Published On: Tue, Feb 18th, 2020

నైపుణ్యాంధ్ర ప్రదేశ్

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: నైపుణ్య వికాస కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా అత్యుత్తమ స్థాయిలో కొత్తగా 30 స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఐటీ పాలసీ, నైపుణ్యాభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఎస్డీసీ)తో పాటు రాష్టవ్య్రాప్తంగా ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీలకు అనుబంధంగా మరో నాలుగు, పులివెందుల జేఎన్‌టీయుతో అనుసంధానంగా ఒక కేంద్రాన్ని నెలకొల్పాలన్నారు. వీటి పర్యవేక్షణకు ఒక కేంద్రీకృత వ్యవస్థ ఉండాలన్నారు. భవిష్యత్‌లో దీన్ని విస్తృతం చేయాలని విశాఖపట్నంలో ఐటీ రంగానికి సంబంధించి హై ఎండ్ స్కిల్ సెంటర్ ఏర్పాటు కావాలన్నారు. భవిష్యత్‌లో దీనికి అనుబంధంగా సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మరో రెండు సంస్థలతో పూర్తి స్థాయిలో శిక్షణా కేంద్రాలు పనిచేయాలన్నారు. సుమారు 45 రోజుల్లో ఆర్థికపరమైన అనుమతులు, డిజైన్లు, వనరుల సమీకరణ ఖరారు చేయాలని, ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీల్లో పాఠ్య ప్రణాళిక, అప్‌గ్రెడేషన్ పర్యవేక్షణకు ఒక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందుగా ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయదలచిన మొత్తం 30 నైపుణ్య కళాశాలల్లో పాఠ్య ప్రణాళిక, అమలు తీరు, ఎప్పటికప్పుడు కోర్సులను ఆధునీకరించుకోవటం కోసం పర్యవేక్షణ తదితర కార్యకలాపాలన్నీ ఈ వ్యవస్థ పరిధిలోకి వస్తాయన్నారు. తరువాత దీన్ని విస్తృతం చేద్దామని అధికారులకు సూచించారు. ఐటీ రంగంలో హై ఎండ్ స్కిల్స్‌పై ఒక సంస్థను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని పునరుద్ఘాటించారు. ఇంజనీరింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఇందులో ప్రవేశం కల్పించి వారిని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్నారు. మొదట విశాఖపట్నంలో తరువాత దీనికి అనుబంధంగా సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాలతో పోటీపడే పరిస్థితి రావాలంటే నైపుణ్యాలను ఆ నగరాలకు దీటుగా అభివృద్ధి చేయడమే మార్గమన్నారు. నైపుణ్య కేంద్రాలన్నీ ఒకే నమూనాలో ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఆర్థిక వనరులను సమకూర్చుకుని ఏడాది వ్యవధిలో వాటి నిర్మాణం పూర్తయ్యేలా చూడాలన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను తీర్చి దిద్దాలని ఆదేశించారు.
ఐటీఐల్లో నాడు-నేడు, ఖాళీల భర్తీ ప్రభుత్వంలో వివిధ విభాగాలు నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలన్నీ స్కిల్ డెవలప్‌మెంట్ విభాగం ద్వారానే నిర్వహించాలని సీఎం సూచించారు. విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి విభాగాలు కలిసి పనిచేయాలన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆధ్వర్యంలో కమిటీకి ఆదేశాలు జారీచేశారు. ప్రతి శిక్షణా కార్యక్రమం, కోర్సులు, నాణ్యతను కమిటీ పరిశీలించాలన్నారు. ఉన్నత విద్యామండలి, ఐటీ విభాగాలకు చెందిన వారిని ఇందులో సభ్యులుగా నియమించాలని సూచించారు. నివేదికలో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్న కాలేజీలు, కోర్సులు, ఇతర ప్రణాళికలో అంశాలను పొందుపరచాలని వివరించారు.
కోస్తాలో పరిశ్రమలకు డీ శాలినేషన్ నీరు
ఇజ్రాయేల్‌లో లీటరు నీటిని 4 పైసలకు విక్రయిస్తున్నారని దీన్ని దృష్టిలో ఉంచుకుని పరిశ్రమలకు మంచినీటిని కాకుండా డీ శాలినేషన్ నీటిని వినియోగించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. సంబంధిత సంస్థలతో సంప్రతింపులు జరిపి డీ శాలినేషన్ ప్లాంట్ల ఏర్పాటుపై శ్రద్ధ చూపాలన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగం, పరిస్థితులు, ఇతర రాష్ట్రాల్లో స్థితిగతులపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఐటీ రంగంలో అనుసరించాల్సిన పాలసీపై చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో రూ. 4500 కోట్లకు పైగా పరిశ్రమలకు రాయితీలు పెండింగ్‌లో ఉంచారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. విశ్వసనీయతతో పెట్టుబడులు పెడితే వారికి రాయితీలు ఎగ్గొట్టటం దౌర్భాగ్యమన్నారు. ఈ సమావేశానికి మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, ఐటీ సివిల్ సప్లయిస్ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ తదితరులు హాజరయ్యారు.

Just In...