Published On: Thu, Dec 6th, 2018

నైపుణ్యాభివృద్ధిలో ఉచిత శిక్షణ నిరుద్యోగులకు వరం

* ఈ నెల 10 నుంచి శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు ప్రారంభం

* ఈ అవ‌కాశాన్ని యువ‌త స‌ద్వినియోగం చేసుకోవాలి

* మంత్రి కొల్లు రవీంద్ర వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ముఖ్యమంత్రి యువనేస్తం కింద నిరుద్యోగ భృతి పొందుతున్న యువతకు, ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పెంచేందుకు ఎంప్లాయిమెంట్ స్కిల్ మాడ్యూల్ కింద ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు రాష్ట్ర యువజన, క్రీడలు, న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. గురువారం వెల‌గ‌పూడి స‌చివాల‌యంలోని ప‌బ్లిసిటీ సెల్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మంత్రి కొల్లు ర‌వీంద్ర మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎంపిక చేసిన 555 కేంద్రాల్లో నిపుణులైన శిక్షకులు, నిరుద్యోగ యువతకు సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, డొమైన్ స్కిల్స్‌లో ఉచిత శిక్షణ ప్రారంభం కానుందని వెల్లడించారు. రాష్ట్రంలో 425 డిగ్రీ కళాశాలలు, 14 ఇంజనీరింగ్ కళాశాలలు, 112 ఐటీఐ, జూనియర్ కళాశాలల్లో ఈ నెల పదవ తేదీ నుంచి శిక్షణా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ప్రతి బ్యాచ్ కు రెండు వారాలపాటు, 40 గంటల శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని మంత్రి చెప్పారు. అభ్యర్ధులు వారికి అనుకూలమైన కేంద్రంలో, ఏ బ్యాచ్‌లోనైనా నైపుణ్యాభివృద్ధి శిక్షణ తీసుకునేందుకు ముఖ్యమంత్రి యువనేస్తం పోర్టల్‌లో నమోదు చేసుకునే వెలుసుబాటు కల్పించినట్టు మంత్రి తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ లో శిక్షణకు ఒక్కో అభ్యర్ధికి రూ.8,500 ఖర్చు అవుతుందని, ఈ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. ఇందుకోసం రూ.24.28 కోట్లు చేటాయించినట్టు చెప్పారు. మన రాష్ట్రం ఇప్పటికే ఉద్యోగార్హత నైపుణ్యాలు కలిగిన యువత అధికంగా కలిగిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిందని ఆయన గుర్తు చేశారు. యువతలో నైపుణ్యాలను పెంచి, వర్క్ ఫోర్స్ కింద తయారుచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి యువనేస్తం కింద 10,74,025 మంది నిరుద్యోగులు నమోదు చేసుకున్నారని, వీరిలో 4,15,714 మంది భృతికి అర్హత సాధించారని మంత్రి తెలిపారు. వీరందరికీ ప్రతినెలా ఒకటో తేదీన నిరుద్యోగభృతి వారి బ్యాంకు ఖాతాలో వేస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ నిరుద్యోగభృతి పథకాలు సఫలం కాలేదని, కానీ మన రాష్ట్రంలో ఐటీ, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ ఈ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేయించారని మంత్రి కొనియాడారు. మొదటి విడతలో ముఖ్యమంత్రి యువనేస్తం కింద అర్హులైన వారికి మార్చి నాటికి శిక్షణ పూర్తి చేసి, తరువాత మిగిలిన వారికి కూడా ఉచిత శిక్షణ ప్రారంభిస్తామని కొల్లు చెప్పారు.

Just In...