Published On: Wed, Nov 20th, 2019

పెట్టుబడిలేని ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి కెఎఫ్ డబ్ల్యూ చేయూత

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కెఎఫ్‌డబ్ల్యూ (జర్మన్ డెవలప్మెంట్ బ్యాంకు) తోడ్పాటును అందించనుంది. ఈ మేరకు బుధవారం అమరావతి సచివాలయంలో కెఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో భేటీలో ఈ అంశంపై చర్చించడం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించేందుకు జర్మనీ అభివృద్ధి బ్యాంకు నుండి ఋణం పొందేందుకు గత జనవరిలో ప్రాథమిక ప్రాజెక్టు ప్రతిపాదనతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపగా ఆ ప్రతిపాదనలను కేంద్ర ఆర్ధిక వ్యవహారాలశాఖ గత ఏప్రిల్ నెలలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.2,479 కోట్ల ప్రాజెక్టు నివేదికను పంపగా దానిలో రూ.1735 కోట్లు కెఎఫ్‌డబ్ల్యూ (జర్మన్ అభివృద్ధి బ్యాంకు) ఋణంగా అందించనుండగా మిగతా 30శాతం నిధులు అనగా రూ.744 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. కెఎఫ్‌డబ్ల్యు మొదటి దశగా గ్రాంటు కాంపొనెంట్ తో కలిపి రూ.694 కోట్లు, రెండవ విడత కింద రూ.1041 కోట్లను విడుదల చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనల ప్రకారం ఋణం మంజూరుకు సంబంధించి ఈ నెలలో కెఎఫ్ డబ్ల్యూ, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఋణం అగ్రిమెంట్ సంతకాలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఈ ప్రతినిధి బృందం సిఎస్‌తో భేటీ కావడం జరిగింది. ఋణం మంజూరు ఒప్పందం సంతకాలు పూర్తైన అనంత‌రం కెఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు మొదటి విడత ఋణం నిధులు విడుదలకు చర్యలు తీసుకుంటుంది.
ఈ ప్రాజెక్టు అమలులో భాగంగా రాష్ట్రంలో 1725 గ్రామ పంచాయితీలకు చెందిన 7లక్షల మంది రైతులను పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 25వేల మంది రైతులను మాస్టర్ ఫార్మర్లుగా తీర్చిదిద్ది పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి కమ్యునిటీ రిసోర్సు పర్శన్లుగా తీర్చిదిద్దనున్నారు. అంతేగాక 69 వేల మందిని స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేసి ప్రకృతి సేద్యం అమలు, మానిటరింగ్ కు చర్యలు చేపట్టనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిన జర్మన్ డెవలప్‌మెంట్ బ్యాంకు ప్రతినిధి బృందానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రత్యేకంగా అభినందలు తెలుపుతూ సకాలంలో ఋణం మంజూరుకు చర్యల తీసుకోవాలని విజ్ణప్తి చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు టి.విజయకుమార్ ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం అమలు తీరును అలాగే ఈప్రాజెక్టు విస్తరణకు కేంద్రం ద్వారా జర్మన్ డెవలప్మెంట్ బ్యాంకుకు పంపిన ప్రాజెక్టు ప్రతిపాదనల వివరాలను సిఎస్‌కు వివరించారు. భేటీలో కెఎఫ్ డబ్ల్యూ ప్రతినిధులు డా.క్రిస్టఫ్ కెస్లర్, సంగీత అగర్వాల్ పాల్గొన్నారు.

Just In...