Published On: Wed, Jun 19th, 2019

పథకాల కింద వచ్చే డబ్బు లబ్దిదరులకే అందాలి…

* సంక్షోభం నుండి రైతును గట్టెక్కిద్దాం

* మహిళా, రైతు రుణాల విషయంలో బ్యాంకులు ఒత్తిళ్ళు, చేయకండి

* బ్యాంకర్లకు గట్టిగా చెప్పిన సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి

* శెనగ రైతులకు క్వింటాలుకు రూ.1700 ప్రభుత్వ సాయం

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాష్ట్రంలో రైతులు సంక్షోభం నుండి బయటకు రావాలి. గత ప్రభుత్వంలో తీవ్ర నష్టాలు, సంక్షోభాలు ఎదుర్కొన్న రైతు కుటుంబాలకు ఒక భరోసా ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వ అభిమతమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ దిశగా రైతులు, స్వయం సహాయక మహిళల వడ్డీలు, రుణాల విషయంలో ఎటువంటి భారం లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని, ఇందుకు బ్యాంకర్లు కూడా సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. 207వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్.ఎల్.బీ.సి) సమావేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంగ‌ళ‌వారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఎస్.ఎల్.బీ.సి రూపొందించిన 2019-20 రాష్ట్ర రుణ ప్రణాళికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాబోయే సంవత్సరంలో రూ.2,29,200 కోట్లతో రుణ ప్రణాళిక ప్రతిపాదనలను బ్యాంకర్ల కమిటీ ముఖ్యమంత్రికి వివరించింది. ముఖ్యమంత్రి ఆలోచన విధానం మేరకు రైతులకు బ్యాంకులు అండగా ఉండేలా తగు చర్యలు తీసుకుంటామని బ్యాంకర్లు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బ్యాంకులు రూపొందించే లక్ష్యాలు, లెక్కలు వాస్తవాలను ప్రతిబింబించాలని అన్నారు. ఎస్‌ఎస్‌బీసీ నివేదికలో ఏటేటా వ్యవసాయ రుణాలు, డ్వాక్రారుణాలు పెరుగుతున్నట్టు చూపిస్తున్నారు. దీనికి కారణాలు ఏంటి? ఈ డబ్బు అంతా రైతులకు నిజంగా ఇస్తున్నారా? లేదా పాత రుణాలను రీషెడ్యూల్‌ చేయడంవల్ల పెరుగుతున్నాయా? అని బ్యాంకర్లను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కొత్త అప్పులు ఇవ్వకుండా పాత అప్పులనే వడ్డీలతో కలిపి చూపడంవల్ల ఈ అంకెలు పెరుగుతున్నాయని బ్యాంకర్లు అంగీకరించారు. దీనివల్ల రైతులు లేదా డ్వాక్రా మహిళలు ఆర్థికంగా బలపడ్డారని కాకుండా మరింత అప్పులుపాలయ్యారని ఈ లెక్కలు చూపిస్తున్నాయని ఈ సమావేశంలో తేలింది. రుణాల్లో వృద్ధి ఉన్నా, గుణాత్మక మార్పు కనబడలేదని ముఖ్యమంత్రి తెలిపారు. గత ప్రభుత్వం సున్నా వడ్డీకోసం చెల్లించాల్సిన తనవాటాను చెల్లించిందా? అని ముఖ్యమంత్రి బ్యాంకర్లను ప్రశ్నించారు. రైతులకు సున్నావడ్డీ లభించకపోవడంవల్ల, రుణమాఫీ రూ. 87,612 కోట్లు చేస్తానని చెప్పి చివరకు రూ.15వేల కోట్లు కూడా చేయకపోవడంవల్ల రైతులు పూర్తిగా అప్పులు పాలయ్యారు. తన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో 14 నెలలు ప్రజలతో ఉన్నాను. వారి సమస్యలు ముఖ్యంగా రైతుల దుస్థితి తెలుసుకున్నాను. గత పాలనలో జీవితాలపై ఆశలు సన్నగిల్లిన అనేక మందిని చూసాను. ఆ దుస్థితి నుండి రైతులను విముక్తి చేసి అన్ని ప్రయోజనాలు అందేలా చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులు, మహిళల రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ప్రాధాన్యతలు ఉన్నాయి, వాటిని సమర్థవంతంగా అమలు చేయడానికి బ్యాంకర్ల సహకారమే కీలకం అని ముఖ్యమంత్రి సూచించారు. రైతులు చేతులు చాచే పరిస్థితి ఉండకూడదని, సంక్షోభంలో ఉన్న సమయాల్లో ఆదుకోవాల్సింది మనమే అని అన్నారు. రాష్ట్రంలో 1.25 ఎకరా కన్నా తక్కువ ఉన్న రైతులు సుమారు 50% మంది ఉన్నారు. వారంతా సంక్షోభంలో ఉన్నారు. వచ్చే పంటకు పెట్టుబడి పెట్టె పరిస్థితి లేదు. అందుకే రైతు భరోసా పేరుతో ప్రతి రైతుకు రూ.12,500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

‘పాత అప్పులు చూపి ఇబ్బందులు పెట్టకండి’
రైతులకు ఇవ్వబోతున్న ఈ సొమ్మును, ఇంతకుముందు వారికి ఉన్న అప్పులకు జమచేసే వీలే ఉండకూడదని ముఖ్యమంత్రి బ్యాంకర్లకు గట్టిగా చెప్పారు. రైతు భరోసాకింద గాని, తాము నవరత్నాల్లో భాగంగా అమలు చేయబోతున్న మరే సంక్షేమ పథకాల్లో గాని లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే డబ్బును జమచేసుకోవడానికి వీల్లేని విధంగా ఖాతాలను తెరవాలని బ్యాంకర్లకు స్పష్టంచేశారు. గత అప్పులతో సంబంధం లేకుండా సహాయం అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. వ్యవసాయంలో స్థూల ఉత్పత్తి పెరగాలంటే.. రైతులు ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఉండాలని అన్నారు. భూ యజమానుల హక్కులు కాపాడుతూనే, కౌలు రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. విపత్తులు వచ్చినపుడు నష్టపోతున్న రైతులను ఆదుకోడానికి రూ.2 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు స్వయం సహాయక గ్రూపు మహిళలకు 2014కి ముందున్న రూ.14,204 కోట్లను మాఫీ చేస్తామన్న గత ముఖ్యమంత్రి మాటలు హామీల వరకే పరిమితంయ్యయని ఇలాంటి పరిస్థితులు మారాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. స్వయంసహాయక గ్రూపులు చెల్లించాల్సిన రుణాలపై వడ్డీ లను ప్రభుత్వమే నేరుగా బ్యాంకులకు చెల్లిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బ్యాంకులు ఆయా గ్రూపు సభ్యులను ఎటువంటి ఒత్తిళ్లకు, వేదింపులకు గురి చేయవద్దని ముఖ్యమంత్రి సూచించారు.

శెనగ రైతులకు అండ‌గా ప్రభుత్వం…
రాయలసీమలో ఎక్కువగా శెనగ రైతులు మద్దతు ధర సమస్యను ఎదుర్కొంటున్నారని సిఎం చెప్పారు. చేతికివచ్చిన పంటకు తగు మద్దతు ధర రానప్పుడు కలిగే రుణభారం నుండి ఉపసమనం కల్పిస్తామని, సెనగ రైతులకు క్వింటాలుకు రూ.1700 ప్రభుత్వమే చెల్లించి ఆదుకుంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. 2018–19లో మొత్తంగా రూ.1,01,564 కోట్లు వ్యవసాయ రుణాలుగా ఇవ్వాలని ఎస్‌ఎల్‌బీసీ నిర్ణయిస్తే 1,06,560 కోట్లు రైతులకు అందించామని, 2019–20లో 1,15,000 కోట్లు వ్యవసాయానికి ఇవ్వాలని సంకల్పిస్తున్నామని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ తన లక్ష్యాన్ని ముఖ్యమంత్రి ముందు ఉంచింది. బ్యాంకర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కె.కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎస్.ఎల్.బీ.సి అధ్యక్షుడు జే.పకీరస్వామి, భారతీయ రిజర్వు బ్యాంకు ప్రాంతీయ డైరెక్టర్ శుభ్రత్‌దాస్, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్.శెల్వరాజ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

 

Just In...