Published On: Mon, Oct 14th, 2019

పాఠశాలల్లో చేపట్టబోయే పనుల నాణ్యతలో రాజీ పడొద్దు

* విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: పాఠశాలల్లో ప్రభుత్వం చేపట్టబోయే మౌలిక వసతుల ఏర్పాటుకు సంబంధించిన పనులలో నాణ్యతకే అత్యంత ప్రాధాన్యతనివ్వాలని పనులను పారదర్శకంగా చేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంజనీర్లకు సూచించారు. సోమవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమీషనర్ కార్యాలయ భవనంలో ఎస్ఏ, ఎపిఇడబ్ల్యూఐడిసి, టిడబ్ల్యుఇడి ఇంజనీర్లకు విద్యాశాఖ నిర్వహించిన మనబడి, నాడు-నేడు ఓరియంటేషన్ ట్రైనింగ్ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సురేష్ హాజరై ప్రారంభోపన్యాసం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న శాఖలలో విద్యాశాఖ ఒకటని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ప్రభుత్వం విద్యశాఖకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని అందులో భాగంగా విద్యా వ్యవస్థను పూర్తిగా సంస్కరించి ప్రక్షాళన చేయడంతోపాటు అన్ని పాఠశాలల్లో మౌలికవసతులను కల్పించడం జరుగుతుందన్నారు. సిలబస్, కరికులమ్ రివైజ్ చేయడంతోపాటు రాబోయే మూడు సంవత్సరాలలో అన్ని పాఠశాలల్లోను మౌలికవసతులు కల్పించేదిశలో కృషిచేస్తున్నామన్నారు. మొట్టమొదటి బడ్జెట్‌లోనే సింహ భాగం 16 శాతం అంటే 33,000 కోట్లు విద్యాశాఖకు కేటాయించడం జరిగిందన్నారు. మనబడి, నాడు-నేడు కార్యక్రమాన్ని నవంబర్ 14న ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని 6 నెలల కాలంలో అంటే రాబోయే మార్చిలోగా 15000 పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి పాఠశాలలో రన్నింగ్ వాటర్ సదుపాయంతో టాయిలెట్లు ఏర్పాటుచేయడం, పాఠశాలలను విద్యుదీకరించి ఫ్యాన్లు ట్యూబులైట్లు ఏర్పాటు, త్రాగునీరు, విద్యార్థులు సిబ్బందికి ఫర్నిచర్ సమకూర్చడం, క్యాంపస్ అంతటికీ రంగులువేయడం, మేజర్ మరియు మైనర్ రిపేర్లు చేయడం , బ్లాక్ బోర్డుల ఏర్పాటు, అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రహరీ గోడల నిర్మాణం వంటి పనులు ఇందులో ముఖ్యమైనవన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా పశువుల్ని కట్టివేయడం అపరిశుభ్ర వాతావరణం వంటివి ఉండేవని, ఒక్కో పాఠశాలలో లక్షలు ఖర్చు పెట్టి గదులు నిర్మించినా ఫ్లోరింగ్ మూడు నెలలకే పాడైపోయేదని, తలుపులు కిటికీలు బోల్టులు పడేవి కావని ప్రస్తుతం చేపట్టబోయే పనులు గతంలోవలే నాసిరకంగా కాకుండా పూర్తి నాణ్యతతో ఉండాలని చేయవలసిన పనుల స్పెసిఫికేషన్స్ అన్నీ బ్లూ ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుందని ఎస్టిమేషన్లు కూడా మన సొంత ఇంటికి వలే పారదర్శకంగా వేయాలని ఆయన ఇంజనీర్లకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం అంతగాలేని పూర్వకాలంలో నిర్మించిన అనేక భవనాలు వందల సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం మనం చూస్తున్నామని సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధిచెందిన ప్రస్తుత కాలంలో నిర్మించే స్కూలు భవనాలను కూడా అత్యంత నాణ్యతతో ఎంతోకాలం ఉండేలా నిర్మించవలసిన బాధ్యత మనమీద ఉందని నాణ్యత విషయంలో మనమెందుకు రాజీపడాలని అంటూ సమాజంకోసం మంచి పనులు చేద్దామని ఆయన ఉద్బోదించారు. బిల్లుల చెల్లింపుల విషయంలో గ్రీన్ ఛానల్ లో పెట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. పాఠశాలల్లో 99% పేరెంట్స్ కమిటీల ఎన్నికలు ఇప్పటికే పూర్తయ్యా యని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో ముఖ్యమంత్రి పూర్తి నిబద్ధతతో ఉన్నారని క్వాలిటీ, ట్రాన్స్ఫరెన్సీ, టైమ్ లైన్ అనేవాటికి ఆయన అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన తరువాత ఆన్లైన్ చేసి ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి. రాజశేఖర్, పాఠశాల మౌలికవసతుల కల్పన సలహాదారు ఎ.మురళి, విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్ శాఖాధిపతి విజయ‌లక్ష్మీ అయ్యర్, ఎపిఇడబ్ల్యుఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.బాలకృష్ణ తదితరులు ఉన్నారు.

Just In...