుండి దుర్గామల్లేశ్వర స్వామివారు తెప్పోత్సవానికి బయలుదేరారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి యం.వి.సురేష్‌బాబు కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, క‌ళాకారుల నృత్యాలు, బాణాసంచా వెలుగుల న‌డుమ దేవ‌తామూర్తులు అంగరంగ వైభవంగా హంసవాహనంపైకి చేరుకున్నారు. ప్రత్యేకంగా విద్యుత్తు దీపాలతో అలంకరించిన హంసవాహనంలో ఆది దంపతులు జలవిహారం చేశారు. తెప్పోత్సవం వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దుర్గాఘాట్, ప్రకాశం బ్యారేజ్, పున్నమిఘాట్ నుండి భక్తులు తెప్పోత్సవం వీక్షించారు. సుమారు గంటన్నరపాటు తెప్పోత్సవం జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి యల్.వి.సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, జిల్లా కలెక్టరు ఏ.యండి.ఇంతియాజ్, జాయింట్ కలెక్టరు కె.మాధవిలత, జాయింట్ కలెక్టరు-2 మోహన్‌కుమార్, ఆర్డీవో చక్రపాణి, నగర పోలీస్ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు త‌దిత‌రులు కుటుంబ సభ్యులతో కలిసి తెప్పోత్సవంలో పాల్గొని వీక్షించారు.

Just In...