Published On: Sat, Nov 24th, 2018

పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులే స్వచ్ఛంద గ్రీనరీ అంబాసిడర్లు

* రాష్ట్ర ప్రాథమిక ఆరోగ్య, గిరిజన శాఖ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులే స్వచ్ఛందంగా గ్రీనరీ అంబాసిడర్లగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రాథమిక ఆరోగ్య, కుటుంబ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. తమ తల్లీదండ్రులతోనూ, బంధువులతోనూ మొక్కలు నాటే విధంగా చైతన్యం తీసుకురావాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వెస్ట్ బెర్రీ స్కూల్ విద్యార్థులు శ‌నివారం వెల‌గ‌పూడి సచివాలయంలో మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ను క‌లిసి మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణ పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణతో పాటు వాతావరణ సమతుల్యత సాధించొచ్చునన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి తమ చుట్టుపక్కల పచ్చదనం పెంపుదల కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులే గ్రీనరీ అంబాసిడర్లగా వ్యవహరిస్తూ, పచ్చదనం పెంపుదల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వయంగా వారు మొక్కలు నాటడమే కాకుండా, తమ తల్లీదండ్రులతోనూ, బంధువులతోనూ, స్నేహితులతోనూ ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరితోనూ మొక్కలు నాటించడంతో పాటు ప‌రిర‌క్ష‌ణ బాధ్యతలు కూడా తీసుకునేలా చైతన్యం తీసుకురావాలన్నారు. భావితరాలకు పచ్చదనం అందించడం ద్వారానే వారికి మెరుగైన జీవనం అందించగల‌మ‌ని తెలిపారు. మొక్కల పెంపకం వల్ల కలిగే ఉపయోగాలపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో 60 మంది వెస్ట్ బెర్రీ స్కూల్ విద్యార్థులు, డైరెక్టర్ మహేష్‌కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
 

Just In...