Published On: Thu, Mar 26th, 2020

పరీక్షలు లేకుండానే ప్రమోట్‌ చేస్తాం

* ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఇళ్ల వద్దకే పౌష్టికాహారాన్ని అందించేలా చర్యలు చేపట్టామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. మధ్యాహ్న భోజనంతో పాటు గిరిజన ప్రాంతాల్లో గోరుముద్ద పథకం కింద అవసరమైన సరకులను విద్యార్థుల ఇళ్లకు పంపిస్తామన్నారు. గురువారం విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. డ్రైరేషన్‌ కింద 10రోజులకు అవసరమైన మొత్తాన్ని ఇస్తున్నట్లు చెప్పారు. కేజీ, కేజీన్నర చొప్పున డ్రైరేషన్‌ అందిస్తామన్నారు. ఈ నెల 31 తర్వాత కూడా లాక్‌డౌన్‌ కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 14 తర్వాత పాఠశాలలు తెరిచే అవకాశం ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే విద్యా సంవత్సరానికి వెళ్లేందుకు వీలుగా 6 నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు లేకుండా హాజరు ఆధారంగా విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సురేష్‌ వెల్లడించారు. ఆంగ్ల మాధ్యమం బోధించే ఉపాధ్యాయులకు బోధ యాప్‌ ద్వారా శిక్షణ అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Just In...