Published On: Sun, May 19th, 2019

పెద్దనోట్లతో పెద్దఎత్తున ధన ప్రవాహం

* ఎన్నికల ప్రక్రియను అపహాస్యం పాల్చేశారు

* ముఖ్యమంత్రి చంద్రబాబు 

సెల్ఐటి న్యూస్‌, న్యూఢిల్లీ:  తన 40 ఏళ్ల రాజకీయానుభవంలో ఎప్పుడూ చూడనంత ధన ప్రవాహం ఈ సార్వత్రిక ఎన్నికల్లో కనిపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఒక పెద్ద నోటు రద్దు చేసి అంతకంటే పెద్దనోటు ప్రవేశపెట్టడంతో ఈ ఎన్నికల్లో డబ్బు పంపిణీ విచ్చలవిడిగా సాగిందని దుయ్యబట్టారు. డిజిటల్ కరెన్సీని పూర్తిస్థాయిలో అమలులోకి తేవడమే ఎన్నికల ప్రక్రియలో ఏర్పడ్డ అన్ని రుగ్మతలను నయం చేస్తుందన్నారు. ‘భారత్‌లో ఎన్నికల సంఘం, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వతంత్రత పెంపొందించడం’పై దిల్లీలోని ‘ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్’(ఐఐసీ)లో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌, మాజీ సెంట్రల్ ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్లు నవీన్ చావ్లా, ఎస్‌.వై ఖురేషీ, విశ్రాంత ఐఎఎస్ అధికారి కె.రాజు, మాజీ సెంట్రల్ ఛీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వజహత్ హబీబుల్లా తదితర ప్రముఖులు హాజరైన ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి డిజిటల్ కరెన్సీ ఒక్కటే మార్గమని స్పష్టంచేశారు. డిజిటల్‌ కరెన్సీపై తాను చేసిన సూచనలను కేంద్రం పట్టించుకోలేదని అన్నారు. ‘అసలు ఏ ప్రయోజనాలు ఆశించి ఒక పెద్ద నోటు రద్దుచేసి మరో పెద్దనోటు తీసుకొచ్చారు? ఎన్నికల్లో యధేచ్ఛగా డబ్బు పంపిణీ చేయడం కోసం కాదా’ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఓటుకు ఇచ్చే నోటు విలువ పెంచడం మినహా మరేం ఒరిగింది? అని నిలదీశారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. సాంకేతికత గొప్పదనాన్ని నరనరానా జీర్ణించుకున్న తానే ఈవీఎంలతో పోలింగ్ ప్రక్రియను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ప్రస్తుత పోలింగ్ విధానాన్ని ప్రశ్నించడం వల్ల దేశంలో కొత్త మార్పునకు నాంది పలికామన్నారు. ఈవీఎంలను నిషేధించి బ్యాలెట్ విధానానికి మళ్లడం వల్ల ఎన్నికల్లో పారదర్శకత పెంచవచ్చునని తెలిపారు. డిజిటల్ కరెన్సీని పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టడం, ఈవీఎంలను నిషేధించి బ్యాలెట్ విధానాన్ని తీసుకురావడం వల్ల సమాజానికి గొప్ప మేలు చేయడమే కాకుండా దేశానికి ఇదే గొప్ప వరమవుతుందని అన్నారు. ‘ఈవీఎంల విధానానికి ఎన్నికల్లో 2009 నుంచి నేను వ్యతిరేకిస్తున్నాను. ఈ విధానంలో పారదర్శకతను పెంచడం కోసం వివిప్యాడ్‌లను వాడాలని ఎప్పుడో ప్రతిపాదించాం. కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ నాయకుల మాదిరి మేము మాట మాట మార్చలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం వారు వారు మాట మార్చి ఈవీఎంలను వాడకానికి మోగ్గు చూపవచ్చు. నాతో సహా దేశంలోని సీనియర్ నేతలంతా ఈవీఎంలను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి చెప్పారు. పొరబాట్లు జరిగే ప్రమాదం ఉన్నందునే ఈవీఎంలను వద్దని చెబుతున్నామని అన్నారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ది చెందిన సింగపూర్ వంటి దేశం కూడా ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించకుండా సాధారణ బ్యాలెట్ పేపర్ పద్దతినే అమలుచేస్తోందని గుర్తుచేశారు. ఇది గుర్తించి సాంకేతికతను గుడ్డిగా అనుసరిస్తూ, అతిగా ఆధారపడటం తగ్గించాలని తామంతా నిర్ణయించుకున్నామన్నారు.
తెలుగుదేశం పార్టీ సహా దేశంలో 21 రాజకీయ పార్టీలు ఈవీఎం విధానాన్ని వ్యతిరేకిస్తూ ఒక్క త్రాటిపై ఉన్నాయని, కాబట్టి ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను పెంపొందించే పాత పేపర్ బ్యాలెట్ పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని అతి పెధ్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికల విధానం పారదర్శకంగా ఉండాలన్న తాపత్రయంతోనే తామంతా ఇంతగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల సంఘాన్ని తన చెప్పుచేతల్లో ఆడిస్తున్న కేంద్ర ప్రభుత్వ ధోరణిని ప్రశ్నించినందుకే తమపై ప్రతికార చర్యలకు దిగారని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణలో 50శాతం వీవీప్యాట్‌లను లెక్కించాలన్న తమ అభ్యర్ధనను సుప్రీం కోర్టు తిరస్కరించినప్పటికీ దీనిపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఇదే విషయం మీద ఎన్నికల కమిషన్‌ను మరోసారి సంప్రదించగా, దీనివల్ల కౌంటింగ్ ప్రక్రియలో విపరీతమైన జాప్యం జరుగుతుందన్న పాత అభ్యంతరాన్నే మళ్లీ లేవనెత్తారని చెప్పారు. వీవీప్యాట్లను కూడా ఈవీఎం టేబుల్ మీద పెట్టి సమాంతరంగా లెక్కిస్తే జాప్యాన్ని నివారించవచ్చునని, అవేమీ ఆలోచించకుండా ఏకపక్షంగా తిరస్కరించడం సరికాదన్నారు. ప్రస్తుత కౌంటింగ్‌లో ఇది సాధ్యం కాకపోయినా తదుపరి జరిగే ఎన్నికల్లో దీన్ని అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఎలక్టోరల్ బాండ్ల వల్ల నిధుల సమీకరణలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు దక్కుతాయని అనుకుంటే, అది నెరవేరకుండా పోయిందన్నారు.

Just In...