Published On: Fri, Jun 26th, 2020

పంటల బీమా ప్రీమియం చెల్లింపుల్లో సమూల మార్పులు

* ప్రభుత్వమే పూర్తిగా ప్రీమియమ్‌ చెల్లింపు

* రైతుల నుంచి ఒక్క రూపాయి మాత్రమే వసూలు

* పంటలకు ఈ–క్రాపింగ్‌ కాగానే ప్రీమియం చెల్లింపులు

* ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వెల్లడి

అమరావతి బ్యూరో, సెల్ఐటి న్యూస్‌: పంటల బీమా ప్రీమియం చెల్లింపుల్లో సమూల మార్పులు చేశామని, అందులో భాగంగానే రైతులపై ఏ మాత్రం భారం పడకుండా ప్రభుత్వమే పూర్తి ప్రీమియమ్‌ చెల్లిస్తుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వెల్లడించారు. రైతుల నుంచి నామమాత్రంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే వసూలు చేస్తున్నామని ఆయన తెలిపారు. పంటల ఈ–క్రాపింగ్‌ పూర్తి కాగానే ప్రీమియం చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటల ఈ–క్రాపింగ్‌ చేస్తున్నామన్న సీఎం, గ్రామ సచివాలయాల్లో సర్వేయర్, రెవెన్యూ, వ్యవసాయ సహాయకుల సంయుక్త పర్యవేక్షణ పూర్తి కాగానే, ఈ–క్రాపింగ్‌ నమోదు చేస్తున్నామని వెల్లడించారు. ఆ వెంటనే పంటల ఇన్సూరెన్స్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఇందు కోసం వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని సీఎం చెప్పారు.

2018–19 రబీ పంటల బీమా ప్రీమియమ్‌కు సంబంధించి అప్పటి ప్రభుత్వం బకాయి పడిన రూ.122.61 కోట్లను ఈ ప్రభుత్వం చెల్లించింది. దీంతో అప్పటి పంట నష్టానికి సంబంధించి బీమా కంపెనీలు రూ.596.36 కోట్ల క్లెయిమ్స్‌ విడుదల చేశాయి. ఆ మొత్తంతో రాష్ట్రంలో 5.94 లక్షల రైతులకు లబ్ధి కలుగుతోంది. ఈ మేరకు శుక్రవారం క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కిన సీఎం వైయస్‌ జగన్, రైతుల ఖాతాల్లో నేరుగా బీమా పరిహారం జమ చేశారు. ఆ నగదును బ్యాంకుల పాత బాకీల కింద జమ చేసుకోకుండా, అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాలో లబ్ధిదారులైన రైతులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడిన ముఖ్యమంత్రి, ఆ తర్వాత రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించే సేవలకు సంబంధించిన వైయస్సార్‌ యాప్‌ను ఆవిష్కరించారు.

నాటి ప్రభుత్వం నిర్లక్ష్యం..

వ్యవసాయ పంటల బీమా విషయంలో రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేదని ప్రస్తావించిన సీఎం వైయస్‌ జగన్, ఈరోజు తాము ఏం చేస్తున్నామనేది అందరికీ తెలిసేలా కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం 2018–19 రబీ సీజన్‌లో బీమా ప్రీమియమ్‌ చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. నిజానికి బీమా ప్రీమియంను కొంత రైతు చెల్లిస్తాడని, మిగిలింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. సాధారణంగా సీజన్‌ ప్రారంభంలో నెల రోజుల్లోనే బీమా ప్రీమియం చెల్లింపులు జరుగుతాయని, అప్పుడే  రైతులకు బీమా పరిహారం సమయానికి అందుతుందని తెలిపారు. ‘కానీ ఇక్కడ పరిస్తితి చూస్తే.. 2018–19కి సంబంధించిన రూ.122.61 కోట్లు గత ప్రభుత్వం చెల్లించలేదు. రైతులు, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా తమ వంతు ప్రీమియం చెల్లించాయి. కానీ రాష్ట్రం సరైన సమయంలో చెల్లింపులు చేయకపోవడం వల్ల రైతులకు ఇన్సూరెన్స్‌ ప్రీమియం రాని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల రైతులకు ఎక్కువ నష్టం జరిగింది’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

అందుకే పరిస్థితి మార్చాలని..:

అందుకే ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలని, సకాలంలో రైతులకు సహాయం అందించాలని ప్రభుత్వం సంకల్పించిందని సీఎం వెల్లడించారు. బీమా అధికారులతో చర్చలు జరిపి, 2018–19 కి సంబంధించిన బకాయిలు రూ.122.16 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. దీంతో ఈరోజు 5.94 లక్షల రైతులకు మొత్తం రూ.596 కోట్ల పరిహారం అందుతోందని, అది ఈరోజు ఇస్తున్నామని పేర్కొన్నారు.

ప్రీమియమ్‌ చెల్లింపుల్లో మార్పులు:

మళ్లీ ఇటువంటి పరిస్థితి తిరిగి రాకూడదనే ఉద్దేశంతో, గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లింపుల్లో సమూలమైన మార్పులు చేసిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ‘రైతులు చెల్లించే బీమా ప్రీమియం వారు చెల్లించకుండా, కేవలం ఒక రూపాయి వారి వంతుగా కడితే చాలు, వారి పంటలకు ఈ క్రాపింగ్‌ అయిపోయిన వెంటనే బీమా ప్రీమియం చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల పంటలకు నేరుగా ఈక్రాపింగ్‌ చేస్తున్నాం. సచివాలయాల్లో సర్వేయర్, రెవెన్యూ, వ్యవసాయ అసిస్టెంట్లు సంయుక్తంగా పర్యవేక్షణ జరిపి పంట వేసిన వెంటనే ఈ క్రాపింగ్‌ నమోదు చేస్తారు. ఆ వెంటనే ఇన్సూరెన్స్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తారు’. ‘బీమా ప్రీమియం భారం రైతులపై పడకూడదనే ఉద్దేశంతో రైతు కేవలం రూపాయి కడితే చాలని నిర్ణయించాం. మిగిలిన ప్రీమియంను రాష్ట్రం చెల్లిస్తుంది. అందుకోసం ఈ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాం’ అని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.

                        రైతు భరోసా సొమ్ము ఇవ్వడం నుంచి రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పడం, ఈ–క్రాపింగ్, ఇన్సూరెన్స్‌ రిజిస్ట్రేషన్, పంట రుణాలు రాని వారికి రుణాలు ఇప్పించే కార్యక్రమం వరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇస్తున్నాం. రైతు వేసే పంటకు సంబంధించి నిపుణులతో సూచనలు, సలహాలు, రైతు పండించిన పంటకు కనీస గిట్టుబాటు« ధర కల్పించడం వంటి విషయాల్లో రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే), రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నాయని, ఇందుకోసం సమూల మార్పులను తీసుకువచ్చామని సీఎం తెలిపారు. ‘దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్ల ఇదంతా  చేయగలగుతున్నాను. ఇక రైతులకు మేలు చేసే ఈ కార్యక్రమంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కగానే బీమా పరిహారం సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. పాత అప్పులకు ఈ సొమ్ము జమ చేసుకోకుండా బ్యాంకులతో అధికారులు మాట్లాడాలని ఆదేశించాను. కలెక్టర్లు అందరు బ్యాంకర్లతో మాట్లాడాలి’ అని సీఎం జగన్‌ తన ప్రసంగం ముగించారు. కార్య‌క్ర‌మంలో వ్య‌సాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్, వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవిఎస్‌ నాగిరెడ్డి, బీమా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి..

‘ప్రతి రోజు రైతులు ఆశ్చర్యపోతున్నారు.* *ఇచ్చిన హామీలు మాత్రమే కాకుండా గత ప్రభుత్వం బకాయిలు కూడా మీరు ఇస్తున్నారు. ఇవాళ కూడా ప్రీమియమ్‌ బకాయి చెల్లిస్తున్నారు. చాలా పంటలను బీమా పరిధిలోకి తీసుకువచ్చారు. ఎంత భారమైనా భరిస్తున్నారు. ప్రత్యేక కార్పొరేషన్‌ గణనీయ సేవలందిస్తుందని నమ్మకం. శనగ రైతులకు ఎంతో ప్రయోజనం కల్పించారు. సీఎం అయినప్పటి నుంచి రైతులకు కొన్ని వేల కోట్లు జమ చేశారు. ఇప్పుడు వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. రైతు భరోసా కేంద్రాలు కూడా బాగా పని చేస్తున్నాయి. సాయంత్రం కాగానే రైతులు అక్కడ కూర్చుంటున్నారు. గతంలో ఏ సీఎం చేయని విధంగా మీరు చేస్తున్నారు’.

రైతుల స్పందన…

పురుషోత్తం, మాంభట్టు. తడ మండలం. నెల్లూరు జిల్లా:
ఇంత పెద్ద మొత్తంలో బీమా పరిహారం పొందడం జీవితంలో మొదటిసారి. జీవితంలో సువర్ణ అక్షరాలతో చెప్పుకోవచ్చు. ‘ఇవాళ నాకు లక్ష రూపాయల వరకు వస్తున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో బీమా పరిహారం పొందడం జీవితంలో మొదటిసారి’. ‘గతంలో ప్రీమియమ్‌ కట్టినా ఏనాడూ పరిహారం రాలేదు. రూ.4 వేలకు మించి రాలేదు. కానీ ఇవాళ లక్ష రూపాయల వరకు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఏనాడూ మాకు ఇంతగా న్యాయం జరగలేదు. ఇంత పెద్ద మొత్తంలో బీమా పరిహారం పొందడం జీవితంలో మొదటిసారి. జీవితంలో సువర్ణ అక్షరాలతో చెప్పుకోవచ్చు. రైతులకు మీరు పెద్ద మేలు చేశారని కృతజ్ఞతలు. రైతు భరోసాలో రూ.13,500 వేల రూపాయలు వస్తే, పెట్టుబడికి ఇబ్బంది లేకుండా పోయింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా మాకు మంచి సేవలందుతున్నాయి. అడ్వాన్స్‌ కడితే 48 గంటల్లో విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. దీని వల్ల మాకు రవాణా ఖర్చు కూడా తగ్గుతోంది. ఇన్సూరెన్సు కడితే, తప్పనిసరిగా ప్రయోజనం కలుగుతుందని అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు మీరే ఆ ప్రీమియమ్‌ కూడా కడుతున్నారు. ఇవాళ నీటి వసతి కూడా మెరుగు పడడంతో రెండో పంట కూడా వేసుకుంటున్నాం. గ్రామ సచివాలయాల్లో వలంటీర్లు బాగా పని చేస్తున్నారు. మీరు కౌలు రైతులకు కూడా మేలు చేస్తున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ చాలా గొప్పది’.

సిద్ధయ్య, పులిచర్ల మండలం. చిత్తూరు జిల్లా:

‘ఇంగ్లిష్‌ మీడియమ్‌ వల్ల మా పిల్లలు బాగా చదువుకుంటారు. మాకు ఇంగ్లిష్‌ మీడియమ్‌ కావాలి’. ‘మాది మెట్ట ప్రాంతం. గతంలో నీరు లేక పంట నష్టపోయే వాళ్లం. కనీసం పెట్టుబడి కూడా దక్కేది కాదు. ఆ సమయంలో ఇన్సూరెన్సు సదుపాయం కూడా సక్రమంగా అమలు చేయలేదు. మరోవైపు పెట్టుబడి లేక ఎక్కువ వడ్డీకి అప్పు తెచ్చుకునే వాళ్లం. కానీ మీరు వచ్చాక పెట్టుబడి సహాయం చేశారు. ఇప్పుడు ఇన్సూరెన్సు ప్రీమియమ్‌ కూడా ప్రభుత్వమే కడుతోంది. దీని వల్ల మాకు చాలా మేలు జరుగుతుంది. మీరు వచ్చాక మాకు ఎంతో భరోసా కలుగుతోంది. నాకు ముగ్గురు పిల్లలు. అమ్మ ఒడి పథకంలో ఆర్థిక సహాయం అందింది’. ‘మేము తెలుగు మీడియమ్‌లో చదువుకున్నాం. కాబట్టి మంచి ఉద్యోగాలు పొందలేకపోయాం. మీరు గవర్నమెంటు స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెడుతున్నారు. దీని వల్ల మా పిల్లలు బాగా చదువుకునే అవకాశం కలుగుతుంది. మాకు ఇంగ్లిష్‌ మీడియమ్‌ కావాలి’. ‘ఇంకా విత్తనాలు కూడా అందిస్తున్నారు. గతంలో వాటి కోసం మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఊళ్లోనే ఇస్తున్నారు. అదే విధంగా నాణ్యమైన ఎరువులు కూడా తక్కువ ధరకు సరఫరా చేస్తున్నారు. ఇలాంటి సదుపాయాలు వస్తాయని కలలో కూడా అనుకోలేదు. ఇందుకు మీకు ఎంతో రుణపడి ఉంటాం’.

జయరామిరెడ్డి, జయవరం. టంగుటూరు మండలం. ప్రకాశం జిల్లా:

మీ ప్రభుత్వం వచ్చాక సకాలంలో వర్షాలు పడుతున్నాయి. మీరు కలకాలం సీఎంగా ఉండాలి. ‘కరోనా సమయంలో కూడా మీరు ఇస్తున్న ఈ పరిహారం మాకెంతో మేలు చేస్తుంది’. ‘గత ప్రభుత్వంలో ఎంతో నష్టపోయాం. 2018లో ఇన్సూరెన్సు కట్టినా పరిహారం రాలేదు. ఇవాళ నాకు రూ.1.26 లక్షల పరిహారం వచ్చింది. రైతు భరోసా కింద రూ.13,500 సహాయం అందింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంతో సేవలందిస్తున్నారు. కరోనా సమయంలో ఇన్సూరెన్సు రావడం వల్ల కష్టాలు తీరాయి. ఇప్పుడు మీరే ప్రీమియమ్‌ కూడా కడుతున్నారు. మాకు అమ్మ ఒడిలో సహాయం కూడా అందింది. మీ ప్రభుత్వం వచ్చాక సకాలంలో వర్షాలు పడుతున్నాయి. మీరు కలకాలం సీఎంగా ఉండాలి’.

పోతుల సునీత, ఎమ్మెల్సీ…

రైతులు పంటలు పండించడానికి భయపడే పరిస్థితిలో మీరు ఇస్తున్న భరోసాతో రైతులు మళ్లీ సాగు చేస్తున్నారు. ‘మీరు వ్యవసాయంలో తీసుకుంటున్న నిర్ణయాలు విప్లవాత్మకమైనవి. రైతుల పట్ల మీకు ప్రేమ, ఆప్యాయత ఉన్నాయి. రైతులు పంటలు పండించడానికి భయపడే పరిస్థితిలో మీరు ఇస్తున్న భరోసాతో రైతులు మళ్లీ సాగు చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంతో మేలు చేస్తున్నారు. మీరు వచ్చాక వర్షాలు బాగా పడుతున్నాయి’.

బంగారు యోగేంద్రరెడ్డి, ఉరవకొండ మండలం. అనంతపురం జిల్లా:

‘రైతులు, ఇన్సూరెన్సు కంపెనీలకు ప్రభుత్వం వారధిగా ఉండాలి’. ‘2018లో రైతుల ప్రీమియమ్‌ కట్టారు. 2019 నుంచి మీరే ఆ ప్రీమియమ్‌ కడుతున్నారు. మేము గతంలో ప్రీమియమ్‌ కట్టినా, ఏనాడూ మాకు పరిహారం రాలేదు. రైతులు, ఇన్సూరెన్సు కంపెనీలకు ప్రభుత్వం వారధిగా ఉండాలి. నాకు ఇప్పుడు 11 ఎవరాలకు రూ.39 వేలు వచ్చాయి. మాకు ఇప్పుడు పంటలకు మంచి ధర వస్తోంది. ఇన్సూరెన్సు మీద ఆధారపడాల్సిన పరిస్థితి కూడా లేదు. 2018 నాటి డబ్బులు రావడానికి మీరు ఎంతో చొరవ చూపారు. ఇన్సూరెన్సు కంపెనీలు డబ్బులు మాత్రమే కట్టుకుంటాయి. కానీ పరిహారం మాత్రం సక్రమంగా ఇవ్వవు. ఇప్పుడు ఒక్క ఉరవకొండ నియోజకవర్గానికే రూ.16 కోట్ల పరిహారం వస్తోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా మాకు అన్ని సేవలు డోర్‌ డెలివరీ అవుతున్నాయి’.

మనోహర్‌రెడ్డి, ఓర్వకల్లు మండలం. కర్నూలు జిల్లా:

మీరు వచ్చాక వర్షాలు బాగా పడుతున్నాయి. ‘ఇప్పుడు మాకు రెయిన్‌గన్స్‌ అవసరం లేదు’.‘ఫసల్‌బీమా యోజన కింద 2018లో ప్రీమియమ్‌ కట్టాను. కానీ అప్పుడు రాలేదు. ఇప్పుడు నాకు రూ.32,500 వచ్చాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా మాకు ఎన్నో సేవలందుతున్నాయి. ఎరువులు, విత్తనాలు ఊళ్లోనే ఇస్తున్నారు. శనగ పంట నష్టం జరిగితే పరిహారం కూడా గత ఏడాది ఇచ్చారు. మీరు వచ్చాక వర్షాలు బాగా పడుతున్నాయి. మాకు రెయిన్‌గన్స్‌ అవసరం లేదు. వలంటీర్లు చాలా బాగా పని చేస్తున్నారు. ఇంటికే వచ్చి పెన్షన్‌ ఇస్తున్నారు. పంటలకు కూడా మంచి ధర వస్తోంది’.

భాస్కర్‌రెడ్డి, వీరపునాయని మండలం. వైయస్సార్‌ కడప జిల్లా:

రైతు భరోసా కేంద్రాలు రైతులకు దేవాలయాల వంటివి. అవి ప్రారంభించినందుకు మీరు చరిత్రలో నిల్చిపోతారు’. ‘నేను 6 ఎకరాల పంటకు రూ.1620 బజాజ్‌ కంపెనీకి ప్రీమియమ్‌ కట్టాను. కానీ పరిహారం రాలేదు. మీరు సీఎం అయిన ఏడాదిలోనే పాత బకాయిలు చెల్లించారు. నాకు రూ.28,178 వచ్చాయని రైతు భరోసా కేంద్రంలో పెట్టారు. మాకు ఎంతో సంతోషం. ఇలాంటి సీఎం మాకు కావాలి. మాది మెట్ట ప్రాంతం. మాకు పంటలు పండకపోతే శ్రీరామరక్ష పంటల బీమా. అది మీరు గమనించారు కాబట్టే, ఉచిత బీమా కల్పిస్తున్నారు. గతంలో రాజశేఖర్‌రెడ్డి గారిని చూశాం. మళ్లీ మిమ్మల్ని చూస్తున్నాం’. ‘ఈ–క్రాప్‌ బుకింగ్‌ చేయడం వల్ల ఇన్సూరెన్సు కూడా అటాచ్‌ చేస్తున్నారు. మీరు ఉచిత బీమా అందిస్తున్నారు. మీ నాన్నగారు మాకు ఉచిత కరెంటు ఇచ్చారు. ఇప్పుడు మీరు పగటిపూటే నాణ్యమైన కరెంటు ఇస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తక్కువ ధరకు ఇస్తున్నారు. మంచి కంపెనీలతో టైఅప్‌ అయ్యి, మంచి ఎరువులు అందిస్తున్నారు. ఇంకా మా భూముల దగ్గరకు వచ్చి భూసార పరీక్షలు చేస్తున్నారు. దాని వల్ల అవసరమైన ఎరువులే వాడుతున్నాం. దాని వల్ల మాకు అనవసర వ్యయం మిగులుతోంది. రైతు భరోసా కేంద్రాలు రైతులకు దేవాలయాల వంటివి. అవి ప్రారంభించినందుకు మీరు చరిత్రలో నిల్చిపోతారు’. ‘శనగలకు బోనస్‌గా నాకు రూ.45 వేలు వచ్చాయి. శనగలను కనీస మద్దతు ధరకు కొన్నారు. దాని వల్ల కూడా మాకు మంచి మేలు, లాభం కలిగింది. మీరు ఎల్లకాలం సీఎంగా ఉండాలి. మీరు ఉంటేనే మేము బాగుంటాము. వైయస్సార్‌ గారు సహకార సంఘాల ద్వారా లాంగ్‌ టర్మ్‌ లోన్‌ తీసుకుంటే 6 శాతం రిబేట్‌ ఇచ్చారు. మీరు అపర దానకర్ణులు. కాబట్టి దాన్ని అమలు చేయండి’.

Just In...