Published On: Fri, May 11th, 2018

పరిశ్రమల నిర్వహణకు అనుమతి తప్పనిసరి

* లేనిప‌క్షంలో క్రిమిన‌ల్ కేసులు న‌మోదు

* కృష్ణా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం 

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: జిల్లాలో పరిశ్రమలు ప్రారంభించాలన్నా, నిర్వహిస్తున్నా నిబంధనల మేరకు సంబంధిత శాఖల నుండి నిరంభ్యంతర పత్రం (ఎన్ఓసి) పొందాలని లేనిప‌క్షంలో ఆయా పరిశ్రమలపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం హెచ్చ‌రించారు. విజ‌య‌వాడ‌లోని కొత్త ఆటోన‌గ‌ర్‌లో గురువారం సంభవించిన అగ్నిప్రమాదం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ త‌మ విడిది కార్యాలయంలో అగ్నిమాపక శాఖ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ, రెవెన్యూ అధికారులతో శుక్ర‌వారం ఉద‌యం సమీక్ష నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు లేని పరిశ్రమల నిర్వహణను అనుమతించేది లేదని జిల్లా కలెక్టర్ ల‌క్ష్మీకాంతం నిష్కర్షగా తెలిపారు. జిల్లాలోని రెవెన్యూ డివిజనల్ అధికార్లు, జనరల్ మేనేజర్, డిఐసి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, జిల్లా పంచాయతీ అధికారి వారి పరిధిలోని పరిశ్రమలను నిరంతరం తనిఖీ చేస్తూ ఉండాలన్నారు. గురువారం జరిగిన అగ్నిప్రమాదం దురదృష్టకరం అని, సకాలంలో అధికారులు స్పందించడం వలన ప్రాణనష్టం నివారించగలిగామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. అనుమతులు జారీ విషయంలో అధికార్లు అలసత్వం ప్రదర్శించిన వారిపై కూడా చర్యలు తీసుకోవడానికి వెనుకాడనని కలెక్టర్ హెచ్చరించారు. నిబంధనలను ఎట్టి పరిస్థితులలోనూ అతిక్రమించరాదన్నారు. 20మంది కార్మికుల కంటే త‌క్కువ లేదా పైబడి ఉన్న పరిశ్రమలు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారు, పరిశ్రమలను కార్మిక శాఖ అధికారులు తనిఖీ చేయాలన్నారు. ఏ పాఠశాలలోనైనా అగ్నిప్రమాదం సంభవిస్తే జిల్లా విద్యాశాఖాధికారి, వసతి గృహాల్లో సంభవిస్తే సంబంధిత సంక్షేమ అధికార్లు, హాస్పిటల్స్‌లో జరిగితే వైద్యశాఖాధికారులను బాధ్యులను చేసి చర్యలు తీసుకొంటామన్నారు. ఫైర్ ఆడిట్, ఫైర్ సేఫ్టీ అంశాలు తప్పనిసరి అని అన్నారు. సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్-2 పి.బాబూరావు, అగ్నిమాపక, పరిశ్రమలు, పంచాయతీరాజ్ శాఖల‌తో పాటు రెవెన్యూ అధికార్లు పాల్గొన్నారు.

Just In...