Published On: Thu, Jun 13th, 2019

పోలవరంపై ఖర్చులను వెనక్కి ఇవ్వండి!

* కేంద్రాన్ని కోరిన ఏపీ ప్రభుత్వం

సెల్ఐటి న్యూస్‌, దిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులను వెనక్కి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్ర జలవనరుల శాఖ అధికారులు.. ఆర్థిక శాఖ అనుమతి కోసం దస్త్రాన్ని పంపారు. కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి ఆమోదం తర్వాతే నిధులు విడుదలకు అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆర్థిక శాఖ అనుమతి వస్తే.. ఆ దస్త్రాన్ని జలవనరుల శాఖ నాబార్డుకు పంపనుంది. స్టాప్‌వర్క్‌ ఉత్తర్వులను శాశ్వతంగా నిలుపుదల చేసే అంశంపైనా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ దస్త్రం కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఉన్నతాధికారుల పరిశీలనలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. నవ్యాంధ్ర ప్రజల జీవనాడి ప్రాజెక్టుగా ఉన్న పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.5వేల కోట్లు ఖర్చుచేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అయినప్పటికీ.. రాష్ట్రం ఖర్చు చేస్తోంది. ఆ మొత్తాన్ని కేంద్రం చెల్లించాల్సి ఉన్నా కొంత ఆలస్యం నెలకొంది. ఏపీ నూతన సీఎంగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరంపై ప్రత్యేకంగా దృష్టిసారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రం పెట్టిన ఖర్చు మొత్తాన్ని కేంద్రం నుంచి రాబట్టేందుకు చర్యలు చేపట్టాలని ఇటీవల జరిగిన అధికారుల సమీక్షలో ఆదేశించారు. పోలవరం విషయంలో కేంద్రంతో అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఏపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పోలవరంపై పెట్టిన ఖర్చులను వెనక్కి ఇవ్వాలంటూ రాష్ట్ర అధికారులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Just In...