Published On: Sat, Feb 2nd, 2019

పర్యాటకుల స్వర్గధామం కొండపల్లి కోట

* రాష్ట్ర పురావస్తు మరియు ప్రదర్శనశాలల శాఖ కమీషనర్ జి.వాణిమోహన్ 

సెల్ఐటి న్యూస్‌, కొండ‌ప‌ల్లి: కొండపల్లి కోటను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత సుందరంగా ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పురావస్తు మరియు ప్రదర్శన శాలల శాఖ కమీషనర్ జి.వాణిమోహన్ తెలిపారు. శుక్రవారం కొండపల్లి కోటలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వాణిమోహన్ మాట్లాడుతూ కొండపల్లి కోటలో ప్రత్యేకంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాజుల ఫోటోలతో ఫొటో గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందన్నారు. రాజు ఫొటోపై స్మార్ట్ ఫోన్ ఉంచితే ఆ రాజు పరిపాలించిన కాలం ప్రత్యేకతలు ఆయన మాటలలోనే వినిపించటాన్ని ఫొటో ప్రేమ్ మాట్లాడటం అంటారన్నారు. అదేవిధంగా కొండపల్లి బొమ్మలపై మొబైల్ ఫోన్ ఉంచితే బొమ్మలు కదులుతూ నాట్యం చేస్తాయన్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారి మనమే ఏర్పాటు చేస్తున్నామన్నారు. అగ్మెంటెడ్ రియాలిటీ ఆబ్జెక్టివ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటుల్లోకి తీసుకురావటంతో సాధ్యమైందన్నారు. గత సంవత్సరం కాలంగా కొండపల్లి కోటలో రూ.10 కోట్లతో చేపట్టిన పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 3, 4 తేదీల్లో కొండపల్లి ఉత్సవాల సందర్భంగా ప్రారంభిస్తారన్నారు. దీంతో ప్రజలు కొండపల్లి కోట వైభవాన్ని చూసే అవకాశం ఏర్పడుతుందన్నారు. అలాగే పునరుద్ధరణ పనులు చేపట్టక ముందు కొండపల్లి కోట గోడలు దాదాపు శిథిలావస్తకు చేరుకున్నాయన్నారు. పునరుద్దరణ పనులు చేపట్టడంతో కొండపల్లి కోట అత్యంత సుందరంగా తయారైందన్నారు. కేంద్ర ఆర్కియాలజీ శాఖ నిబంధనల ప్రకారం సిమెంట్, ఇటుకులు వాడకుండా సహజసిద్ధమైన కలబంద, సున్నం, కరక్కాయలు, గోగునారతో పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ఇప్పుడు కోట పనులలో దాదాపు వాటిని ఉపయోగించే చేశామన్నారు. అయితే దీనికి సంబంధించి తర్ఫీదు పొందిన శ్రామికులు కావాల్సి ఉందని అందుకే పనులు అంత వేగంగా చేయడానికి వీలుపడటం లేదన్నారు. గజశాల, దర్బార్ హాల్, రంగమహల్, రాయల్ క్వార్టర్స్, దివాన్-ఇ-ఖాస్, మార్కెట్ యార్డ్, ధాన్యాగారం, జైల్ ఖానా, తోప్ ఖానా, అత్త, కోడళ్ల చెరువులు, హనుమాన్‌ మండపం పనులను దశల వారీగా చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. క్రీ.శ 11వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు కొండపల్లి కోటను కాకతీయులు, రెడ్డిరాజులు, కృష్ణదేవరాయులు, మొగల్స్, కులీ కుతుబ్ షాహీలు, బ్రిటీష్ వాళ్లు కొండపల్లి కోటను ఒక మిలటరీ స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారన్నారు. కొండపల్లి కోట కృష్ణా నది ప్రక్కన ఉండటం, మ‌రోప‌క్క‌న మచిలీపట్నం పోర్టుకు దగ్గరగా ఉండటం కొండపల్లి ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రంగా విలసిల్లడానికి అవకాశం ఏర్పడిందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కొండపల్లి కోటలో త్రీడి ప్రొజెక్షన్ మ్యాపింగ్ ప్రదర్శన ద్వారా రోజుకు రెండు షోలు 30 నిమిషాల పాటు 300 నుంచి 400 మంది వరకు ప్రజలు కూర్చుని చూసే విధంగా కొండపల్లి కోట చరిత్ర ను ప్రదర్శిస్తామన్నారు. కొండపల్లి బొమ్మలు ప్రపంచ ప్రసిద్ది చెందినవని, ఇప్పటికే సెలవు దినాల్లో కొండపల్లి కోటను 400 మంది పర్యాటకులు సందర్శిస్తున్నారని, మామూలు రోజులలో 100 మంది వరకు తమ కుటుంబ సభ్యులతో గడిపేందుకు వస్తున్నారన్నారు. త్రీడి ప్రొజెక్షన్ మ్యాపింగ్‌తో రాబోయే రోజుల్లో వేల మంది కొండపల్లి కోటను సందర్శిస్తారనడంలో సందేహం లేదన్నారు. కొండపల్లి కోటను సందర్శించే పర్యాటకులకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. యువజన సర్వీసుల శాఖ అడ్వంచర్ స్పోర్ట్స్‌ను కొండపల్లి కోటలో నిర్వహిస్తుందని ఇందులో 16 రాష్ట్రాలు, 6 దేశాల నుంచి 250 మంది పాల్గొంటున్నారన్నారు. ఈ ప్రాంతం రాక్ క్లైంబింగ్, రోప్ క్లైంబింగ్‌కు అనుకూలంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం కొండపల్లి ఉత్సవాలను ఫిబ్రవరి 3, 4 తేదీలలో నిర్వహిస్తామన్నారు. కొండపల్లి కోటను సందర్శించే పర్యాటకులకు క్యాంటీన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. మనం చేసే అభివృద్ధి, పునరుద్దరణ పనులతో కొండపల్లి కోట సుందరంగా తయారై పర్యాటకులను పెద్దఎత్తున ఆకట్టుకుంటుందన్నారు. విజయవాడ నుండి కొండపల్లి కోట 20 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. మరిన్ని వివరాలకు కొండపల్లి పోర్ట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పొందవచ్చన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విజయవాడలోని బాపూజీ మ్యూజియంను తీర్చిదిద్దామని, రెండు, మూడు నెలలో ప్రారంభిస్తామన్నారు. విలేక‌రుల సమావేశంలో డిప్యూటి డైరెక్టర్ మల్లికార్జున్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
   

Just In...