Published On: Thu, Oct 31st, 2019

పారిశ్రామిక విధానమే పరిశ్రమల ఏర్పాటుకు ప్రధానం

* ల‌క్ష్యానికి తగిన సమయం నిర్దేశించుకోవాలన్నదే సీఎం ఆలోచన

* భారత ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ వాటా పెంచడంపైనే గురి

* ప‌క్షం రోజులకోసారి పరిశ్రమల శాఖపై సమీక్ష

* పరిశ్రమల శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: భారత ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ వాటా పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పరిశ్రమలు,వాణిజ్య, ఐ.టీ, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని పరిశ్రమల శాఖపై గురువారం ఆయ‌న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి పరిశ్రమల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. లక్ష్యానికి తగిన సమయాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పురోగతి దిశగా సాగాలని మంత్రి అధికారులకు సూచనలిచ్చారు. రాబోయే తరానికి డిమాండ్ కు తగ్గ నైపుణ్య శిక్షణ అందించే అంశంపై లోతైన అధ్యయనం చేయాలన్నారు . పరిశ్రమలకు తగిన సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికే ప్రథమ ప్రాధాన్యతనివ్వాలని మంత్రి మేకపాటి ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్షా సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, ఏపీఐఐసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ సుమిత్, పరిశ్రమల శాఖ సలహాదారులు కృష్ణ జీవీ గిరి, రాజీవ్ కృష్ణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Just In...