Published On: Tue, Jun 11th, 2019

పండగలా రాజన్న బడిబాట…

* మంత్రి ఆదిమూల‌పు సురేష్

సెల్ఐటి న్యూస్‌, ఎడ్యుకేష‌న్ (విజయవాడ): కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారులతో ఇబ్రహీంపట్నంలోని కార్యాలయం నుంచి ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంగ‌ళ‌వారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు పెంచడం, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ.. ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం పరిశుభ్రంగా, రుచికరంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2024 నాటికి సమగ్ర విద్యా విధానం అందించాలన్నదే త‌మ లక్ష్యమన్నారు. ప్రతి పనిని గణాంకాలతో ప్రజలముందు పెడతామన్నారు. విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా చర్యలు చేపడతామని వివరించారు. బడి మానేసే వారి సంఖ్య తగ్గాలని, విద్యార్థుల శాతం పెరిగేలా డీఈవోలు, ఎంఈవోలు పనిచేయాలని సూచించారు. త్వరలో తన ఛాంబర్‌లో గ్రీవెన్స్‌ సెల్‌ ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు. విద్యాశాఖలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఫిర్యాదు చేయవచ్చని, అందరి సలహాలు, సూచనలతో ముందుకెళ్తామన్నారు. బుధ‌వారం నుంచి ప్రారంభం కానున్న రాజన్న బడిబాటను ఒక పండుగలా నిర్వహించాలని కోరారు.

Just In...