Published On: Tue, Feb 5th, 2019

పేదల బతుకుల్లో వెలుగులు నింపే బడ్జెట్

* ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ రెడ్డి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పేదల బతుకుల్లో వెలుగులు నింపే బడ్జెట్ అని శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ రెడ్డి కొనియాడారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.2,26,177 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారని, ఇది ఒక చరిత్ర అని ప్రశంసించారు. గతేడాది బడ్జెట్ కంటే 18 శాతం అధికంగా కేటాయింపులు చేశారన్నారు. అన్ని వర్గాలు, మతాలు, కులాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ, అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లగా భావించి బడ్జెట్ రూపకల్పన చేశారన్నారు. మొత్తం బడ్జెట్‌లో ఒక్క సంక్షేమానికే రూ.65,486 కోట్లు కేటాయించడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ బడ్జెట్‌లో మెచ్చుకోదగిన మరో ముఖ్యాంశం అన్నదాత సుఖీభవ పేరుతో రూ.5 వేలు కోట్లు రైతుల అభివృద్ధికి కేటాయించామ‌ని తెలిపారు. రైతుల పట్ల తమ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని అన్నదాత సుఖీభవ పథకం తెలియజేస్తోందన్నారు. రైతు రుణమాఫీ కోసం ఇప్పటికే తమ ప్రభుత్వం రూ.24 వేల కోట్లకు పైగా వెచ్చించిందన్నారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇస్తున్న పెన్షన్లను రూ.2 వేల వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకోవడం తమది పేదల ప్రభుత్వం మరోసారి రుజువైందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పింఛన్ కేవలం రూ.200లు ఇస్తే, తాము రూ.2 వేలకు పెంచామన్నారు. నాలుగున్నరేళ్లలో పెన్షన్ల కోసం టీడీపీ ప్రభుత్వం 24,618 కోట్లు ఖర్చు చేస్తే, దాంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా కేవలం రూ.1,100 కోట్లేనని తెలిపారు. ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. పసుపు-కుంకుమ కింద 94 లక్షల డ్వాక్రా మహిళలకు రూ.10 వేల చొప్పున ఉచితంగా అందజేస్తున్నామన్నారు. వైఎస్ హయాంలో రూ.200 కోట్లు, కిరణ్‌కుమార్ రెడ్డి పాలనలో రూ.2 వేలు కోట్లన డ్వాక్రా మహిళలకిస్తే, తమ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో రూ.22 వేల కోట్లను అందజేసిందన్ని ప్రభుత్వ చీఫ్ విప్ రఘునాథ రెడ్డి వెల్లడించారు. బీసీలకు ఫెడరేషన్ల ఏర్పాటు కావడంతో బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో కొత్త శకం మొదలైందన్నారు. 11 ఫెడరేషన్లకు రూ.3 వేల కోట్లను బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఎం.ఎస్.ఎం.ఇ, విద్యాశాఖ, 24 గంటలూ విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం వేలాది కోట్లు వెచ్చిస్తోందన్నారు. గత నాలుగున్నరేళ్లలో ఒక్క వ్యవసాయానికే రూ.81,554 కోట్లు ఖర్చు చేశామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడితే, తమ ప్రభుత్వ హయాంలో ప్రతి రూపాయీ ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి వినియోగించామన్నారు. ఇప్పటి వరకూ రూ.32,843 కోట్లను ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద వెచ్చించామన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో ఎస్సీలకు రూ.14,367 కోట్లు, ఎస్టీలకు రూ.5,328 కోట్లు కేటాయించామన్నారు. సంక్షేమ పథకాలు అమలులో దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీయే ముందంజలో ఉందన్నారు. లోటు బడ్జెట్ ఉన్నా నవ్యాంధ్రప్రదేశ్ 10.66 శాతం అభివృద్ధి రేటు సాధించి, దేశం కంటే ముందుందన్నారు. సాంకేతిక ప‌రిజ్ఞానంతో ప్రభుత్వ పథకాల అమల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపే బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబు నాయుడుకు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ విప్ చాంద్ బాషా మాట్లాడుతూ అన్ని కులాలకు, మతాలకు, వర్గాలకు ప్రస్తుత బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చార‌ని తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి గతేడాది కంటే ఈ ఏడాది 18 శాతం అధికంగా కేటాయించడం ఆనందకరమన్నారు.

Just In...