Published On: Mon, Jun 29th, 2020

పరిపాలన అంటే ప్రజలు అని పాల‌కులు తెలుసుకోవాలి..

* ఏపిసీసీ అధ్య‌క్షుడు శైల‌జానాధ్

* పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించాల‌ని కాంగ్రేస్ నేత‌ల వినూత్న నిర‌స‌న

అనంతపురం, సెల్ఐటి న్యూస్‌: ఇటీవల వ‌రుస‌గా పెరుగుతున్న ‌పెట్రోలు, డిజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో నేత‌లు అనంత‌పురంలో సోమ‌వారం వినూత్న రీతిలో నిస‌స‌న వ్య‌క్తం చేశారు. ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాధ్ ఆధ్వ‌ర్యంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొని పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించాల‌ని కోరుతూ తోపుడు బండిపై ద్విచ‌క్రవాహనం  ఉంచి వీధుల్లో ఊరేగింపు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా 22 రోజులుగా పెరుగుతున్న పెట్రోలు డిజిల్ ధరలు వెంటనే తగ్గించాలని నినాదాలు చేస్తూ వీధుల్లో తిరిగారు. శైల‌జ‌నాథ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ మన్కీబాత్ కాదు ప్రజలతో మాట్లాడాలని అన్నారు. పరిపాలన అంటే ప్రజలు అని తెలుసుకోవాలన్నారు. ప్రజల బాధలు తెలుసుకోవాలని సూచించారు. క‌రోనా వ్యాప్తి నేప‌ధ్యంలో లాక్‌డౌన్ అమ‌లు కార‌ణంగా ఆదాయం కోల్పోయి కష్టాల్లో ఉన్నవారు పెట్రోలు, డిజిల్ ధరలు పెరగడంతో పాటు నిత్యావసరాల ధరలు పెర‌గడంతో అల్లాడుతున్నారన్నారు. ఇప్పటివరకూ రూ.200 లక్షల కోట్ల మేర పెట్రోలు, డిజిల్ ధరలు పెంచడం ద్వారా వసూళ్లు చేశారన్నారు. ఆ డబ్బును ప్రజలకు పంచాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు 20 డాలర్లకు దిగివచ్చినా భారత్‌లో మాత్రం ఎక్సైజ్ సుంకం, వ్యాట్ తగ్గించకపోవ‌డంతో పాటు ప్రభుత్వాలు ప్ర‌జల జీవితాలతో ఆడుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే రవాణారంగం కుదేలైందన్నారు.

Just In...