Published On: Tue, Oct 15th, 2019

పునీత్ ర‌ష్యా ప‌ర్య‌ట‌న క‌ళాశాల‌కే గ‌ర్వ‌కార‌ణం

* యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో ఎంపికై మ‌న సంస్క్ర‌తి, సంప్ర‌దాయాల‌ను విదేశాల్లో చాటిన పీబీ సిద్ధార్థ విద్యార్థి

* అభినందించిన క‌ళాశాల యాజ‌మాన్యం, స‌హ విద్యార్థులు

సెల్ఐటి న్యూస్‌, ఎడ్యుకేష‌న్ (విజ‌య‌వాడ‌): పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 17 ఆంధ్ర ఎన్‌సిసి ఆర్మీ వింగ్ క్యాడెట్ బీకాం టాక్స్ ప్రొసీజర్స్ ప్రధమ సంవత్సరం విద్యార్థి రామడుగు పునీత్ ఎన్‌సిసి శిక్షణలో అత్యున్నత లక్ష్యమైన యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకు ఎంపికై సెప్టెంబర్ 29వ తేదీ నుండి రష్యాలో పర్యటించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకు రష్యా సందర్శించిన భారత బృందంలో ఒక సభ్యుడిగా ఎంపిక అయ్యేందుకు పునీత్ ఢిల్లీలో రాత పరీక్ష, బృంద చర్చలు, డ్రిల్ పరీక్ష, ఎన్‌సిసి డైరెక్టర్ జనరల్ ఇంటర్వ్యూ ఉత్తీర్ణుడై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి ఈ పర్యటనకు ఎంపికైన పదిమంది క్యాడెట్లలో ఒకడిగా నిలవటం తమ కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. పర్యటనకు ముందు పునీత్ జనవరిలో ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే శిబిరంలో పాల్గొని ప్రతిష్టాత్మకమైన రాజ్‌పథ్ కవాతులో ప్రతిభ కనబరచి డ్రిల్ పరీక్షలో బంగారు పతకం సాధించినట్లు కళాశాల ఎన్సీసి ఆర్మీ వింగ్ అధికారి లెఫ్టినెంట్ కె.విజయ్ తెలిపారు. కళాశాల చరిత్రలో యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ద్వారా విదేశాలలో పర్యటించే అరుదైన అవకాశాన్ని పొందిన విద్యార్థులలో పునీత్ కేవలం మూడవ వాడు కావడం అభినందనీయమని కళాశాల డైరెక్టర్ వేమూరి బాబురావు ప్రశంసించారు. గుజరాత్ ఎన్సీసీ డైరెక్టరేట్‌కు చెందిన కల్నల్ అజయ్‌కుమార్ నేతృత్వంలో భారతదేశం నుండి పదిమంది ఎన్సిసి క్యాడెట్లు రష్యా పర్యటనలో పాల్గొన్నట్లు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల నుండి కేవలం పునీత్ మాత్రమే ఎంపిక కావడం తమ కళాశాలకు గర్వకారణమని అభినందించారు. భారతదేశ సాంస్కృతిక రాయబారులుగా ఈ సందర్శనలో పాల్గొన్న క్యాడెట్ల బృందం భారతదేశ సంస్కృతిని, ఆచార వ్యవహారాలను మాస్కోలోని రష్యన్ క్యాడెట్ల బృందానికి వివరించారు. అనంతరం మాస్కోలోని ప్రముఖ దర్శనీయ స్థలాలైన రెడ్ స్క్వేర్, క్రైస్ట్ ద గ్జేవియర్ కతెడ్రల్, క్రెమ్లిన్ చర్చి, మాస్కో క్యాడెట్ స్కూల్, వ్యవసాయక్షేత్రం వంటి పలు ప్రాంతాలను రష్యన్ బృందంతో కలిసి సందర్శించినట్లు పునీత్ వివరించాడు. ఇటువంటి అరుదైన ఘనత సాధించి 17 ఆంధ్రా ఎన్సిసి బెటాలియన్ మరియు సిద్ధార్థ కళాశాల కీర్తిని ఇనుమడింపచేసిన పునీత్‌ను కమాండింగ్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ పి.కుమార్ కళాశాల యాజమాన్యం తరపున సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష, కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వర్లు, పాలడుగు లక్ష్మణరావు, కళాశాల కన్వీనర్ సూరెడ్డి వెంకటేశ్వరరావు, డీన్ ప్రొఫెసర్ రాజేష్ జంపాల, కళాశాల ఎన్సీసీ ఆర్మీ వింగ్ పూర్వ అధికారి కావూరి శ్రీధర్, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.

Just In...