Published On: Mon, Sep 21st, 2020

పీఠాధిపతులను కలిసిన మంత్రులు

* అంతర్వేది నూతన రథ నమూనాను స్వామిజీకి చూపిన దేవాదాయ శాఖ

* ఆగమ సలహా మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి స్వామీజీ సూచన

విశాఖ‌ప‌ట్నం, సెల్ఐటి న్యూస్‌: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహా స్వామి, ఉత్తర పీఠాధిపతి  స్వాత్మనందేంద్ర సరస్వతీ స్వామిలను రాష్ట్ర మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, శ్రీరంగనాథరాజు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, దేవాదాయ శాఖ కమిషనర్ అర్జున్‌రావు కలిశారు. సోమవారం విశాఖ శారదా పీఠానికి వెళ్లి స్వామీజీల ఆశీస్సులు అందుకున్నారు. పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుదీర్ఘ సమయం స్వామిజీతో భేటీ అయ్యారు.
దగ్ధమైన రథం స్థానంలో నిర్మించ తలపెట్టిన నూతన రథ నమూనాను స్వామీజీకి చూపించారు. ఈ సందర్భంగా స్వామీజీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, కమిషనర్ అర్జున్‌రావుకు పలు సూచనలు చేశారు. గతంలో ఉన్న రధాని కన్నా శ్రేష్ఠమైనదిగా నూతన రధం ఉండాలన్నారు స్వామి స్వరూపానందేంద్ర. రథ నిర్మాణానికి ఉత్కృష్టమైన కలప వినియోగించాలని సూచించారు. కొండ బిట్రగుంట,అంతర్వేది దేవస్థానాల్లో రథాలు దహనమవడం అరిష్టానికి సూచన కాబట్టి ఆయా దేవస్థానాల్లో ప్రాయశ్చిత్త హోమాలు చేపట్టాలన్నారు. అలాగే అంతర్వేది దేవస్థానానికి చెందిన వందలాది ఎకరాలు అన్యాక్రాంతమైనందున దేవాదాయ శాఖ వాటిపై దృష్టి సారించాలని, వాటిని స్వాధీనం చేసుకుని దేవాదాయ శాఖ ఆదాయం పెరిగేలా మార్గాన్ని అన్వేషించాలని సూచించారు. హైందవ సంప్రదాయాలపై అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో వాటిని నివృత్తి చేసుకోవడానికి ప్రభుత్వం ఆగమ సలహా మండలిని ఏర్పాటు చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ సలహా మండలిలో ఆరు ఆగమాలకు చెందిన పండితులను భాగస్వాములను చేయాలని స్వరూపానందేంద్ర సూచించారు.

Just In...