Published On: Thu, Oct 15th, 2020

న‌ష్ట‌ప‌రిహారం త్వ‌ర‌గా అందేలా చూడండి

* మంత్రి కొడాలి నానీకి వెదురుపావులూరు రైతుల వేడుకోలు 

గుడివాడ‌, సెల్ఐటి న్యూస్‌: గన్నవరం మండలం వెదురుపావులూరు రైతులకు నష్టపరిహారాన్ని ప్రభుత్వం నుండి త్వరితగతిన ఇప్పించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)ను కోరారు. గురువారం స్థానిక రాజేంద్రనగర్‌లోని నివాసంలో మంత్రి కొడాలి నానీని పలువురు రైతులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ నెల‌లో ఇళ్ళపట్టాల పంపిణీ ప్రక్రియకు సంబంధించి సన్న, చిన్నకారు రైతులు తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారన్నారు. ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు రైతులకు నష్టపరిహారం అందలేదన్నారు. ఇటీవల జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించామని, పది రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదును జమ చేస్తామని చెప్పారన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందలేదని చెప్పారు. భూములిచ్చిన రైతులంతా పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినవారేనని, నష్టపరిహారం త్వరితగతిన అందేలా చూడాలని కోరారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రైతుల సమస్యలను జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.

Just In...