Published On: Tue, Apr 17th, 2018

న‌వ్యాంధ్ర‌లో తొలిసారిగా జాతీయ ప‌ర్యాట‌క నిర్వాహ‌కుల స‌మ్మేళ‌నం

* సెప్టెంబ‌రు 6 నుంచి 9 వ‌ర‌కు…వేదిక విశాఖ 

* ఐ.ఎ.టి.ఓ. స‌హ‌కారంతో ఇక దేశ‌, విదేశీ ప‌ర్యాట‌కుల వెల్లువ‌

*  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క శాఖ మంత్రి భూమా అఖిలప్రియ 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: న‌వ్యాంధ్ర‌లో చూడ‌డానికి ఏముంద‌ని కొంద‌రు అడుగుతున్నారు? అస‌లు ఇక్క‌డ ఏం లేదో మీరే చెప్పండ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ అన్నారు. ఒక‌ప్పుడు ప్ర‌సిద్ధ దేవాల‌యాల‌కు మాత్ర‌మే ప‌ర్యాట‌కులు వ‌చ్చేవారు. ఇప్పుడు ఇక్క‌డ లేనిది లేదు… మెడిక‌ల్ టూరిజం, ట్రైబ‌ల్, ఎడ్వంచ‌ర్,ఎకో, బుద్ధిస్ట్, ఫారెస్ట్…ఇలా అన్ని ర‌కాల ప‌ర్యాట‌కాల‌కు న‌వ్యాంధ్ర ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని చెప్పారు. న‌వ్యాంధ్ర‌లో దేశ‌, విదేశీ ప‌ర్యాట‌కుల అభివృద్ధికి విశాఖ‌లో సెప్టెంబ‌రు 6 నుంచి 9 వ‌ర‌కు ఇండియ‌న్ టూర్ ఆప‌రేట‌ర్ల స‌మ్మేళ‌నాన్నినిర్వ‌హించ‌నున‌ట్లు మంత్రి అఖిల ప్రియ వివ‌రించారు. విజ‌య‌వాడ‌లోని హోట‌ల్ ముర‌ళీ ఫార్చూన్ లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో మంత్రి అఖిల ప్రియ‌తోపాటు ఇండియ‌న్ టూర్ ఆప‌రేట‌ర్ల అసోసియేష‌న్ ప్ర‌తినిధులు, ఏపీటీడీపీ ఛైర్మ‌న్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. సీఎం చంద్ర‌బాబు చొర‌వ‌తో నవ్యాంధ్ర ప్ర‌దేశ్ లో తొలిసారిగా జాతీయ ప‌ర్యాట‌క నిర్వాహ‌కుల స‌మ్మేళ‌నం నిర్వ‌హిస్తున్నామ‌ని, ఇందులో దేశవ్యాప్తంగా 1,100 మందికి పైగా టూర్ ఆప‌రేట‌ర్లు పాల్గొంటార‌ని మంత్రి అఖిల ప్రియ తెలిపారు. దేశ‌, విదేశాల్లో ప‌ర్యాట‌కంలో వ‌చ్చిన మార్పులు, అత్యుత్త‌మ ప్ర‌మాణాల‌పై ఈ స‌మ్మేళ‌నంలో చ‌ర్చిస్తామ‌ని, ఆప‌రేట‌ర్ల‌కు న‌వ్యాంధ్ర‌లో ప‌ర్యాట‌క ప్రాంతాల టూర్ విజిట్ కూడా నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. దీని వ‌ల్ల ప్ర‌యివేటు ఆప‌రేట‌ర్లు తాము స్వ‌యంగా అనుభూతి పొంది, దేశ‌, విదేశీ ప‌ర్యాట‌కుల‌ను తీసుకువ‌స్తార‌ని అన్నారు. ఇందుకు త‌గిన‌ట్లుగా ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు, హోట‌ళ్లు, ఆతిథ్యాల‌ను మెరుగుప‌రుస్తున్నామ‌న్నారు.
చంద్ర‌బాబు పేరు చెపితే… ఏపీ ప‌ర్యాట‌కం గుర్తుకు రావాలి: మ‌ంత్రి అఖిల ప్రియ‌
దేశ‌, విదేశాల్లో సీఎం చంద్ర‌బాబు పేరు చెపితే… హైద‌రాబాద్ న‌గ‌రం గుర్తుకు వ‌స్తుంద‌ని, ఇపుడు ఇక అమ‌రావ‌తి, ఏపీలోని ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు గుర్తుకు రావాల‌ని ప‌ర్యాట‌క శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ అన్నారు. తాను ఇటీవ‌ల లండ‌న్, స్పెయిన్ వంటి దేశాల్లో ప‌ర్య‌టించిన‌పుడు చాలా మంది న‌వ్యాంధ్ర‌లో టూరిజంపై ఆస‌క్తి క‌న‌బ‌రిచార‌ని, ముఖ్యంగా శ్రీలంక‌, సింగ‌పూర్, థాయ్ ల్యాండ్ వంటి దేశాల వారు న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్ లోని బౌద్ధ ఆరామాల‌ను సంద‌ర్శించేందుకు ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నార‌న్నారు. విదేశీ ప‌ర్యాట‌కులు ఏదో ఒక ప్ర‌దేశానికి వ‌చ్చి వెళ్ళిపోయేలా కాకుండా, కొద్ది రోజులు ఉండి, టూరిస్ట్ స‌ర్క్యూట్లు అన్ని తిరిగి వెళ్లేలా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని మంత్రి వివ‌రించారు. గ‌త రెండేళ్ళ‌లో ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేందుకు అద్భుత‌మైన ఈవెంట్స్ నిర్వహించిన టూరిజం శాఖ‌, ఈ ఏడాది ప‌ర్యాట‌క స్థ‌లాల్లో మౌళిక వ‌స‌తులు, అభివృద్ధిపై దృష్టి పెడుతోంద‌న్నారు. ఇండియ‌న్ టూర్ ఆప‌రేట‌ర్ల సంఘం అధ్య‌క్షుడు ప్ర‌ణ‌బ్ స‌ర్కార్ మాట్లాడుతూ, ఏటా జ‌రిగే ఈ జాతీయ స‌ద‌స్సును ఏపీలో నిర్వ‌హించాల‌ని సీఎం చంద్ర‌బాబు కోరిక మీద సెప్టెంబ‌ర‌లో విశాఖలో స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. మైస్ టూరిజం వ‌ల్ల ఏపీలో ప‌ర్యాట‌క అభివృద్ధి 30 శాతం పెరుగుతుంద‌ని, నిరుద్యోగుల‌కు ఉపాధి కూడా ల‌భిస్తుంద‌న్నారు.ఇండియ‌న్ టూర్ ఆప‌రేట‌ర్ల సంఘం ఉపాధ్య‌క్షుడు రాజీవ్ మెహ్రా మాట్లాడుతూ, సెప్టెంబ‌రు 6న విశాఖ నొవోటెల్ లో ఈ స‌మ్మేళ‌నం ప్రారంభం అవుతుంద‌ని, 7న విశాఖ బీచ్ ఒడ్డున ర‌న్ ఫ‌ర్ టూరిజం నిర్వ‌హిస్తామ‌న్నారు. ఏపీటీడీసీ ఎండి హిమాన్షు శుక్లా మాట్లాడుతూ విశాఖలో జ‌రిగే ఇండియ‌న్ టూరిస్ట్ ఆప‌రేట‌ర్ల స‌మ్మేళ‌నం ఏపీ ప‌ర్యాట‌కానికి కొత్త ఊపు తెస్తుంద‌న్నారు. దీనికి అనుగుణంగా ఏపీటీడీసీ ఈ ఏడాది 6 కొత్త ప‌ర్యాట‌క స్థ‌లాల‌ను అభివృద్ధి చేస్తోంద‌ని వివ‌రించారు.
 

Just In...