Published On: Mon, Mar 4th, 2019

పట్టణ ప్రాంతాల్లో అర్బన్ గ్రీన్ కార్పొరేషన్‌లు ఏర్పాటు

* నెల్లూరులో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో మంత్రి నారాయణ

సెల్ఐటి న్యూస్‌, నెల్లూరు: ప‌ర్యావరణ పరిరక్షణలో భాగంగా పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు సామాజిక అడవుల పెంపకం ఎంతో అవసరమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని 18వ డివిజన్‌ జగదీష్‌నగర్‌లో ఆదివారం ఉదయం నూతనంగా వేసిన సిమెంట్ రోడ్ల ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర ప్రాంతాల్లో పచ్చదనం పరిరక్షణ కోసం గ్రీన్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 110 మున్సిపాలిటీలలో చెట్లు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. రాజధాని ప్రాంతంలో. అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ సమన్వయంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నెల్లూరు నగరంలో రెండున్నర లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించామన్నారు. నగరంలో మొత్తం 650 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్ నుండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్, తాగునీటి పైపులైన్లు నిర్మాణం వల్ల దెబ్బతిన్నాయని వాటి స్థానంలో మరలా రోడ్లను పునరుద్ధరిస్తామని  మంత్రి చెప్పారు. నూతనంగా వేస్తున్న రోడ్లపై 5 మీటర్లకు ఒక చెట్టు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకోసం అమరావతి నుంచి ప్రత్యేకంగా సామాజిక అటవీ శాఖ అధికారులను కూడా కేటాయించామన్నారు. గ్రీన్ కార్పొరేషన్ ద్వార మొక్కల పెంపకం కోసం రెండు కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించినట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో నెల్లూరు నగరం రాష్ట్రంలోనే అత్యంత పచ్చదనం ఉన్న నగరంగా  తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇప్పటికే అత్యధిక  అటవీ ప్రాంతం గల ప్రాంతాలతో పోల్చితే ఆంధ్ర ప్రదేశ్ 15. 24 శాతం తో 28వ స్థానంలో ఉందన్నారు. దీనిని బట్టి మన రాష్ట్రంలో ఇంకా 17.76 శాతం అడవులను పెంచాల్సిన అవసరం ఉందని గుర్తించామన్నారు. ఫారెస్ట్ సర్వే ప్రకారం నెల్లూరు జిల్లాలో 1, 180 చదరపు కిలోమీటర్లు కలిగి ఏడవ స్థానంలో ఉన్నామన్నారు . కడప జిల్లా 409.5 చదరపు కిలోమీటర్ల అడవులు కలిగి ప్రథమ స్థానంలో ఉందన్నారు. కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 346 చదరపు కిలోమీటర్ల మాత్రమే చివరి స్థానంలో ఉందని ఆయన వివరించారు. అంతకుముందు  మంత్రి మూడవ డివిజను దస్తగిరి కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను, రోడ్డు నిర్మాణాలను పరిశీలించారు. స్థానికంగా పలు వీధులలో తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న మున్సిపల్ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.  బైపాస్ రోడ్డులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఎదురుగా ట్రిమ్మింగ్ మిషన్‌ను ప్రారంభించారు. మంత్రి వెంట నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నగర మాజీ శాసనసభ్యులు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, రాష్ట్ర మహిళా ఆర్థిక సంస్థ చైర్మన్ తాళ్ళపాక అనురాధ, కార్పోరేటర్లు, ప‌లువురు తెలుగుదేశం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Just In...