Published On: Fri, Jul 13th, 2018

పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేస్తాం

* ఈ ప్రాజెక్టు దేశానికే ప్ర‌తిష్టాత్మ‌కం

* సేకరించాల్సిన భూమీ రెండు రెట్లు పెరిగింది 

* ‘పోలవరం’ ప్రాజెక్టు సంద‌ర్శ‌న‌లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ 

సెల్ఐటి న్యూస్‌, పోల‌వ‌రం: సాంకేతికపరమైన అంశాలను అధిగమించేందుకు కేంద్ర బృందం మూడు రోజుల పాటు ఇక్కడ అధ్యయనం చేసి వాటిని అధిగమించేందుకు సానుకూల నివేదికతో కూడిన సూచనలను అందిస్తుందని, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత కేంద్రంపై ఉందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అదేవిధంగా ఈ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో చేపట్టిన గత పర్యటన నుంచి ఈ పర్యటనకు వరకు జరిగిన పనుల వివరాలను కేంద్ర మంత్రికి వివరించారు. పోలవరం నిర్వాసిత ప్రాంతాలకు 2013 ఆర్ ఆర్ ప్యాకేజీకి లోబడి జరపాల్సిన చెల్లింపుల వల్ల అంచనా వ్యయం పెరిగిందని వివరించారు. జులై 11న (బుధవారం) పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో కేంద్ర మంత్రితో కలసి ముఖ్యమంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రతినెలా ప్రాజెక్టును సందర్శిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత సమస్య కాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు పూర్తి వ్యయం ప్రస్తుతం రూ. 60 వేల కోట్లకు చేరుతోందన్న మంత్రి పూర్తి వ్యయంలో సగం భూ సేకరణకే ఖర్చు అవుతోందన్నారు. ఓ రైతుగా తనకు నీటి విలువ తెలుసునని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. భూసేకరణ చాలా కీలకమైన సమస్య అని, నూతన భూసేకరణ చట్టం ప్రకారమే నిధులు కేటాయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ప్రాజెక్టు పరిధిలోని గిరిజనులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తుందని తెలిపారు. 2019 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఆర్థిక మంత్రి అనుమతులు మంజూరు చేసిన వెంటనే ముందస్తు నిధులు విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రాజెక్టును పూర్తిచేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గట్టిగా ప్రయత్నిస్తున్నారని మంత్రి ప్రశంసించారు.
               ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ పోలవం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి వంటిదని అన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి డయాఫ్రమ్ వాల్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, మొత్తంగా 26 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయినట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ వ్యయం బాగా పెరిగిందని, ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. అంతకు ముందు నితిన్ గడ్కరీ సాయంత్రం ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం చేరుకున్న మంత్రి అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా పొలవరం నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రితో కలసి కేంద్ర మంత్రి పోలవరం స్పిల్ వే పనుల్ని పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన నిర్మాణ పనుల వివరాలను అధికారులు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి వివరించారు. పనుల్లో పురోగతి, ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగిస్తున్న సాంకేతికత తదితర అంశాలపై గడ్కరీ అధికారులతో చర్చించారు. పర్యటనలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కె.యస్.జవహర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎంపీ గోకరాజు గంగరాజు, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి శశిభూషన్ కుమార్, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కె.భాస్కర్, ఇరిగేషన్ ఉన్నతాధికారులు, కేంద్ర బృందం అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
 

Just In...