Published On: Sun, Apr 21st, 2019

పాస్‌పోర్టులు, వీసాల కోసం +94777902082 నెంబర్‌కు సంప్రదించండి..

* శ్రీలంక బాంబు పేలుళ్ల బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో చిక్కుకుపోయిన తెలుగువారు తమ పాస్ పోర్టులు, వీసాల కోసం అక్కడి భారత రాయబారి కార్యాలయాన్ని సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విహారయాత్ర నిమిత్తం శ్రీలంక వెళ్లిన అనంతపురం వాసులు బస చేసిన శాంగ్రిలా హోటల్‌లో బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. దీంతో భయాందోళనలతో బయటకు పరుగులు తీసిన అనంతపురం వాసులు తమ పాస్ పోర్టులు, వీసాలు హోటల్ లోనే మరిచిపోయారు. వారు ఎటువంటి భయాందోళనలూ చెందాల్సిన అవసరం లేదని, శ్రీలంకలో ఉన్న భారత రాయబారి కార్యాలయంలో ఎకనామిక్, కమర్షియల్ విభాగానికి చెందిన 2వ సెక్రటరీ నేహాను స్వయంగా గాని, ఫోన్ నెంబరు +94777902082 ద్వారా గాని సంప్రదించాలని కోరారు. వారే కాకుండా ఏపీకి చెందిన వారెవరైనా ఆమెను పాస్‌పోర్టు, వీసాల కోసం సంప్రదించొచ్చునని ఆ ప్రకటనలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.

Just In...