Published On: Wed, Jun 19th, 2019

పెట్టుబడులకు రెడ్ కార్పెట్…

* రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

* త్వరలో ఐటీ, పరిశ్రమ రంగాలకు యాక్షన్ ప్లాన్లు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఏపీలో ఐటీ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి త్వరలోనే యాక్షన్ ప్లాన్లు తీసుకురానున్నామన్నారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ ఉన్న తన కార్యాలయంలో బుధవారం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కార్యాలయ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కేబినెట్ లో ఎంతో కీలకమైన ఐటీ, పరిశ్రమల శాఖను సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు అప్పగించినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయనన్నారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో ఐటీ రంగం కీలకంగా మారిందన్నారు. ఏపీ రాష్ట్రాభివృద్ధిలోనూ ఐటీ రంగానిదే కీలకమన్నారు. ఐటీ పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీకి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తరలి రావడానికి త్వరలోనే యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమ స్థాపనకు ప్రాధాన్యత…
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న దిశగా తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు ద్వారా అటు యువతకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఇటు పల్లెల ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు వల్ల పారిశ్రామిక వేత్తలకు కొన్ని రాయితీలు లభిస్తాయన్నారు. 75 శాతం యువతకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పించాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు కొత్త ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులూ రానీయబోదని, చిత్తశుద్ధితో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ఎప్పుడూ రెడ్ కార్పెట్ వేస్తామని ఆయన వెల్లడించారు.

త్వరలో 100 రోజుల యాక్షన్ ప్లాన్…
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు కావాల్సిన పరిశ్రమలపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సాధించుకుంటామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉంటామని మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విశాఖలో జరిగిన పలు సమ్మిట్ల ద్వారా ఎంవోయూల్లో సంతకాలు జరిగిన మాట వాస్తవమేనని, కాని పెట్టుబడులు ఆ స్థాయిలో ఎందుకు రాలేదో సమీక్షిస్తామని మంత్రి తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు గత ప్రభుత్వం భూములు కేటాయించిందని, కొన్ని సంస్థలు ఎటువంటి పనులూ ప్రారంభించలేదని, ఇటువంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా 42 పరిశ్రమల స్థాపనలో ఇబ్బందులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటి పరిష్కారానికి 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు మరో ప్రశ్నకు మంత్రి సమాధామిచ్చారు. అభివృద్ధి చెందిన దేశాలను గమనిస్తే, ఆ దేశాల్లోని తీర ప్రాంతాల్లోనే పారిశ్రామికాభివృద్ధి జరిగిన విషయం వెల్లడవుతుందన్నారు. సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉండడం ఏపీకి కలిసొచ్చిన అంశమని, విశాఖ-చెన్నై, చెన్నై-బెంగుళూర్ కారిడార్ల ఏర్పాటు ద్వారా రాష్ట్రం పారిశ్రామిక హబ్ గా మారుతుందనడంతో సందేహంలేదని అన్నారు. అనంతపురంలో కియా మోటారు పరిశ్రమ రాక వల్ల మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు వీలు కలుగుతోందన్నారు. అంతకుముందు వేదపండితుల మంత్రోచ్ఛారణాలు, ఆశీర్వచనాల నడుమ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కార్యాలయ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌, ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

   

Just In...